మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 28, 2020 , 17:58:00

అమెరికాలో మహబూబాబాద్‌ యువకుడి మృతి

అమెరికాలో మహబూబాబాద్‌ యువకుడి మృతి

మహబూబాబాద్‌ : మహబూబాబాద్‌ పట్టణం కంకరబోడు కాలనీకి చెందిన గొట్టం చంద్రపాల్‌ రెడ్డి(26) అమెరికాలోని టెక్సాస్‌లో మృతి చెందాడు. ఆయన తల్లిదండ్రులు చెందిన గొట్టం శ్రీనివాసరెడ్డి-శోభారాణి తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నత విద్య అభ్యసించేందుకు 2015లో అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్లాడు. అక్కడ ఎంఎస్‌ పూర్తి చేశాక ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ అభ్యసిస్తున్నాడు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సదరు ప్రైవేట్‌ కంపెనీ మూసేయడంతో చంద్రపాల్‌రెడ్డి ఉద్యోగాన్ని కోల్పోయాడు. అనంతరం ఇటీవలే మళ్లీ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌కు సెలెక్టు అయ్యాడు. దీంతో ఈ నెల 22న అమెరికాలో ఉన్న తన స్నేహితులకు ఓ క్లబ్‌లో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో చంద్రపాల్‌ రెడ్డి కాలు మెలితిరిగి ఒక్కసారిగా కిందపడిపోగా, తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అక్కడి దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, అమెరికాలో అత్యంత ఘనంగా జరుపుకునే క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించడానికి వీలు కలుగలేదు.

అయితే మృతదేహాన్ని తరలించాలంటే అక్కడి నిబంధనల ప్రకారం కచ్చితంగా పోస్టుమార్టం నిర్వహించాలి. మంగళవారం దవాఖానలు తెరిస్తే పోస్టుమార్టం నిర్వహించడానికి వీలు కలుగుతుందని చంద్రపాల్‌ తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నారు. తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు  ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకోవాలని శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.