శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 07, 2020 , 20:56:44

104 ఫోన్‌ కాల్స్‌.. హాథ్రస్‌ ఘటనపై పోలీసుల కొత్త వాదన

104 ఫోన్‌ కాల్స్‌.. హాథ్రస్‌ ఘటనపై పోలీసుల కొత్త వాదన

లక్నో: ఉత్తరప్రదేశ్‌ హాథ్రస్‌ ఘటనపై ఆ రాష్ట్ర పోలీసులు మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. నిందితుల్లో ఒక వ్యక్తి బాధితురాలి కుటుంబానికి బాగా తెలుసని చెప్పారు. బాలిక సోదరుడు, సందీప్‌ ఠాకూర్‌ మధ్య గత ఏడాది అక్టోబర్‌ నుంచి మార్చి వరకు 104 ఫోన్‌ సంభాషణలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ ఫోన్‌ కాల్స్‌ రికార్డుల గురించి బాలిక సోదరుడ్ని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. ఈ కేసు దళిత, అగ్రవర్గాల మధ్య వివాదానికి మించినదని పోలీసులు వెల్లడించారు. మరోవైపు చనిపోయిన బాలికకు, నిందితుడికి మధ్య సంబంధం ఉన్నదని ఆ గ్రామ పెద్ద ఠాకూర్‌ చెప్పారు. నాలుగు నెలల కిందట ఇరు కుటుంబాలతో పంచాయతీ నిర్వహించానని తెలిపారు. ఆ బాలికపై లైంగికదాడి జరిగిందన్నది అవాస్తవమని అన్నారు. కాగా ఆ గ్రామంలో అగ్రవర్గాలకు చెందినవి వంద కుటుంబాలు ఉండగా దళితులకు చెందినవి బాధిత  కుటుంబంతోపాటు నాలుగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు రక్షణ లేదని భావిస్తున్న బాధిత కుటుంబం అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోవాలని భావిస్తున్నది. పోలీసులు, అగ్రవర్గాలు కుమ్మక్కై ఈ కేసును తప్పు దారి పట్టిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. 

హాథ్రస్‌కు చెందిన 19 ఏండ్ల దళిత బాలికపై అగ్రవర్గాలకు చెందిన యువకులు సెప్టెంబర్‌ 14న సామూహిక లైంగికదాడి చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. అనంతరం ఆమె నాలుక కోసి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాలిక ఢిల్లీ దవాఖానలో చికిత్స పొందుతూ గత నెల 29న మరణించింది. కాగా కుటుంబ సభ్యులకు చెప్పకుండా పోలీసులు అర్థరాత్రి వేళ హడావుడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదస్పదమైంది. ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాగా ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్‌ తన నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బుధవారం సమర్పించాల్సి ఉంది. అయితే ఆయన ఆదేశంతో దీనిని పొడిగించినట్లు తెలుస్తున్నది. 

 


logo