పట్టపగలే దళిత యువకుడు దారుణ హత్య

కర్నూల్ : పట్టపగలే ఓ దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని ఆదోనిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నందవరం మండలం గురజాలకు చెందిన ఆడమ్‌స్మిత్(35) ఆదోనిలో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురజాల గ్రామానికి చెందిన మహేశ్వరిని గత కొంతకాలం నుంచి ఆడమ్‌స్మిత్ ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయం తెలియక మహేశ్వరికి 2020, నవంబర్‌లో మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. మహేశ్వరి మనసులో ఆడమ్‌స్మిత్ ఉండటంతో బ్యాంకు కోచింగ్‌కు నంద్యాల వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆడమ్‌స్మిత్, మహేశ్వరి కలిసి హైదరాబాద్‌కు వచ్చి నవంబర్ 12న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేశ్వరి పెళ్లి చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. ఆడమ్‌స్మిత్‌ను చంపేస్తామంటూ ఫోన్లో బెదిరించారు.
ఈ నేపథ్యంలో మహేశ్వరి, ఆడమ్‌స్మిత్ కలిసి తమకు ప్రాణభయం ఉందని డిసెంబర్ ఒకటో తేదీన కర్నూల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు మండల సీఐ మంజునాథ్.. ఇరు కుటుంబాలను పిలిపించి నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆడమ్‌స్మిత్ తనకు ముఖ్యమని మహేశ్వరి చెప్పింది. ఇప్పుడే ఊర్లోకి రావొద్దని, వస్తే తన పరువు పోతుందని మహేశ్వరి తండ్రి చెప్పడంతో.. తాము గురజాలకు రాబోమని, ఆదోనిలోనే ఉంటామని నవ దంపతులు చెప్పారు. అనంతరం మహేశ్వరి తల్లిదండ్రులు వెనక్కితగ్గి గురజాలకు వెళ్లిపోయారు.
కానీ ఆడమ్స్మిత్పై మహేశ్వరి కుటుంబ సభ్యులకు కోపం చల్లారలేదు. ఆదోనిలోని ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న ఆడమ్‌స్మిత్‌ను గురువారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ఒంటరిగా దొరికించుకుని రాడ్లతో దాడి చేశారు. తలపై రాయితో మోదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆడమ్‌స్మిత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే స్మిత్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన భర్త హత్యకు తన తండ్రి కారణమని మహేశ్వరి ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.