కావలసిన పదార్థాలు:
చికెన్: అర కిలో, పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు, దాల్చిన చెక్క: రెండంగుళాల ముక్క, లవంగాలు: నాలుగు,యాలకులు: రెండు, సోంపు: ఒక టీస్పూన్, నూనె: పావు కప్పు,కారం: రెండు టీస్పూన్లు, ధనియాల పొడి: ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు, టమాట: రెండు, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, ఉప్పు: తగినంత, పసుపు: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్.
తయారీ విధానం:
స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు, పావు కప్పు ఉల్లిగడ్డ తురుము, పచ్చికొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి. బాగా వేగాక చల్లార్చి కొన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాలి. అన్నీ దోరగా వేగాక చిన్నగా తరిగిన టమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసి సన్నని మంటపై రెండు నిమిషాలు మగ్గించాలి. అంతా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి రెండు నిమిషాలపాటు మూత పెట్టాలి. రెండు కప్పుల నీళ్లు పోసి, చికెన్ మెత్తగా ఉడికిపోయాక దించితే ఘుమఘుమలాడే మలబార్ చికెన్ సిద్ధం.