అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే...
నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(1984 ఫివూబవరి11).పరిస్థితి చాల ఉద్రిక్తంగా ఉంది. ప్రజలు కశ్మీర్ సమస్యను మరొక్కసారి శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఎన్నికల యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారు. కశ్మీర్ ముస్లింల మనోభావాలకు ప్రాతినిధ్యం వహించే ముస్లిం ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీ పాలకులు ఈ ఎంయూఎఫ్కు వస్తున్న ప్రజాస్పందనను చూసి బెంబేలేత్తారు. దాంతో ఇంతకుముందెన్నడూ లేనంతగా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకులను అరెస్టు చేశారు. అవమానపరిచారు, జైళ్ళలోపెట్టారు. దీని తర్వాతనే ఆ ఎంయూఎఫ్ నాయకుడు సాయుధ ప్రతిఘటనకు పిలుపునిచ్చాడు.
వేలాదిమంది యువకులు, విద్యార్థులు ఈ పిలుపునందుకొని సాయుధ పోరాటంలోకి దిగారు. నేను శ్రీనగర్‌లోని ‘జీలం వ్యాలీ’ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చదువు వదిలేసి జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్)లో చేరాను.‘లైన్ ఆఫ్ కంట్రోల్’ దాటి అటువైపు కశ్మీర్లో ప్రవేశించాను. పాకిస్థాన్ రాజకీయ నాయకులు కూడా భారత రాజకీయ నాయకుల్లాగనే వ్యవహరించడాన్ని చూసి కశ్మీరీల పట్ల వాళ్ల వైఖరీ, ప్రవర్తన చూసి భ్రమలన్నీ కోల్పోయాను. కొన్ని వారాల తర్వాత తిరిగి వచ్చాను. భారత భద్రతా దళాల ముందు లొంగిపోయాను. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఫ్) నాకు ‘లొంగిపోయిన మిలిటెంట్’ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చింది.నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నేను డాక్టర్‌ను కాలేకపోయినా ముందులు, శస్త్రచికిత్స చేసే పరికరాల ‘కమీషన్ డీలర్’ వ్యాపారం మొదలుపెట్టాను.
ఒక డొక్కు స్కూటర్‌ను కొన్కున్నాను.‘తబస్సుం’తో పెళ్లి కూడా జరిగింది. కాని ఒక్కరోజు కూడా రాష్ట్రీయ రైఫిల్స్ నుంచి కానీ, స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) నుంచి గానీ వేధింపులు లేకుండా గడవలేదు. కశ్మీర్లో ఎక్కడ మిలిటెంట్ల దాడి జరిగినా వాళ్లు గ్రామీణులందరినీ ఒక చోట గుంపుజేస్తారు. నెత్తుర్లు చిందంగా చిత్రహింసలు పెడుతారు. నావంటి లొంగిపోయిన మిలిటెంట్ పరిస్థితి అంతకన్నా భయంకరమైనది. ఎన్నో వారాలపాటు నిర్బంధంలో వుంచి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించి పెద్ద మొత్తంలో లంచాలు ఇస్తే తప్ప వదిలేవాళ్లు కాదు. ఇటువంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నిసార్లు వచ్చాయో.. ఇరవై రెండవ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్ రాంమోహన్రామ్ నా రహస్య అంగాలకు కరెంట్ షాక్‌లిచ్చాడు. ఎన్నోసార్లు చల్లటి నీళ్ళలో మంచువలె గడ్డ కట్టేదాక పడేశారు. పెట్రోల్‌లో ముంచి తీశారు. మిరపకాయల కుప్పల్లో పొగబెట్టి ఒదిలేశారు. నాతో మరుగుదొడ్లు శుభ్రం చేయించేవారు.
