ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని..
ప్రయత్నిస్తున్నాను
ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి
నెత్తురు చింది అది చెరిగిపోయేది
సాయుధంగా చేతికొచ్చి జారిపోయిన ద్రోహం
ఎన్నికల్లో గెలిచి కోల్పోయిన మోసం
ప్రకటించీ వెనక్కు తీసుకున్న వైనం
అడుగడుగూ నెత్తుటి మడుగు
అమరత్వాలు.. ఆత్మహత్యలు..
అవును కదా ప్రతి బలిదానం
ఒక వెతుకులాట ఒక బతుకు పాట
మిలియన్ మార్చ్
సకల జనుల సమ్మె
సబ్బండ కులాల కదం కవాతులు
సాగర హారం
ప్రతి పోరాట రూపం ఎగిసి పడిన
ప్రజా కెరటమేననుకున్నాను
విరిగిపడిన అలలు వృథాకావు
సమువూదమవుతాయి
అరవై ఏళ్ల ఆకాంక్ష ఆకృతిని
ఆవిష్కరించుకున్నాను
ఇప్పుడింక దీనిలో నా ఊపిర్లు ఊది
ప్రాణం పోయాలి...
- వరవరరావు