పెద్దల సభ స్ఫూర్తి...?


Sun,February 2, 2014 01:56 AM

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరికష్ణ, ఈ రెండు వరుసల్లోని పేర్లకేమైనా సంబంధముందా? ఈ పేర్లలో ఒకదానికి మరొకటి ఏమైనా పోలిక ఉందా? ఉంది. వీరంతా రాజ్యసభ సభ్యులు. అంబేద్కర్ లాంటి మహానుభావులు కూర్చున్న పెద్దల సభలోనే ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు కూర్చుంటున్నారు. ఇది నేటి రాజకీయ వ్యవస్థకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతి.

అసలు దేశానికో పెద్దల సభ అవసరమని రాజ్యాంగ నిర్మాతలు ఎందుకనుకున్నారో? లక్ష్యం ఎంత మేరకు నెరవేరుతున్నదో పరిశీలిస్తే.. దేశంలో రాజ్యసభ, రాష్ర్టాల్లో శాసన మండలి ఉండాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఉద్యమాలు రావడం ఖాయంగా కనిపిస్తున్నది. వివిధ దేశాల్లో చట్టసభలను పరిశీలించిన మీదట అంబేద్కర్ నేతత్వంలోని రాజ్యాంగసభ పార్లమెంటులో ఉభయసభలుండాలని, పెద్దలసభగా పిలిచే రాజ్యసభ దేశానికి అవసరమని తీర్మానించింది. ఈ ఆలోచనకు మూడు కారణాలు కనిపిస్తాయి. ఒకటి- లోక్‌సభలో ఎక్కువ సీట్లు వచ్చిన రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. మొత్తం లోక్‌సభలో ఉన్న సీట్లలో సగానికన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ గానీ, సగానికంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు కూడగట్టగలిగిన పార్టీ గానీ అధికారంలోకి వస్తుంది.

కొన్ని రాష్ర్టాల్లో ఎక్కువ సీట్లు పొందగలిగిన పార్టీ, కొన్ని రాష్ర్టాల్లో ఒక్క సీటు కూడా గెలవని పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అన్ని రాష్ర్టాల విషయాలను ప్రస్తావించడానికి అవకాశం రాకపోవచ్చు. అందుకే రాష్ర్టాల నుంచి కచ్చితంగా కొంత మంది ప్రతినిధులు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించడానికి రాజ్యాంగం కల్పించిన వెసులు బాటు పెద్దల సభ. దీన్నే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ గా కూడా పిలుస్తారు. అంటే మన రాజ్యసభ రాష్ర్టాల మండలి అన్నమాట.

ఇక రాజ్యసభ రెండో లక్ష్యం చాలా ఉన్నతమైనది. సాధారణ ఎన్నికల్లో పోటీని తట్టుకుని గెలవలేని వారుంటారు. కానీ అలాంటి వారి అవసరం ప్రభుత్వంలోనూ, పార్లమెంటులోనూ ఉంటుంది. అలాంటి వారికి అవకాశం కల్పించడానికి రాజ్యసభ వేదిక. అలాంటి పెద్దమనుషులుంటారు కాబట్టే దాన్ని పెద్దల సభ అన్నారు. ఇక మూడో కారణం- ప్రజల నుంచి నేరుగా ఎన్నుకునే వారితో లోక్ సభ ఏర్పాటవుతుంది. రాష్ర్టాల శాసనసభ్యులు ఓటేస్తే ఎంపిలయ్యే వారు లోక్ సభ సభ్యులు. పార్లమెంటులో బిల్లు పాస్ కావాలంటే రెండు సభల్లోనూ గెలవాలి. లోక్ సభ భావావేశంలో ఏదైనా నిర్ణయం చేసినా పెద్దల సభలో ఉన్న నిష్ణాతులు, మంచి చెడులు ఆలోచించి, మరోసారి సమీక్ష చేయడం కూడా రాజ్యసభ బాధ్యత. ఇలాంటి మహోన్నత లక్ష్యాలు రాజ్యసభకున్నాయి.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారే పార్లమెంటులో ప్రవేశించడానికి రాజ్యసభ అవసరమొచ్చింది. అపర మేధావి అయినప్పటికీ, రాజ్యాంగాన్ని రాసినప్పటికీ, దురదష్టవశాత్తూ ఆయనే మొదటి లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాళ్ళు, రోజూవారీ రాజకీయం చేయలేని వాళ్లు, సమున్నత లక్ష్యాల కోసం పనిచేసే వారికి జనం వద్దకు వెళ్లి ఓట్లు అడగడం చేతగాకపోవడం తదితర కారణాల వల్ల అర్హులైన, అవసరమైన వారు చట్టసభలో అడుగుపెట్టలేరనే ఆందోళన అంబేద్కర్‌కే ఎదురైంది. కానీ అదే రాజ్యాంగం కల్పించిన వెసులు బాటు వల్ల ఆయనను అప్పటి నెహ్రూ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసి, కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా నియమించింది. అంబేద్కర్ లాంటి వారు ప్రభుత్వంలో ఉండడమే దేశానికి మంచిది. కానీ రాజ్యసభ లేకుంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండేవారు కాదు.

