కావలసిన పదార్థాలు
క్యాప్సికం: నాలుగు, ఆలుగడ్డ: ఒకటి (పెద్దది), టమాట: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, పనీర్ తురుము: అర కప్పు, చీజ్ తురుము: ఒక కప్పు, కారం: ఒక టీస్పూన్, కసూరి మేతి: అర టీస్పూన్, చక్కెర: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారీ విధానం
క్యాప్సికంను పైన కోసి లోపల గింజలు తీసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనెవేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. బాగా వేగాక చిన్నగా తరిగిన టమాట ముక్కలు, ఉడికించి మెదిపిన ఆలుగడ్డ ముద్ద, పనీర్ తురుము వేసి సన్నని మంటపై అయిదు నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. కారం, ఉప్పు, చక్కెర, కసూరి మేతి, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి దించేయాలి. ఇప్పుడు మిశ్రమంలో అరకప్పు చీజ్ తురుము వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలలో కూరి పైనుంచి చీజ్ తురుము వేసుకోవాలి. వీటిని ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 320 డిగ్రీల వద్ద 10 నిమిషాల పాటు ఉడికిస్తే వేడివేడిగా నోరూరించే స్టఫ్డ్ క్యాప్సికం సిద్ధం. ఓవెన్ లేనివాళ్లు కొద్దిగా నూనె వేసిన పాన్‌లో పెట్టి మూతపెట్టి సన్నని మంటపై ఉడికించుకోవచ్చు.