ఆదివారం 29 నవంబర్ 2020
Crime - Oct 25, 2020 , 06:18:39

పండుగ పూట విషాదం.. ఇల్లు కూలి ఐదుగురి దుర్మరణం

పండుగ పూట విషాదం.. ఇల్లు కూలి ఐదుగురి దుర్మరణం

వనపర్తి : గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో పండుగ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఏడాది కిందట ఇంటి యజమాని కోమటిచెవ్వ నరసింహ మృతి చెందాడు. శనివారం సంవత్సరీకం కావడంతో నలుగురు కొడుకులు, కోడళ్లు వారి పిల్లలతో కలిసి ఇంటికి వచ్చారు.

కార్యక్రమం అనంతరం రాత్రి భోజనాలు చేసి అందరూ కలిసి ఒకే గదిలో సభ్యులు పడుకున్నారు. పాత ఇల్లు కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసింది. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండగా రాత్రి 2 గంటల ప్రాంతంలో పైకప్పు ఒక్కసారిగా కూలి వారిపై పడింది. గదిలో నిద్రిస్తున్న ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకి మృతి చెందారు.

మణెమ్మ కుమారుడు కుమారస్వామితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తుల సహకారంతో వెలికి తీశారు. క్షతగాత్రుల హాహాకారాలు, బంధువుల రోదనలు సంఘటనా స్థలంలో మిన్నంటాయి.

దసరా పండుగకు గ్రామస్తులు సిద్ధమవుతున్న వేళ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడడంతో విషాదచాయలు అలుముకున్నాయి. అర్ధరాత్రి ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఇన్‌చార్జి, నాగర్ కర్నూల్‌ ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్‌ఐ రామన్ గౌడ్, స్థానిక గోపాలపేట మండల తహశీల్దార్ నరేందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఘటన దురదృష్టకరం : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : బుద్దారం గ్రామంలో ఇల్లు కూలి ఐదుగురు గురు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఇంటిపెద్ద కోమటిచెవ్వ నరసింహ సంవత్సరీకానికి వచ్చి ఏడాదిగా ఉపయోగంలో లేని ఇంట్లో ఉన్న కుటుంబీకులు దురదృష్టవశాత్తు మరణించడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.