శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 15:52:20

యువ‌తి ఆత్మ‌హ‌త్య‌.. ఏఎస్ఐ స‌స్పెండ్

యువ‌తి ఆత్మ‌హ‌త్య‌.. ఏఎస్ఐ స‌స్పెండ్

భువ‌నేశ్వ‌ర్ : ఓ యువ‌తిని త‌న ఇంటికి స‌మీపంలో ఉన్న ఓ వ్య‌క్తి నిరంత‌రం వేధిస్తున్నాడు. అత‌డి వేధింపులు భ‌రించ‌లేని బాధితురాలు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేయ‌లేదు. దీంతో ఆమెకు వేధింపులు అధిక‌మ‌య్యాయి. చేసేదేమీ లేక యువ‌తి గురువారం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారులు స్పందించి.. కేసు న‌మోదు చేయ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించిన ఏఎస్ఐని స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని దేన్‌క‌నాల్ జిల్లాలో చోటు చేసుకుంది. 

బాపూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువ‌తిని స్థానికంగా ఉన్న 40 ఏళ్ల వ్య‌క్తి.. ఆమెను గ‌త కొద్ది నెల‌ల నుంచి వేధిస్తున్నాడు. త‌న‌తో స‌న్నిహితంగా ఉండాల‌ని లైంగికంగా వేధించ‌డ‌మే కాకుండా.. ఆమెను ఇష్ట‌మొచ్చిన చోట తాకుతున్నాడు. ఆ వ్య‌క్తి వేధింపులు భ‌రించ‌లేని బాధితురాలు త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. దీంతో జులై 6వ తేదీన బాధితురాలి త‌ల్లిదండ్రులు బాపూర్ ఏఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేయ‌డంలో ఏఎస్ఐ నిర్ల‌క్ష్యం వ‌హించారు. 

ఈ క్ర‌మంలో యువ‌తిని అత‌ను బెదిరించాడు. అత‌ని ఆగ‌డాలు అధిక‌మ‌య్యాయి. ఆ వ్య‌క్తి వేధింపులు తాళ‌లేక గురువారం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది బాధితురాలు. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు పోలీసు ఉన్న‌తాధికారులను సంప్ర‌దించారు. కేసు న‌మోదు చేసి నిందితుడికి శిక్ష విధించ‌క‌పోవ‌డం వ‌ల్లే త‌మ కూతురు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని త‌ల్లిదండ్రులు బోరున విల‌పించారు. 

ఈ క్ర‌మంలో బాపూర్ పోలీసు స్టేష‌న్ ఏఎస్ఐని స‌స్పెండ్ చేస్తూ పోలీసు ఉన్న‌తాధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. నిందితుడిని త్వ‌ర‌గా అరెస్టు చేసి.. పూర్తి స్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని పోలీసుల‌ను ఎస్పీ ఆదేశించారు.


logo