శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 05, 2020 , 18:00:41

మోదీ న‌గ‌ర్ లో పేలుళ్లు.. 8 మంది మృతి

మోదీ న‌గ‌ర్ లో పేలుళ్లు.. 8 మంది మృతి

ల‌క్నో : ఘ‌జియాబాద్ లోని మోదీ న‌గ‌ర్ త‌హ‌సీల్ ప‌రిధిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బార్ఱ్వాన్ గ్రామంలోని బాణాసంచా క‌ర్మాగారంలో ఆదివారం మ‌ధ్యాహ్నం పేలుళ్లు సంభ‌వించాయి. ఈ పేలుళ్ల ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంట‌ల‌ను అగ్నిమాప‌క సిబ్బంది ఆర్పివేసింది.  

ఫ్యాక్ట‌రీలో పేలుళ్లు సంభ‌వించిన స‌మ‌యంలో మొత్తం 30 మంది ప‌ని చేస్తున్నారు. పేలుళ్ల ధాటికి మంట‌లు ఎగిసిప‌డ‌టంతో.. కార్మికులు బ‌య‌ట‌కు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. అప్ప‌టికే మంట‌లు వ్యాపించ‌డంతో కొంద‌రు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మంట‌ల వ్యాప్తి నేప‌థ్యంలో ఆ చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.  

గ‌త ఐదు సంవ‌త్స‌రాల నుంచి బాణాసంచా ఫ్యాక‌ర్టీని అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. అయితే ఈ అక్ర‌మ ఫ్యాక్ట‌రీపై గ్రామ‌స్తులు పోలీసులు, అధికారుల‌కు ప‌లుసార్లు ఫిర్యాదు చేశారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని గ్రామ‌స్తులు వాపోయారు. మొత్తానికి పేలుళ్ల త‌ర్వాత మోదీ న‌గ‌ర్ పోలీసులు ఫ్యాక్ట‌రీని త‌నిఖీ చేశారు. ఫ్యాక్ట‌రీ నిర్వాహ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


logo