ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 10, 2020 , 18:23:44

ఆర్టీసీ బస్టాండ్ లో విషం తాగిన ప్రేమ‌జంట‌

ఆర్టీసీ బస్టాండ్ లో విషం తాగిన ప్రేమ‌జంట‌

కర్నూల్ : ఓ ఇద్ద‌రు యువ‌తీయువ‌కులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ వీరి ప్రేమ పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోలేదు. దీంతో ఓ గుడిలో ప్రేమికులిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. ర‌క్ష‌ణ కోసం పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తే వారు కూడా త‌మ ప‌రిధిలోకి రాద‌న్నారు. తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఆ న‌వ దంప‌తులు ఆర్టీసీ బ‌స్టాండ్ లో విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. 

క‌ర్నూల్ జిల్లాలోని మ‌ద్దికెర మండ‌లానికి చెందిన ఓ యువ‌కుడు.. గ‌త రెండేళ్ల నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిది అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు. అయితే వీరిద్ద‌రి కులాలు వేరు కావ‌డంతో.. పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌లేదు. దీంతో ఈ ప్రేమికులిద్ద‌రూ ఇంటి నుంచి వెళ్లిపోయి బుగ్గ సంగ‌మేశ్వ‌ర ఆల‌యంలో పెళ్లి చేసుకున్నారు. 

ఆ త‌ర్వాత త‌మ‌కు ఇరు కుటుంబాల పెద్ద‌ల నుంచి ర‌క్ష‌ణ కావాల‌ని మ‌ద్దికెర పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో న‌వ దంప‌తుల కుటుంబాల‌ను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.  కుటుంబ పెద్ద‌లు మాత్రం వీరి పెళ్లిని ఒప్పుకోవ‌డం లేదు. వారిద్ద‌రిని త‌మ వెంట పంపించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. చేసేదేమీ లేక పోలీసులు.. ఈ కేసు త‌మ ప‌రిధిలోకి రాద‌ని స్ప‌ష్టం చేశారు. క‌సాపురం పోలీసు స్టేష‌న్ కు వెళ్లాల‌ని ఆ ప్రేమ జంట‌కు మ‌ద్దికెర పోలీసులు సూచించారు. మ‌ద్దికెర బ‌స్టాండ్ చేరుకున్న నూత‌న దంప‌తులు.. విషం సేవించి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. వీరిని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రేమికుల ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వారిని అనంత‌పురం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. 


logo