క్యాంపులు ఊడిపించేవారు.‘హుంహోం ఎస్టీఎఫ్ చిత్రహింసల క్యాంపు నుంచి తప్పించుకోవడానికి నేను భద్రత దళాలకు నా దగ్గర ఉన్నదంతా ఊడ్చి ఇవ్వాల్సి వచ్చింది. వినయ్గుప్త, దావిందర్‌సింగ్ అనే డీఎస్పీలు చిత్రహింసలన్నింటిని పర్యవేక్షిస్తుండేవాళ్లు. శాంతిసింగ్ అనే చిత్రహింసల నిపుణుడైన ఇన్స్పెక్టర్ లక్ష రూపాయాల లంచాన్ని ఒప్పించడానికి మూడు గంటల పాటు కరెంట్ షాక్‌లిచ్చాడు.నా భార్య తన మీద ఉన్న నగలన్నీ అమ్మింది. వాళ్లు నా స్కూటర్ కూడా అమ్మేసు కున్నారు.
ఆర్థికంగానూ, మానసికంగానూ నేను పూర్తిగా చితికిపోయాను. ఛిద్రం అయిపోయాను. ఆరు నెలలపాటు బయటకు వెళ్లలేనంతగా శరీరం ఆదుపు తప్పిపొయింది.నా పురుషంగానికి విద్యుత్ షాకులివ్వడం వల్ల ఆరు నెలలపాటు నేను కాపురం కూడా చేయలేకపోయాను. ఇన్ని సంఘటనల తర్వాత నేను నేర్చుకున్న పాఠమేంటంటే.. ఎస్టీఎఫ్ క్యాంపులలో ఇట్లా నిరంతరం చిత్రహింసలైనా భరించాల్సింటుంది. ఇంకా భరించడం, ప్రతిఘటించడం సాధ్యం కాకపోతే గుడ్డిగా ఎస్టీఎఫ్కు సహకరించవలసి ఉంటుంది. నా ముందు ఇంకొక దారిలేదు. డీఎస్పీ దావెందర్సింగ్ నన్ను ఓ పని చేసిపెట్టమన్నాడు.‘చాలా చిన్న పని’అన్నాడు. ఒకాయనను ఢిల్లీకి తీసుకు అన్నాడు. అతడికి అక్కడ ఇల్లు చూసి పెట్టాలన్నాడు.ఆ మనిషిని మొదటిసారి చూశాను. అతడు ‘కశ్మీరీ’ మాట్లాడడు కాబట్టి అతడు బయటివాడని అర్థమైంది. అతడు నాతో తన పేరు మహమ్మద్ అని చెప్పాడు. (పార్లమెంట్ మీద దాడి చేసిన ఐదుగురిలో అతడ్ని మహమ్మద్‌గా పోలీసులు గుర్తుపట్టారు. ఆ దాడిలో భద్రతా దళాలు ఐదుగురిని చంపేశారు.)నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మహమ్మద్‌కు, నాకు దావెందర్సింగ్ నుంచి ఫోన్లు వచ్చేవి. మహమ్మద్ ఢిల్లీలో చాలమందిని కలుస్తున్నట్లుగా కూడా నేను గమనించాను. అతడు ఓ కారు కొనుక్కున్నాక ‘నీవు ఇక వెళ్లిపోవచ్చు’అని నాకు 30వేల రూపాయల బహుమానం ఇచ్చాడు.
నేను ‘ఈద్’కు శ్రీనగర్ బస్టాండ్ నుంచి సుఫోర్ పోవడానికి బస్సు ఎక్కుతున్నప్పుడు నన్ను పోలీసులు అరెస్టు చేసి ఫరెన్ఫార పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయారు.అక్కడ నన్ను చిత్రహింసలు పెట్టి అక్కడి నుంచి ఎస్టీఎఫ్ హెడ్ క్వాటర్స్‌కు తీసుకుపోయారు. అక్కడినుంచి ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ టార్చర్ చాంబర్లో నాకు మహమ్మద్ గురించి తెలిసిందల్లా చెప్పమన్నారు. చెప్పాను. కానివాళ్లు నన్ను మా బంధువు షౌకత్ భార్య నౌజత్ ఎస్ఏఆర్ గిలానీతో కలిసి పార్లమెంట్ మీద దాడి వెనుక వున్నామని చెప్పమని ఒత్తిడి చేశారు. మీడియా ముందు కూడా మీడియా వాళ్లు నిజమే అనుకునేంతగా సహజంగా చెప్పాలని ఒత్తిడిపెట్టారు. నేను ఒప్పుకోలేదు. కానీ వాళ్లు ‘నా కుటుంబం కూడా వాళ్ల నిర్బంధంలో ఉన్నదని, వాళ్లు చెప్పమన్నట్లు చెప్పకపోతే వాళ్లను చంపేస్తా’ మని బెదిరించారు. నాతో వాళ్లు ఎన్నో తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు.
పార్లమెంట్ మీద దాడికి బాధ్యత వహిస్తూ మీడియాకు చెప్పాలని పోలీసులు నాతో ఒక విషయాన్ని ఎన్నోసార్లు రిహార్సల్ చేయించారు.నాకు మీడియా ముందు చెప్పక తప్పలేదు. కానీ ఒక జర్నలిస్టు ఈ దాడిలో ఎస్ఏఆర్ గిలాని పాత్ర ఏమిటని అడిగినప్పుడు నేను ‘గిలానికి ఏ సంబంధం లేద’ని చెప్పాను. వెంటనే మొత్తం ఆ మీడి యా ముందరే ఏసీపీ రజ్బిర్సింగ్ బిగ్గర గా అరుస్తూ ‘మేం చెప్పమన్న దానికి భిన్నంగా చెప్పుతున్నావ’ని హెచ్చరించా డు. వాళ్లు చెప్పమన్న కథనం నుంచి నేను అట్లా పక్కకు జరగగానే వాళ్లు చాలా అందోళన పడిపోయారు. నేను ‘గిలానికేం సం బంధం లేద’ని చెప్పిన అంశాన్ని బ్రాడ్కాస్ట్ చేయొద్దని జర్నలిస్టులను వేడుకున్నారు. మరుసటి రోజు రజ్బీర్సింగ్ నాకు నా భార్యతో మాట్లాడుకునే అవకా శం ఇచ్చాడు. ఆమె ముందే నా భార్య కొడుకు బతికి ఉండాలంటే తమకు సహకరించాలని హెచ్చరించాడు. ఈ ఆరోపణలను అంగీకరించి, వాళ్లు చెప్పమన్నట్లు చెప్పడం తప్ప నాకు ఇంకోదారి లేకపోయింది.
స్పెషల్ సెల్ అఫీసర్లు నా కేసును బలహీనపరచి కొద్దికాలం పోయిన తర్వాత నన్ను విడుదల చేయిస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత వాళ్లు నన్ను చాలా చోట్లకు తీసుకుపోయారు. మహమ్మద్ వివిధ వస్తువులు కొన్న మార్కెట్లో తిప్పారు. ఈ విధంగా కేసుకు సాక్ష్యాలు అల్లారు. పార్లమెంట్ మీద దాడికి వ్యూహకర్తలు ఎవరో కనుక్కోవడంలో తమ వైఫల్యానికి వాళ్లు నన్ను బలి పశువును చేశారు. వాళ్లు ప్రజలను వంచించారు. పార్లమెంట్ మీద దాడి చేయాలన్న వ్యూహం, కుట్ర ఎవరిదో ప్రజలకు ఇప్పటికీ తెలియదు. నన్ను ఈ కేసులో కశ్మీరీ ఎస్టీఎఫ్ ఇరికించింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పకడ్బంది రచన చేసింది. మీడియా ఆ నిరంతరం ప్రసారం చేసింది. ఢిల్లీ హైకోర్టుగానీ, సుప్రీంకోర్టుగానీ ఈ సాక్ష్యాన్ని నమ్మలేదు. ‘నేరపూరిత కుట్రకు ప్రత్యక్షమైన సాక్ష్యం ఏమీలేదని’ అభివూపాయపడింది. ‘ఇది జాతినంతా కదిలించింది కనుక సమాజ సామూహిక ఆత్మను సంతృప్తి పరచడానికి మరణశిక్ష విధించక తప్పడం లేదని’ భావించింది. నాకు ఉరి శిక్షను ఖరారు చేసింది. పోలీసు అధికార్లకు అవార్డులు వచ్చాయి.
