గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 16, 2020 , 17:01:10

ఆస్తిలో వాటా అడిగినందుకు ప్రియురాలి హ‌త్య‌

ఆస్తిలో వాటా అడిగినందుకు ప్రియురాలి హ‌త్య‌

బెంగ‌ళూరు : ఆమెకు పెళ్లైంది. కానీ భ‌ర్త‌తో వివాదాల కార‌ణంగా పెళ్లైన కొద్ది రోజుల‌కే పుట్టింటికి వ‌చ్చేసింది. ఒంట‌రిగా ఉన్న ఆమెకు ఓ వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. ఆ ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ప‌దిహేను సంవ‌త్స‌రాలు ఆయ‌న‌తో గ‌డిపినందుకు త‌న‌కు కూడా ఆస్తిలో వాటా కావాల‌ని డిమాండ్ చేసింది. ఆస్తి కోసం డిమాండ్ చేస్తావా? అంటూ ఆమెను ప్రియుడు అంత‌మొందించాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌గ‌రిబొమ్మ‌న‌హ‌ళ్లి ప్రాంతంలో బుధ‌వారం వెలుగు చూసింది. 

గిరిగూండ‌న‌హ‌ళ్లి గ్రామానికి చెందిన డీ హులిగ‌మ్మ‌(42)కు హోసపేట‌కు చెందిన ఓ వ్య‌క్తితో వివాహ‌మైంది. కానీ వారి కాపురంలో క‌ల‌హాలు మొద‌ల‌య్యాయి. దాంతో కొన్నాళ్ల‌కే ఆమె భ‌ర్త‌ను విడిచిపెట్టి పుట్టింటికి తిరిగొచ్చింది. ఒంట‌రిగా ఉన్న ఆమెకు సొంతూరులోనే సిద్ధ‌లింగ‌ప్ప అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. ఆ ప‌రిచ‌యం అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. 

పదిహేను సంవ‌త్స‌రాల నుంచి హులిగ‌మ్మ‌తో లింగ‌ప్ప వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఆమె కుటుంబాన్ని కూడా లింగ‌ప్ప‌నే పోషిస్తున్నాడు. అయితే లింగ‌ప్ప‌కు భారీగా ఆస్తులు ఉన్న‌ట్లు హులిగ‌మ్మ‌కు తెలియ‌డంతో త‌న‌కు కూడా వాటా కావాల‌ని డిమాండ్ చేసింది. కుటుంబాన్ని పోషిస్తున్నాను. నీ కోరిక‌లు తీర్చుతున్నాను. మ‌ళ్లీ ఆస్తిలో కూడా వాటా కావాలా? అని ఆమెను అడిగాడు. ఆస్తి కోసం ఆమె మొండి ప‌ట్టుప‌ట్ట‌డంతో.. ఈ నెల 13వ తేదీన త‌న పొలం వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ హులిగ‌మ్మ‌ను చంపేసి.. పొలంలోనే పాతిపెట్టాడు. 

రెండు రోజులు అయినా హులిగ‌మ్మ ఇంటికి తిరిగి రాక‌పోయేసరికి.. ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కుటుంబ స‌భ్యులు కూడా సిద్ధ‌లింగ‌ప్ప‌పైనే అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో అత‌న్ని పోలీసులు విచారించ‌గా చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. బుధ‌వారం రోజు హులిగ‌మ్మ మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు పోలీసులు. నిందితుడిని కోర్టులో హాజ‌రుప‌రిచి జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించారు.


logo