బుధవారం 25 నవంబర్ 2020
Crime - Oct 08, 2020 , 15:42:59

బాలికతో స్నేహంపై పోలీసులకు హాథ్రస్‌ నిందితుడి లేఖ

బాలికతో స్నేహంపై పోలీసులకు హాథ్రస్‌ నిందితుడి లేఖ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన హాథ్రస్‌ బాలిక మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. 19 ఏండ్ల దళిత బాలికను అగ్రవర్గాలకు చెందిన యువకులు సెప్టెంబర్‌ 14న సామూహిక లైంగిక దాడి చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. నాలుక తెగడంతోపాటు తీవ్రంగా గాయపడిన ఆమె గత నెల 29న ఢిల్లీ దవాఖానలో మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు పోలీసులు, అగ్రవర్గాల వారు బాలిక కుటుంబానిదే తప్పు అన్నట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సందీప్‌ ఠాకూర్‌ యూపీ పోలీసులకు బుధవారం ఒక లేఖ రాశాడు.

‘నేను ఆ బాలిక స్నేహితులం. మేమిద్దరం తరచుగా కలుసుకోవడంతోపాటు అప్పడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. బాలిక తల్లిదండ్రులు మా ఇద్దరి స్నేహాన్ని వ్యతిరేకించారు. ఆ రోజు (సెప్టెంబర్‌ 14న) ఆమెను కలిసేందుకు నేను పొలం వద్దకు వెళ్లాను. ఆ రోజు అక్కడ ఆమెతో పాటు తల్లి, సోదరులు ఉన్నారు. దీంతో తరువాత కలుద్దామని చెప్పి పశువులకు మేత వేసేందుకు వెళ్లిపోయాను. అనంతరం తల్లి, సోదరులు ఆమెను బాగా కొట్టినట్లు గ్రామస్తుల ద్వారా నాకు తెలిసింది. నేను ఎప్పుడు కూడా ఆమెను కొట్టలేదు. ఆమె పట్ల ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. బాలిక తల్లి, సోదరులు నాతో పాటు ముగ్గురు స్నేహితులపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించారు. మేం అమాయకులం. దీనిపై దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం’ అని హిందీలో లేఖ రాశాడు. దీనిపై సందీప్‌తోపాటు మిగతా ముగ్గురు నిందితుల వేలి ముద్రలు కూడా ఉన్నాయి.


అలిగఢ్‌ జైలులో ఉన్న నిందితుడు సందీప్‌ ఠాకూర్‌ ఈ మేరకు బుధవారం లేఖ రాసినట్లు జైలుకు చెందిన సీనియర్‌ అధికారి అలోక్‌ సింగ్‌ ధృవీకరించారు. ఆ లేఖను హాథ్రస్‌ ఎస్పీకి బుధవారం సాయంత్రం పంపినట్లు మీడియాకు చెప్పారు. మరోవైపు నిందితుడు లేఖలో రాసింది వాస్తవం కాదని బాలిక తండ్రి తెలిపారు. ‘నేను నా కూతుర్ని కోల్పోయాను. ఇప్పుడు మమ్మల్నే దోషులుగా చిత్రీకరిస్తున్నారు. అయినా మేం భయపడం. అవన్నీ తప్పుడు ఆరోపణలే. మాకు ఎలాంటి డబ్బు లేదా పరిహారం అవసరం లేదు. మాకు న్యాయం కావాలి’ అని మీడియాతో ఆయన అన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి