మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 18:41:00

రూ.21 లక్షలు విలువైన నకిలీ మాస్కులు పట్టివేత

రూ.21 లక్షలు విలువైన నకిలీ మాస్కులు పట్టివేత

ముంబై :  ముంబైలోని ఓ వ్యాపారవేత్త నుంచి నకిలీ ఎన్ -95, వీ-410వీ మాస్కులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఒరిజినల్‌గా చెప్పుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోయర్ పరేల్‌లో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ బుధవారం ఒక టెంపోను గుర్తించి తనిఖీలు చేపట్టగా ఈ మాస్కులు దొరికాయని వీటి విలువ రూ.21.39లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. విక్రయానికి పాల్పడుతున్న సఫ్దార్ హుస్సేన్ మొహమ్మద్ జాఫర్ మోమిన్‌ అనే 42 ఏండ్ల వ్యాపారవేత్తను ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ మాస్కులను ఢిల్లీ నుంచి తీసుకెళ్లి థానే, ముంబైలోని స్థానిక వ్యాపారులకు విక్రయించనున్నారు. టెంపో లోపల రూ. 21.39 లక్షల విలువైన 10,500 ఎన్ -95, 6,800 వీ-410వీ మాస్క్‌లు దొరికాయి. నిందితులపై కేసు నమోదు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 3 ఎస్‌ఐ నితిన్ పాటిల్ తెలిపారు. 

ఆ తరువాత పోలీసులు నిందితులకు సంబంధించిన గోడౌన్‌పై దాడులు జరిపి పీపీఈ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. గత 3 నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా, మోమిన్ మాస్కులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని తన గోడౌన్‌లో భద్రపరిచినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo