శనివారం 23 జనవరి 2021
Crime - Dec 07, 2020 , 16:47:06

గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురికి 20 ఏళ్ల జైలుశిక్ష‌

గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురికి 20 ఏళ్ల జైలుశిక్ష‌

రంగారెడ్డి : గ‌తేడాది ఆగ‌స్టులో మ‌హేశ్వ‌రంలో ఓ మ‌హిళ‌పై న‌లుగురు యువ‌కులు క‌లిసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ కేసులో రంగారెడ్డి కోర్టు సోమ‌వారం తీర్పును వెల్ల‌డించింది. మ‌హిళ‌పై గ్యాంగ్‌రేప్ చేసిన న‌లుగురు యువ‌కుల‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచార‌ణ జ‌రిపి న‌లుగురు నిందితుల‌కు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 

కేసు పూర్వ‌ప‌రాలు.. 

ఒడిశాలోని బలంగీర్ జిల్లాకు చెందిన బాధితురాలు (30) జీవనోపాధి కోసం తన భర్త, రెండేళ్ల కుమారుడితో కలిసి రంగారెడ్డి జిల్లాలోని మ‌హేశ్వ‌రానికి వచ్చింది. మహేశ్వరం మండలం నాగులదోని తండాలోని ఇటుక బట్టిలో భర్తతో కలిసి పనిచేస్తోంది. వీరితోపాటు అదే జిల్లాకు చెందిన నలుగురు యువకులు రాహుల్‌ మాజీ(25), మనోజ్‌ సమారత్‌(23), దుర్గా సమారత్‌(20), దయా మాజీ(20) అక్కడే పనిచేస్తున్నారు.

ఇటుక బట్టీల వద్దే వీరంతా నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో బాధితురాలు బహిర్భుమి వెళ్లగా, అప్పటికే కాచుకుని ఉన్న ఈ నలుగురు యువకులు ఆమెను వెంబడిచారు. అనంతరం ఆమెను అపహరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యం గురించి బాధిత మహిళ తన భర్తకు చెప్పడంతో అతడు ఇటుక బట్టీ యజమానికి తెలియజేశాడు.

ఆయన సాయంతో మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ద‌ర్యాప్తులో భాగంగా న‌లుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తంగా ఈ కేసులో సోమ‌వారం రంగారెడ్డి కోర్టు తీర్పును వెల్ల‌డించింది.


logo