అంబేద్కర్ గారే కాదు. దేశంలో నెహ్రూ తర్వాత ఎక్కువ ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా గుర్తింపుపొందిన కేరళకు చెందిన వెంగలిల్ కష్ణన్ మీనన్ కూడా రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర ప్రభుత్వంలో భాగం చేసిన చరిత్ర మన ప్రజాస్వామ్యానిది. అంతెందుకు? ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్ సింగ్ సేవలు దేశానికి అవసరమని భావించే పివి నర్సింహరావు ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర ఆర్థిక మంత్రిని చేశారు. రాజకీయ నాయకుడిగా పరిచయం అయిన తర్వాత కూడా మన్మోహన్‌సింగ్ ఢిల్లీలో లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కానీ తర్వాత ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వంతోనే ఏకంగా దేశానికి ప్రధాని కాగలిగారు. వీరిద్దరే కాదు. ఇండియన్ ఆర్మీలో కమాండర్‌గా పనిచేసిన జస్వంత్‌సింగ్ తోపాటు ఇస్రోలో పనిచేసిన శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సంఘసేవకులు చాలామంది రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగు పెట్టారు. రాష్ర్టాలే కాకుండా దేశ పార్లమెంటు గౌరవాన్ని ఇనుమడింప చేయగలరునుకున్న వారిని రాష్ట్రపతి కూడా నేరుగా రాజ్యసభకు నామినేట్ చేసే వెసులుబాటు మనకుంది.

కళలు,సాహిత్యం, సైన్స్, సామాజిక సేవా రంగాల్లో సేవలందించిన వారిని ఎంపిక చేస్తారు. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ లాంటి వారు రాజ్యసభ సభ్యులు అయింది అలాగే. ఈ సౌకర్యమే లేకుం సచిన్ లాంటి వారు లోక్ సభకు పోటీ చేస్తారా? పార్లమెంటు సభ్యులవుతారా? మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన్మోహన్ సింగ్, సచిన్ లాంటి పెద్ద మనుషులను, ఉన్నతులను చట్టసభల్లో కూర్చోబెట్టడానికి, వారి సేవలను దేశానికి ఉపయోగించుకోవడానికి రాజ్యసభ ఉపయోగపడాలి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు కూడ నిజంగా పెద్ద మనుషులే రాజ్యసభకు ఎంపికయ్యే వారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? దేశానికి అవసరమయిన వారు కాకుండా, రాజకీయ పార్టీలకు, నాయకులకు అవసరమైన వారిని మాత్రమే రాజ్యసభకు పంపుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న రాజ్యసభలో అభ్యర్థులను, వారిని ఎంపిక చేసిన నాయకులను, వారి అవసరాలను ఒక్కసరి పరిశీలిస్తే పెద్దల సభ స్పూర్తి ఎంతగా దెబ్బతింటుందో తెలుస్తుంది.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేవలం కాంట్రాక్టర్లనే రాజ్యసభకు పంపాలనే ఓ నియమం పెట్టుకున్నట్లుంది. మొన్న సుజనా చౌదరి, నిన్న సిఎం రమేష్, నేడు గరికపాటి మోహన్ రావు. బలహీన వర్గాల కోటా అని చెప్పినప్పటికీ దేవేందర్ గౌడ్, గుండు సుధారాణి, సీతారామ లక్ష్మి కూడా ఆర్థికంగా బలవంతులే. ఎంపిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన ఖర్చు (పెంచుతున్న వ్యయ పరిమితి ప్రకారం ఒక్కో లోక్ సభ అభ్యర్థి గరిష్టంగా రూ.40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు) భరించలేని పెద్ద మనుషులను రాజ్యసభకు పంపడం సంప్రదాయం. పైన చెప్పిన వారిలో డబ్బు ఖర్చు పెట్టలేని పేదలెవరూ లేరు కదా? ఉన్నతమైన లక్ష్యాల కోసం పనిచేసే వారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడం చిన్నతనంగా ఉంటుంది.

వీరు నిజంగా అంత ఉన్నతమైన పనులేం చేస్తున్నారు. అయినా వీరు గతంలో ఓట్లు అడిగిన వారే కదా? దేవేందర్ గౌడ్, సుధారాణి లాంటి వారు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాతే కదా, వారికి రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. మొన్నటికి మొన్న అభ్యర్థులను ప్రకటించే సందర్భంగా చంద్రబాబు ఏమని సెలవిచ్చారు. మేము పోటీలో పెడుతున్న అభ్యర్థులిద్దరూ పార్టీకి ఎంతో కాలం నుంచి సేవలు అందిస్తున్నారు కాబట్టి అవకాశం కల్పించాం. పార్టీ కోసం పనిచేస్తున్న ఇతరులకు కూడా రానున్న రోజుల్లో రాజ్యసభ అవకాశం కల్పిస్తాం అని చెప్పారు. అంతే తప్ప మాట వరుసకైనా వీరిద్దరూ పెద్ద మనుషులు కాబట్టి, పెద్దల సభలో ఉండే అర్హత ఉంది కాబట్టి, దేశానికి వీరి సేవలు అవసరం కాబట్టి రాజ్యసభకు పంపుతున్నాం అనలేదు. అంటే ఇక్కడ పెద్దలసభ స్ఫూర్తిని పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పవర్ బ్రోకర్లు రాజ్యసభకు వెళితే అక్కడ వారి ఎవరి ప్రయోజనాల కోసం కొట్లాడుతారో వేరే చెప్పాలా? ఇక కాంగ్రెస్ కూడా పక్కాగా తన రాజకీయ అవసరాల కోసమే రాజ్యసభను వాడుకుంటోంది. విశాఖలో ఒకే సీట్లో ఇద్దరిని సర్దలేక సుబ్బరామిరెడ్డిని రాజ్యసభకు పంపుతోంది.

అమేథీలో రాహుల్‌గాంధీ ఎన్నిక సాఫీగా జరగడానికి మాత్రమే సంజయ్‌సింగ్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది తప్ప ఆయన పెద్ద మనిషి అని కాదు. వెంకయ్య నాయుడి లాంటి రాజకీయ నాయకుడి రాజ్యసభ సభ్యత్వాన్ని ఎప్పుడూ రెన్యువల్ చేస్తున్న బిజెపి కూడా తమ అభ్యర్థుల ఎంపికను రాజకీయ కోణం నుంచే జరిపారు. ఇక రాజ్యసభ అభ్యర్థిత్వాలు దక్కించుకున్న వారు కూడా దేశ అత్యున్నత సభలో అడుగు పెడుతున్నందుకు దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తామని ప్రతిజ్జ చేయలేదు. అవకాశం కల్పించిన పార్టీకి, నాయకులకు కతజ్జతలు తెలిపారు. పార్టీకి మరింత ఉత్సాహంతో సేవలు చేస్తామని ప్రతిజ్జ చేశారు. రాజ్యసభ సీటు రాని వారు కూడా తమకు అవకాశం దక్కలేదని ఏడుస్తున్నారు. అయిదారు సార్లు ఎమ్మెల్యేలు అయిన వారు మరోసారి ఎమ్మెల్యే కాలేమనే భయంతో రాజ్యసభ అడుగుతున్నారంటే రాజ్యసభ విలువ పడిపోతుం దా? డిమాండ్ పెరుగుతుందా?

అంటే రాజ్యసభకు ఇప్పుడు పెద్దమనుషులు పోవడం లేదు. పార్టీల అవసరాలు తీర్చే వారు రాజ్యసభ సభ్యులవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేక(ఆర్థిక వనరులు లేక కాదు, ప్రజల మద్దతు లేక) రాజ్యసభ అడుగుతున్నారు. డబ్బులకు రాజ్యసభ సీట్లు కొనుక్కుంటున్నరు. రేపు వీరే ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చే జీతాలను, ఇతర సౌకర్యాలను పొందుతూ పార్టీ సేవలో మునిగి తేలుతారు. తమ వ్యాపారాభివద్ధికి బాటలు వేసుకుంటారు.అంతే తప్ప దేశ సౌభాగ్యానికి అవసరమయ్యే నాలుగు మంచి మాటలు చెప్పరు.

అసలు ఇప్పుడు వినిపిస్తున్న పేర్లలో కొన్నయినా పార్లమెంటులో జరిగే చర్చల్లో పాల్గొని ప్రభుత్వానికి మార్గదర్శకం చేసేటట్టు కనిపిస్తున్నాయా? కనిమొళి లాంటి రాజ్యసభ సభ్యులు ఏకంగా జైలుకే వెళ్లి వచ్చారు. కొన్ని రాష్ర్టాల్లో రౌడీషీటర్లు కూడా రాజ్యసభ సభ్యులవుతున్నారు. రాజ్యసభ సభ్యుడి ఆధ్వర్యంలో జరిగే నియోజకవర్గ అభివద్ధి నిధులను కూడా దిగమింగే ప్రబుద్ధులు అన్ని రాష్ర్టాల్లో కనిపిస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తులతో నిండిపోయే సభ పెద్దల సభ అవుతుందా? గద్దల సభ అవుతుందా? పెద్దల సభ స్పూర్తి దెబ్బతిన్న తర్వాత ఆ సభ అవసరమేముంది? రాజ్యసభలో పెట్టే ఖర్చు, ఎన్నికవుతున్న వారి పేర్లు బయట పెట్టి ఈ సభ అవసరమనా అని ప్రజాభిప్రాయం అడిగితే ఏమని తేలుతుంది. ఎన్నికల సంస్కరణలు ఎజెండాగా పనిచేసే రాజకీయ పార్టీలు రాజ్యసభ అవసరం లేదనే డిమాండ్ కూడా చేస్తాయేమో. ఈ పరిణామం కూడా మనం చూడక తప్పదేమో?
-గటిక విజయ్‌కుమార్

246

VIJAYKUMAR GATIKA

Published: Sun,October 6, 2013 01:48 AM

మన సాంస్కృతిక ప్రతీక

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం

Published: Thu,February 14, 2013 03:55 PM

నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు

Published: Thu,January 3, 2013 01:44 PM

ఓరుగల్లు ఎందుకు?

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీ

Published: Thu,November 8, 2012 02:22 AM

కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సు

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:18 PM

పతకాల వేటలో పతన బాట

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బ

Published: Sat,October 6, 2012 03:19 PM

ఈ చైతన్యం కనబడదా?

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను క

Published: Sat,October 6, 2012 03:19 PM

మేడారం నేర్పిన పాఠం

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పు