నేనిప్పుడు ఉరి కంబం మీద ఉన్నాను..
(అధారం: తీహర్ జైల్లో 2006లో అప్జల్‌గురు ‘ కరవాన్’ పత్రికకు ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూ.. )
తీహర్ జైలులో విషాద ఛాయలు..
దేశంలో ఒక భావధోరణి వాళ్ళందరూ అప్జల్‌గురు ఉరిశిక్షను వేడుక చేసుకుంటూ వుంటే..తీహర్ జైల్లో మాత్రం విషాదఛాయలు అలుముకున్నాయి. ఉరికంబం దగ్గరికి తీసుకపోయే సమయంలో కూడా జైలు సిబ్బంది అందరినీ పేరు పేరునా వినవూమంగా పలకరించాడు. ఉరితీసే ముందు ఎవరినైనా ‘మీ ఆఖరి కోరిక ఏమిటి’? అని అడుగుతారు. ‘ముఝే ఉమ్మీద్ హై ఆప్ ముఝె దర్ సహ కరాహోగే’(మీరు నాకు నొప్పి కలిగించరని నా విశ్వాసం) అని మాత్రమే కోరుకున్నాడు. తలారి ఆయనకు ఆ ఆశ్వాసాన్నిచ్చాడు. అఫ్జల్‌గురు ముఖం మీద నల్లగుడ్డ కప్పే ముందు అతడు అఫ్జల్‌గురు కళ్ళల్లోకి భావోద్వేగంతో కాస్సేపు చూస్తూ ఉండిపోయాడు. అప్జల్‌గురు అల్విదా అన్నాడు. అతడు కూడా మళ్ళీ అవే మాటలతో వీడ్కోలు చెప్పి ‘మీ ప్రయాణం సుఖవంతం అవుతుంది’ అన్నా డు. అది సుఖవంతం అయింది. ఒక్క నిమిషంలోనే చనిపోయాడు. కాని అతని మృతదేహం జైలు నియమాల ప్రకారం అట్లా ఒక అరగంటసేపు గాలిలో వేల్లాడుతూనే వుంది. ఆమృతదేహాన్ని ఉరికంబం మీంచి తొలగించి మత విశ్వాసాలకనుగుణంగా జైలు నంబరు మూడు కుడివైపున కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు మక్బుల్ భట్ గోరీ పక్కన ఖననం చేసారు.
అఫ్జల్‌గురు తనను పార్లమెంట్ దాడి కేసులోకి అక్రమంగా ఇరికించారనీ చెప్పేవాడని, ఎప్పుడూ భారతదేశాన్ని లంచగొండితనం,అవినీతి నుంచి బయటపడాలని చెప్తుండేవాడనీ జైలుసిబ్బంది అన్నారు. జైలు నియమాల ప్రకారం ఉరి తీయబోయే వ్యక్తికి 24 గంటల ముందు ఆ విషయాన్ని జైలు అధికారులు చెప్పాల్సివుంది. ఆయన ఆఖరి కోరిక ఏమిటి? ఎవర్ని కలవాలనుకుంటున్నారు?అని కూడా తెలుసుకోవాల్సివుంటుంది.కానీ అఫ్జల్‌గురు కు మాత్రం ఆరోజు ఉదయమే అంటే, కేవలం గంట ముందే ఆ విషయం చెప్పారు. కొన్ని పత్రికలలో వచ్చినట్లు గా అంతకు ముందు రోజు సాయంత్రం చెప్పలేదు. లాకప్ తీసాక ఆయనకు ఒక కప్పు చాయ్ ఇచ్చి ఈ విషయం చెప్పారు. ఆహారమేమీ ఇవ్వలేదు. కాని ఆయన ఎంత మామూలుగా వున్నాడంటే..ఈమాట చెప్పి ఆహారం ఇచ్చి నా తీసుకునేవాడేమో అన్నట్లుగా వున్నాడు. ఈ విషయం చెప్పే ముందు షెరాన్ అని పిలిచే కాశ్మీరీ గౌను వేసుకుని వున్నాడు.
