శుక్రవారం 29 మే 2020
Crime - Mar 04, 2020 , 19:11:16

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

కామారెడ్డి: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ). వివరాల్లోకెళ్తే.. లింగపేట మండలానికి చెందిన ఓ రైతు.. పట్టాపాసు పుస్తకం జారీ కోసం నిత్యం రెవెన్యూ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే సదరు రైతు ఆర్‌ఐ సుభాష్‌ను కలిసి తన గోడును వినిపించాడు. సంవత్సరాలు గడుస్తున్నా, తన భూమికి సంబంధించిన పట్టాపాసు పుస్తకాలు రావడం లేదని ఆవేదనగా తెలిపాడు. దీంతో, రైతు బలహీనతను గుర్తించిన ఆర్‌ఐ లంచం డిమాండ్‌ చేశాడు. డబ్బు ఇస్తేనే పని అవుతుందని రైతుకు తెలిపాడు. అందుకు రైతు సరేనన్నాడు. ముందుగా రైతు.. ఏసీబీ అధికారులకు సమాచారం అందించి, తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. అతనితో పాటు ఏసీబీ అధికారులు కూడా సాధారణ డ్రెస్సుల్లో కార్యాలయానికి చేరుకున్నారు. రైతు నుంచి  ఆర్‌ఐ రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు అతనిని పట్టుకున్నారు. అతడిని అరెస్ట్‌ చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 

కాగా, రూపాయి లంచం తీసుకోకుండా ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ప్రజలకు, రైతులకు సేవ చేయాలనీ.. వారి బాధను అర్థం చేసుకొని, వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిత్యం అధికారులకు సూచనలు చేస్తున్నారు. కాదని ఎవరైనా రైతుల నుంచి లంచాలు లాగితే.. కఠిన చర్యలు తప్పవని పలుమార్లు హెచ్చరించారు. అయినా, కొందరి ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. అక్రమ మార్గంలో సంపాదించాలని పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 


logo