మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 04, 2020 , 16:02:15

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

షిల్లాంగ్‌: మేఘాలయలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం అందుకున్న పోలీసులు తూర్పు జయంతియా జిల్లా పరిధిలోని సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బుధవారం రాత్రి వేళ సోదాలు చేశారు. లాడ్రింబై పోలీసు అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని కొంగాంగ్ వద్ద ఒక వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా పది పెట్టెల్లో 250 కేజీల పరిమాణంలో పేలుడు పదార్థాలు లభించాయి. 2 వేల జిలిటిన్‌ స్టిక్స్‌, వెయ్యి లైవ్‌ డిటోనేటర్లు, 8 ఫ్యూజ్‌ రోల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. వాహనంలోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించగా మరో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో మరో పేలుడు సామగ్రి డంప్‌ గురించి తెలిసింది. ఖ్లీహ్రియాట్ ప్రాంతంలో తనిఖీ చేయగా 51 పెట్టెల్లో ఉన్న 1,275 కేజీల పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఇందులో 10,200 జిలిటిన్‌ స్టిక్స్‌, 5 వేలు డిటోనేటర్లు, 8 ఫ్యూజ్‌ రోల్స్‌ ఉన్నాయి. దీంతో మొత్తంగా 1,525 కేజీల పేలుడు పదార్థాలు, 6 వేల డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నామని, వీటికి సంబంధించి ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.