చెప్పాక స్నానం చేసి తెల్లటి కుర్తా పైజామా వేసుకుని నమాజు చేసాడు. తీహార్ జైలులో ఇప్పటికి 25 ఉరిశిక్షలు అమలైవుంటాయి. తీహర్జైలు సీనియర్ అధికారులు కనీసం పది ఉరిశిక్షలు చూసి వుం టారు. కాని వీరిలో ఒక్కరు కూడా ఇంత గంభీరంగా నిర్మలంగా, ప్రశాంతంగా కాస్సేపట్లో వచ్చే మరణం గురించి చీకు, చింతలేనట్లుగా కనిపించలేదు. అఫ్జల్ జీవితంలోని ఆఖరి గంటలు కొందరు జైలు అధికారులతో గడిపాడు. జీవితం, మరణం పట్ల వుండే ఆలోచనలు పంచుకున్నాడు. ఆయన విశ్వజనీన సౌభ్రాతృత్వం గురించి మాట్లాడాడు. మానవజాతి ఐక్యతను గురించి మాట్లాడాడు. ఏ మనిషీ చెడ్డవాడుకాదు. ఎందుకంటే అందరి ఆత్మలు దైవసృష్టే. సత్యమార్గంలో నడవడటం ఒక్కటే ఎంతో గొప్ప కార్యసాఫల్యాన్ని సాధించినట్లు అని విశ్వసించేవాడు. ఆ ఉదయం ఆయన ఎంత ప్రశాంతంగా వున్నాడంటే ఒక కాగితం తీసుకుని తన ఆలోచనలు రాసుకున్నాడు.
సంతకం చేసి తారీకు సమయం వేసాడు.‘మీ కుటుంబం గురించి ఏమి ఆలోచిస్తున్నారు, నీ తరువాత వాళ్ళని ఎవరు చూసుకుంటార’ని అడిగితే..మనందరినీ చూసుకునేవాడు దేవుడే కనుక వాళ్ళను ఆయనే చూసుకుంటా డని అన్నాడు. ఆయన విద్యావంతుడు, జ్ఞాని, ఇస్లాం గురించి ఎంత తెలుసునో హిందూమతం గురించి కూడా అంత తెలుసు. రెండు మతాల్లో వుండే పోలికల గురించి తరచు చెప్పేవాడు. జైలులో నాలుగు వేదాలు చదివాడు. ఎంతమంది హిందువులు వేదాలు చదివారు? అఫ్జల్ వంటి పవిత్ర ఆత్మ మనని వదిలిపోతే అది ఎక్కడో విషాదపు గాయాన్ని చేస్తుంది. ఉరితీయబోతున్నాం అని చెప్పినప్పుడు,ఉరికంబానికి తీసుక పోయేటప్పుడు ఆందోళ న చెందడం చూసిన జైలు సిబ్బంది చిరునవ్వుతోనూ ప్రశాంతంగానూ చివరిదాకా వున్న అఫ్జల్‌ను చూసి చిరునవ్వుతో ఉరికంబం ఎక్కినవాళ్ళ గురించి విన్న గాథలు గుర్తుకు వచ్చాయన్నారు. ఉరి తీసిన ఇతరులకు అఫ్జల్‌కు ఉన్న తేడా గురించి చెబుతూ..అందరూ మత సంబంధమైనవో, రాజకీయమైనవో నినాదాలు ఇచ్చేవారు..కానీ అఫ్జల్ మాత్రం అటువంటువేమీ లేకుండా తన సెల్ నుంచి వంద అడుగల దూరంలో వున్న ఉరికంబం దాకా నడిచినంత దూరం చుట్టూ వున్న వాళ్ళకు అభివందనలు తెలుపుతూ నడిచాడు...
- వరవరరావు