శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 17:18:56

38 ఏండ్ల కింద దొంగతనం.. ఇప్పుడు పట్టుకున్నారు

38 ఏండ్ల కింద దొంగతనం.. ఇప్పుడు పట్టుకున్నారు

అహ్మదాబాద్ : 38 సంవత్సరాల క్రితం ఒక బ్యాంకులో రూ.1.32 లక్షలు దోచుకుని గుట్టుగా జీవితం గడుపుతున్న ఓ గజదొంగను గుజరాత్ పోలీసులు పట్టుకొన్నారు. బ్యాంకు దోపిడీ సమయంలో ఈ గజదొండ ఒక పోలీసును కూడా చంపాడు. ఇన్నేండ్లుగా పోలీసుల కంట పడకుండా జీవితం గడుపుతున్న దొంగ గుట్టు రట్టయింది. ఈ గజదొంగ గంగన్నను రాజస్థాన్ లో అరెస్టు చేసి గుజరాత్ తీసుకువస్తున్నారు. ఇప్పుడీ దొంగ వయసు 68.  

గుజరాత్ లోని బనస్కాంత జిల్లా కేంద్రంలోని అమిర్ ఘర్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1982 డిసెంబర్ 30 వ తేదీన కొందరు దొంగలు దోచుకొన్నారు. ఈ ఘటనలో బ్యాంకు మేనేజర్పై దాడి చేసి హెడ్ కానిస్టేబుల్ శివదత్ శర్మను చంపేశారు. అనంతరం రూ.1.32 లక్షలు తీసుకొని పారిపోయారు. ఈ ముఠాలోని ఇద్దరు సభ్యులను దోపిడీ జరిగిన కొద్ది రోజులకే అరెస్టు చేయగా, గ్యాంగులోని మరో నలుగురు మరణించారు. ముఠాలోని దీప్ సింగ్ రాజ్‌పుత్ ఒక్కడే జీవించి ఉన్నాడు. దీప్ సింగ్ పై హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి 9 కేసులు రాజస్థాన్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ విషయాన్ని బనస్కాంతకు చెందిన ఎస్పీ తరుణ్ కుమార్ దుగ్గల్ మీడియాకు వెల్లడించారు. పాలన్‌పూర్‌కు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం రాజస్థాన్‌లోని బార్మెర్‌కు వెళ్లి 68 ఏళ్ల దీప్ సింగ్ రాజ్‌పుత్‌ను అరెస్టు చేసింది. తదుపరి విచారణ నిమిత్తం దీప్ సింగ్ ను గుజరాత్ తరలించారు.


logo