బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 14, 2020 , 17:39:44

లైంగిక దాడి, వేధింపులు.. ఇద్దరు బాలికలు ఆత్మహత్య

లైంగిక దాడి, వేధింపులు.. ఇద్దరు బాలికలు ఆత్మహత్య

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బాలికలపై లైంగిక దాడుల ఘటనలు ఆగడం లేదు. తాజాగా మరో రెండు దారుణాలు వెలుగు చూశాయి. సామూహిక లైంగికదాడికి గురైన, లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు 237 కిలోమీటర్ల దూరంలోని చిత్రకూట్ జిల్లా పరిధిలోని గ్రామానికి చెందిన 14 ఏండ్ల దళిత బాలిక మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ నెల 8న కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్లిన ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం వారు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి వెళ్లిపోగా బాధితురాలు పాకుతూ ఇంటి వరకు వచ్చిందని చెప్పారు. గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆ స్థితిలో ఉన్న ఆమెను వారు ఫొటోలు కూడా తీసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు ఐజీ కే సత్యనారాయణ్‌ తెలిపారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరోవైపు ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన 17 ఏండ్ల బాలిక బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఇంటర్‌ చదువుతున్న ఆ విద్యార్థినిని పొరుగింటి వారైన ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధిస్తుండటంతో ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. గత నెలలో హాథ్రస్‌కు చెందిన 20 ఏండ్ల దళిత యువతిపై సామూహిక లైంగికదాడి జరుగగా బాధితురాలు చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లో మరిన్ని లైంగిక దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo