బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 15:30:32

లోదుస్తుల్లో బంగారం.. ప‌ట్టేసిన‌ క‌స్ట‌మ్స్ అధికారులు

లోదుస్తుల్లో బంగారం.. ప‌ట్టేసిన‌ క‌స్ట‌మ్స్ అధికారులు

కొచ్చి: కేర‌ళ‌లోని క‌న్నూర్, కోజికోడ్‌ విమానాశ్రయాల్లో సోమ‌వారం భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. ఇద్ద‌రు వేర్వేరు ప్ర‌యాణికుల నుంచి అధికారులు దాదాపుగా కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. క‌న్నూర్ విమానాశ్ర‌యంలో దిగిన ఓ ప్ర‌యాణికుడి న‌డ‌క‌తీరును అనుమానించిన ఏయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు, అత‌డిని ప‌ట్టుకుని చెక్ చేయ‌గా ముద్ద రూపంలోగ‌ల‌ 1172 గ్రాముల బంగారం మిశ్ర‌మం బ‌య‌ట‌ప‌డింది. 

స‌ద‌రు ప్ర‌యాణికుడు ఆ బంగారాన్ని పాలీథిన్ క‌వ‌ర్లో పెట్టి, ఆ క‌వ‌ర్‌ను డ్రాయ‌ర్‌లో పెట్టుకుని అక్ర‌మంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని కొచ్చి క‌స్ట‌మ్స్ క‌మిష‌న‌రేట్ అధికారులు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ బంగారం విలువ సుమారుగా రూ.47.63 ల‌క్ష‌లు ఉంటుంద‌ని చెప్పారు.  

ఇలాంటిదే మ‌రో ఘ‌ట‌న కోజికోడ్ విమానాశ్ర‌యంలో చోటుచేసుకుంది. జెడ్డా నుంచి కోజికోడ్‌కు వ‌చ్చిన ఓ ప్రయాణికుడిని ఏయిర్ ఇంటెలిజెన్స్  అధికారులు ‌త‌నిఖీ చేయ‌గా అతని ద‌గ్గ‌ర 250 గ్రాముల బంగారం ప‌ట్టుబ‌డింది. నిందితుడి బ్యాగేజ్‌లో ఉన్న ఐరెన్ బాక్సులో చిన్నచిన్న క‌డ్డీల రూపంలో ఉన్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ సుమారుగా రూ.12 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo