శనివారం 16 జనవరి 2021
Crime - Oct 10, 2020 , 12:54:58

18 ఏళ్ల యువ‌కుడిని బ‌లిగొన్న 'ప్రేమ‌'

18 ఏళ్ల యువ‌కుడిని బ‌లిగొన్న 'ప్రేమ‌'

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర జ‌రిగింది. ఇద్ద‌రి మ‌ధ్య విర‌బూసిన ప్రేమ‌.. ఓ 18 ఏళ్ల యువ‌కుడిని ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. ఆద‌ర్శ్‌న‌గ‌ర్‌కు చెందిన రాహుల్ రాజ్‌పుత్‌(18) డిస్టెన్స్‌లో విద్య‌ను అభ్య‌సిస్తూ.. ఇంటి వ‌ద్ద పిల్ల‌ల‌కు ఇంగ్లీష్ ట్యూష‌న్ చెబుతున్నాడు. అయితే రాహుల్ ఓ ఎన్జీవోలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఒక‌మ్మాయి ప‌రిచ‌యం అయింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది.

ఈ విష‌యం అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియ‌డంతో రాజ్‌పుత్‌ను హెచ్చ‌రించారు. ఇద్ద‌రివి వేర్వేరు కులాలు కావ‌డంతో.. అమ్మాయి త‌ర‌పు బంధువులు వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. ఇటీవ‌లే రాహుల్‌కు ఆ అమ్మాయి ఫోన్ చేసింది. మ‌రోసారి అత‌నికి కాల్ చేయొద్ద‌ని ఆ యువ‌తిని ఆమె త‌ల్లి హెచ్చ‌రించింది. అయిన‌ప్ప‌టికీ మార‌లేదు ఆ యువ‌తి. ఈ క్ర‌మంలో కోపంతో ఊగిపోయిన యువ‌తి కుటుంబ స‌భ్యులు.. రాహుల్‌ను బుధ‌వారం రాత్రి బ‌య‌ట‌కు తీసుకెళ్లి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. తీవ్ర గాయాల‌పాలైన రాహుల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.