బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 14, 2020 , 17:31:10

ప్ర‌స‌వానంత‌రం భార్య మ‌ర‌ణం.. తట్టుకోలేక భ‌ర్త కూడా..

ప్ర‌స‌వానంత‌రం భార్య మ‌ర‌ణం.. తట్టుకోలేక భ‌ర్త కూడా..

విశాఖ‌ప‌ట్ట‌ణం : వారిద్ద‌రూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల‌ను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల ప్రేమ‌కు ప్ర‌తిరూపంగా పండంటి బిడ్డ జ‌న్మించాడు. కానీ ప్ర‌స‌వానంత‌రం ఫిట్స్ తో భార్య మ‌ర‌ణించింది. ఆమె మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇప్పుడు వారి ప‌సిబిడ్డ అనాథగా మారాడు. ఈ విషాద ఘ‌ట‌న విశాఖ జిల్లాలోని సింహాచ‌లం కొండ‌పైన ఉన్న ఓ గిరిజ‌న గ్రామంలో జులై 12న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

గిరిజ‌న గ్రామానికి చెందిన జ‌లుమూరి శ్రావ‌ణ్ కుమార్‌(20), స్థానికంగా ఉండే అంబిక‌ను ప్రేమించాడు. వీరి ప్రేమ‌ను పెద్ద‌ల‌కు చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నారు. ఏడాది కింద‌టే వీరికి పెద్ద‌లు పెళ్లి చేశారు. ఆమె గ‌ర్భం దాల్చింది. ఇటీవ‌లే అంబిక‌కు నెల‌లు నిండ‌డంతో.. ప్ర‌స‌వం కోసం ఈ నెల 6 విశాఖ కేజీహెచ్ కు తీసుకెళ్లారు. డెలివ‌రీ స‌మ‌యంలో గ‌ర్భిణికి ఫిట్స్ రావ‌డంతో.. సిజేరియ‌న్ చేశారు. పండంటి మ‌గ‌బిడ్డ‌కు అంబిక జ‌న్మ‌నిచ్చింది. అయితే జులై 8వ తేదీన ఆమె తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది. ఆ రోజే చ‌నిపోయింది. భార్య మ‌ర‌ణంతో భ‌ర్త శ్రావ‌ణ్ తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. ఆమె లేని జీవితం త‌న‌కెందుకని భావించాడేమో.. ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు శ్రావ‌ణ్‌.   

భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ మ‌ర‌ణించ‌డంతో.. ఆ ప‌సిబిడ్డ అనాథ అయ్యాడు. దీంతో అటు శ్రావ‌ణ్‌, ఇటు అంబిక నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo