శనివారం 23 జనవరి 2021
Crime - Oct 02, 2020 , 18:05:56

పోలీసుల కస్టడీ నిందితుడు మృతి...

పోలీసుల కస్టడీ నిందితుడు మృతి...

అమరావతి: విజయవాడలో పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మృతి చెందాడు. గతనెల 17న విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలో ఆర్టీసీ కార్గో వాహనంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కార్గో వాహనాన్ని పరిశీలించిన పోలీసులకు అక్రమంగా 28 కార్టన్ల మద్యం బయటపడింది. ఆ సరకు సంబంధించిన వ్యక్తి నంబర్ల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఆర్టీసీ సిబ్బందిని విచారించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణలంక పెద్దివారివీధికి చెందిన డి.అజయ్‌ (25) అనే వ్యక్తి పేరు మార్చుకొని మద్యాన్ని అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు.

ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అజయ్‌తోపాటు మొగల్రాజపురానికి చెందిన సాయికిరణ్‌లను గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పక్కనున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరిని పటమట ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా అజయ్‌ ఒక్కసారిగా తనకు ఛాతీలో నొప్పిగా ఉందని, ఒళ్లు చల్లబడుతోందని, ఊపిరి ఆడటం లేదని చెప్పాడు. వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అజయ్‌ అస్వస్థతతో ఇబ్బందిపడుతుంటే ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


logo