మంగళవారం 20 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 18:32:36

పెట్రోల్‌బంక్‌లో దుండగుల హల్‌చల్‌..సిబ్బందిపై దాడికి యత్నం

పెట్రోల్‌బంక్‌లో దుండగుల హల్‌చల్‌..సిబ్బందిపై దాడికి యత్నం

నిజామాబాద్‌ ‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణ శివారులోని నర్సి వెళ్లే రహదారి పక్కన ఉన్న షిర్డీ సాయి జ్యోతి ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. స్థానిక పోలీసులు, ఫిల్లింగ్‌ స్టేషన్‌ సిబ్బంది తెలిపిన కథనం మేరకు.. ఆదివారం రాత్రి 11గంటలు దాటాకా ముసుగులు ధరించిన నలుగురు దుండగులు పెట్రోల్‌ బంక్‌లోకి వస్తూ సిబ్బందిపై రాళ్లు రువ్వుతూ దాడికి యత్నించారు. 

రాళ్ల బస్తాతో వచ్చిన దుండగులు, రాళ్లు రువ్వడంతో పాటు, కత్తులతో బెదిరించగా సదరు సిబ్బంది అక్కడి నుంచి పక్కనే ఉన్న దాబా హోటల్లోకి వెళ్లారు. దుండగులు ముగ్గురు ముందుగా రాళ్లను రువ్వి, ర్యాక్‌ను తీసుకుని పక్కకు వెళ్లారు. అనంతరం మరో దుండగుడు ఆఫీస్‌లోకి వెళ్లి కాగితాలు చిందరవందర చేశాడు.  పక్కనే దాబా హోటల్లోకి వెళ్లిన సిబ్బంది కేకలు వేయడంతో హోటల్‌లో ఉంటున్న వ్యక్తులు బయటకు రావడంతో దుండగులు పరారయ్యారు.

సమాచారం అందిన వెంటనే బోధన్‌ పట్టణ సీఐ పల్లె రాకేశ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దుండగుల కోసం రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం సదరు పెట్రోల్‌ బంక్‌ యజమాని వెంకటేశ్వర్లుతో వివరాలు సేకరించారు. దుండగులు పెట్రోల్‌ బంక్‌ వెనుక వైపున విద్యుత్‌ తీగలను తొలగించి, దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


logo