శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 08, 2020 , 15:33:14

రాజస్థాన్‌లో రెండు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో రెండు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం

జైపూర్‌ : రాజస్థాన్‌ రాష్ట్రంలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చురూ జిల్లాలోని  భనిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జీపును ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రావత్సర్ నుంచి దుంగార్‌గఢ్‌‌కు జీప్‌లో వెళ్తుండగా భనిపురా సమీపంలోని సర్దార్‌ సిటీరోడ్డుపై వేగంగా వచ్చిన ట్రక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు లాలారామ్ (60), రేష్మి (65), కనారామ్ (40), లీలా అలియాస్ కలవతి (30), కమలా (35), సీమా దేవి (50) అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు భనిపురా పోలీసు అధికారి మల్కిత్ సింగ్ తెలిపారు. ప్రమాదం అనంతరం  డ్రైవర్‌ పరారీ కావడంతో ఆయన సహాయకుడిని అరెస్టు చేశారు.

జహాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం వివాహ వేడుకకు హాజరై మారుతీ వ్యాన్‌లో తిరిగి వస్తున్నకొందరు.. ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా, ఒక మహిళ, చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన వార్త తెలియగానే జహాజ్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి హరీష్ శంకల్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానలకు తరలించి చికిత్స అందించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను జహాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హాస్పిటల్‌లో ఉంచారు. భిల్వారా డియోలి జాతీయ రహదారి బనాస్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరుగడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo