ఆదివారం 01 నవంబర్ 2020
Crime - Oct 01, 2020 , 10:31:58

యూపీలో ఆగ‌ని అత్యాచారాలు.. మ‌రో ద‌ళిత యువ‌తి మృతి

యూపీలో ఆగ‌ని అత్యాచారాలు.. మ‌రో ద‌ళిత యువ‌తి మృతి

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో అత్యాచార ఘ‌ట‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. హత్రాస్‌ ఘటన మరువక ముందే మరో మూడు ఘోరాలు వెలుగు చూశాయి. మ‌రో ద‌ళిత యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఓ 14 ఏళ్ల బాలిక‌పై ప‌క్కింటి యువ‌కుడు కామంతో చెల‌రేగిపోయాడు. ఓ 20 ఏళ్ల యువ‌కుడు ఎనిమిదేళ్ల చిన్నారిపై మృగంలా విరుచుకుప‌డ్డాడు. చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. 

బల్‌రామ్‌పూర్‌కు చెందిన 22 ఏళ్ల యువ‌తి కాలేజీ అడ్మిష‌న్ కోసం ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌ల్దేరింది. అనంత‌రం సాయంత్రం ఇంటికి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఆ యువ‌తిని ఇద్ద‌రు యువ‌కులు అడ్డ‌గించారు. ఆమెకు మ‌త్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశారు. కాగా, సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్‌ బాటిల్‌తో ఈ-రిక్షాలో ఇంటికి చేరింది. తనకు కడుపులో ఏదో కాలిపోతున్నట్లు ఉందని, నడవలేనని తల్లికి చెప్పింది. తనను రక్షించాలను, తనకు చావాలని లేదని ఏడుస్తూ తన తల్లిని బతిమాలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. 

ఆమె ప‌రిస్థితి విషమించ‌డంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం ల‌క్నోకు త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే యువ‌తి ప్రాణాలు విడిచింది. మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి అయింది. మృగాళ్లు ఆమె నడుమును విరచడంతో పాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని డాక్టర్లు వెల్లడించారు.  

ద‌ళిత యువ‌తిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని పోలీసులు తెలిపారు. 

14 ఏళ్ల బాలిక‌పై ప‌క్కింటి యువ‌కుడు

యూపీలోని బులంద్‌షర్‌లో ఓ 14 ఏళ్ల బాలికపై పక్కింటి యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి గురైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ఎనిమిదేళ్ల చిన్నారిపై 20 ఏళ్ల యువ‌కుడు

అజాంఘర్‌ జిల్లాల్లోనూ దారుణం జరిగింది. 20 ఏళ్ల యువకుడు ఎనిమిదేళ్ల చిన్నారిపై కామంతో చెలరేగిపోయాడు. ఆ చిన్నారికి స్నానం చేయిస్తానని ఆమె తల్లికి మాయమాటలు చెప్పి తమ ఇంట్లోకి తీసుకెళ్లాడు. తల్లిని నమ్మించేందుకు చిన్నారి దుస్తులు కూడా పట్టుకెళ్లాడు. అయితే అతను చిన్నారికి స్నానం చేయించకుండా.. అత్యాచారం చేశాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఇంటికి చేరుకుంది బాలిక. తీవ్ర రక్తస్రావం కూడా అవుతోంది. దీంతో బాధితురాలి తల్లి తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దనీష్‌గా పోలీసులు గుర్తించారు.