శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 16:46:18

స్నేహం, పెండ్లి అంటూ రూ.34 లక్షలు దోచాడు

స్నేహం, పెండ్లి అంటూ రూ.34 లక్షలు దోచాడు

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పనిచేస్తున్న ఓ నర్సింగ్ అధికారిని ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ నిండాముంచాడు. స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నానని చెప్పి పెండ్లికి నమ్మించి పెద్ద మొత్తంలో కాజేశాడో ప్రబుద్ధుడు. పెండ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా రూ.34 లక్షలు లాక్కున్న నిందితుడు మహ్మద్ సాదిక్ ఇమ్రాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు.. మెహ్రౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.

ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బాధితురాలు కథనం ప్రకారం.. మహ్మద్ సాదిక్ ఇమ్రాన్ అనే వ్యక్తి నుంచి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా ఆయన అభ్యర్థనను అంగీకరించింది. కొన్నిరోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకొన్నారు. దాంతో ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. వివాహం చేసుకుంటానని కూడా వాగ్దానం చేశాడు. అనంతరం కొన్నిరోజులకు ఆమెను తీసుకొని లేహ్-లడఖ్ సందర్శనకు వెళ్లివచ్చారు. తనపై ఆమెకు పూర్తి నమ్మకం కలిగిందని నిర్దారించుకొన్నాక.. హోటల్ వ్యాపారం ప్రారంభించేందుకు కొంత ఆర్థిక సాయం చేయమని అడిగాడు. దాంతో రూ. 33,92,201 మొత్తాన్ని ఇమ్రాన్ ఖాతాకు బదిలీ చేసింది.

డబ్బు తీసుకున్న తరువాత నుంచి ఇమ్రాన్ తనను వెంబడించడం ప్రారంభించడంతో ఆ మహిళ షాక్ అయ్యింది. ఫోన్‌లో మాట్లాడటం గానీ, ఫేస్‌బుక్‌లో సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్నాడు. తనను మోసం చేశాడని గ్రహించిన సదరు మహిళ నిందితుడు ఇమ్రాన్‌పై మెహ్రౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో నిందితుడు ఇమ్రాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పోలీసులు అరెస్టు చేసినట్లు తేలిందని దక్షిణ ఢిల్లీ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై విజయవాడ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. తెలియని వ్యక్తులతో స్నేహం చేయడానికి ముందు ప్రజలు.. వారి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని, డబ్బు అడగిన వెంటనే ఇవ్వకుండా జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు. 


logo