బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 22, 2020 , 17:52:19

శ్రీకాళహస్తి విగ్రహాల నిందితులు అరెస్టు

 శ్రీకాళహస్తి విగ్రహాల నిందితులు అరెస్టు

చిత్తూరు : ఇటీవల శ్రీకాళహస్తి విగ్రహాలప్రతిష్ట కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఎట్టకేలకు ఘటన మిస్టరీ వీడింది. శ్రీకాళహస్తి ఆలయంలో రాతి శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించిన ముగ్గురు వ్యక్తులను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు ముగ్గురు అన్నదమ్ములు ఆ విగ్రహాలను ప్రతిష్టించినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వివరాలను అర్బన్‌ ఎస్పీ రమేశ్‌రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాల ద్వారా ఛేదించినట్లు ఆయన చెప్పారు.

సుమారు 100 సీసీ టీవీ కెమెరాల విజువల్స్‌ను పరిశీలించి నిందితులను గుర్తించామన్నారు. నిందితులను చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు పిండి శూలవర్ధన్(32), పిండి తిరుమలయ్య (30), పిండి మునిశేఖర్(28)గా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. తిరుమలయ్య, మునిశేఖర్ చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. 30 ఏండ్లు దాటినా వివాహం కాకపోవడం, ఆర్థిక సమస్యలు అధిగమించడానికి జ్యోతిష్యుల సూచన మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠకు నిర్ణయించారు.

ఈ క్రమంలో ఈనెల ఆరో తేదీన ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo