వినండి గాజా శోకం


Sun,April 7, 2013 11:14 AM

నన్ను చూడండి
ప్రేమ గురించి కవితలల్లడం,
ఇంద్రధనుస్సుల్నీ
సీతాకోకచిలుకల్నీ చిత్రించడం
గులాబీమొగ్గల పరిమళాన్ని ఆస్వాదించడం
ఉత్సాహపు నీలిపిట్టల
కువకువలకు నాట్యం చేయడం
నాకెంతో ఇష్టం
కళ్లు మూసుకుని చిన్నారి పిల్లల
చిరునవ్వుల్ని వినడం నాకు సరదా
ఆ చిన్నారుల తలలకు
తుపాకులు గురిపెట్టి ఉండవు
సుదూర దేశాల జానపద కథలూ గాథలూ
వారికి చెప్పడం నాకిష్టం
దూసుకొచ్చే తూటాల గురించీ,
పేలిపోయే క్షిపణుల గురించీ కాదు
కాని
నేను ఎట్లా చేయను?
మరి నేనేం చేయను?
నేనెట్లా చేయను?
నేనేం చేయను?
నా గుండెల్లో చురకత్తి దిగి ఉంది
నేను గాయపడి ఉన్నా
గాయపడి నెత్తురోడుతున్నా
ముడుచుకుపోతున్నా
శోకాలు పెడుతున్నా
మానవత్వమా, ఎక్కడున్నావు నువ్వు?
నిరంతరం కాపలాకాసే
నీ కనుచూపుల కిందనే
నన్ను సజావుగా ఊచకోత కోస్తున్నారు
చలి...చలి...చలి...
వణికిపోతున్నా
శోకాలు పెడుతున్నా
మానవత్వమా, ఎక్కడున్నావు నువ్వు?
అలా ముఖం ఎందుకు
పక్కకు తిప్పేసుకుంటావు?
చూసీ చూడనట్టు ఎందుకు నటిస్తావు?
ఇదిగో నేనిక్కడ
గాజా సందుల్లో గొందుల్లో
కడగండ్లలో ఉన్నా
మానవత్వమా, నువ్వెక్కడ?
నన్ను చూడు
నావేపు తేరిపార చూడు
నేనిక్కడ గాజా సందుల్లో గొందుల్లో
నిట్టూర్పులు విడుస్తున్నా
ముడుచుకుపోతున్నా
శోకాలు పెడుతున్నా
మానవత్వమా,
చూపులు తిప్పుకోవడం చాలిక!
చెవిటితనం నటించడం చాలిక
గుడ్డితనం నటించడం చాలిక
ఇక్కడ
నేనూ
అయ్యో! నా దిక్కులేని చిన్నారి పిల్లలూ
చచ్చిపోతుంటే
నీ మౌనం చాలిక...
పవాస పాలస్తీయన్ నహీదా
కవయిత్రి నహీదా జెరూసపూంలో పుట్టిన పాలస్తీనా వాసి. గత నలభైరెండు సంవత్సరాలుగా ఆమె ప్రవాసంలోనే ఉన్నారు. ఆమె ఏడో ఏట యుద్ధ సమయంలో మాతృభూమి పాలస్తీనాను వదిలి ప్రవాసం వెళ్లవలసి వచ్చింది. వృత్తి రీత్యా గణితశాస్త్రవేత్త అయిన నహీదా ‘ఐ బిలీవ్ ఇన్ మిరకిల్స్’, ‘పాలస్తీనా ది ట్రూ స్టోరీ’ అనే రెండు కవితా సంపుటాలు వెలువరించారు.
అనువాదం: ఎన్. వేణుగోపాల్

37

VENUGOPAL N