ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించాయి. ఇవి జాతీయస్థాయిలో విస్తృత చర్చకు దారితీసే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులా లు, షెడ్యూల్డు జాతుల వారికి విద్యాసంస్థల్లో, ఉద్యోగ నియమాకాల్లో, రాష్ర్టానికి చెందిన వివిధ సర్వీసుల్లోని పదవుల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన 2017 బిల్లును, ఏప్రిల్ 16న రాష్ట్ర శాసన సభ, శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఉభయసభల ఆమోదం పొందడంతో ఒక చరిత్రాత్మక ఘట్టానికి నాంది పలికింది. ఏకకాలంలో మరో చరిత్రాత్మక నిర్ణయానికి తెరతీస్తూ ముఖ్యమంత్రి రాష్ర్టాలకుండాల్సిన రాజ్యాంగ హక్కులను పునరుద్ఘాటిస్తూ శాసనసభలో మాట్లాడారు. తద్వారా కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికారు. యాధృ చ్ఛికమే కావచ్చు. కానీ యావత్ దేశం భవిష్యత్లో సుదీర్ఘంగా ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, ఒక నిర్ణయానికి రావాల్సిన అంశమిది.
ఈ నేపథ్యంలో ఒక విషయం మననం చేసుకోవాలి! ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, 2012 గణతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. భారత సమాఖ్య నిర్మాణంలో ఒక క్రమ పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి ఆందోళన కలిగిస్తున్నదని ఆనాడాయన అన్నట్లు వార్తలొచ్చాయి. రాష్ర్టాలకు న్యాయబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వాటికి దక్కేట్లు చేయడం వల్ల కేంద్రం బలహీనపడిపోదు. రాష్ర్టాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలను అందించాలి. కానీ కేంద్రానికి అణగి మణగి ఉండాల్సిన అవసరం లేదు. సహకార సమాఖ్య పద్ధతి ఉండాలి. కానీ బలాత్కార సమాఖ్య పద్ధతి ఉండరాదు అనే భావనను మోదీ నాడు వ్యక్తపరిచారు.
బహుశా అంతకన్నా ఇనుమడించిన గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనారిటీలకు బీసీ- ఇ కేటగిరీ కింద, అదేవిధంగా షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్ కోటా పెంచే బిల్లును ప్రవేశపెడుతూ మాట్లాడిన పద్ధతి, బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందడానికి అవసరమై న భూమికను తయారు చేసుకుంటున్నట్లు భావించాలి. శాసనసభలో సీఎం వ్యాఖ్యలు తేటతెల్లంగా ఉన్నాయి. నేను కేంద్రాన్ని అర్థించడం లేదు, పోరాటం చేయబోతున్నాను. నీతిఆయోగ్ సమావేశంలో ఈ విష యం ప్రస్తావిస్తాను. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని సీఎం స్పష్టంగా చెప్పడం గమనార్హం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తమిళనాడుతో సహా దేశంలోని ఐదు రాష్ర్టాల్లో అమలులో ఉన్న రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సుప్రీం కోర్టు రాష్ర్టాలకు వెసులుబాటు కల్పించిందని, అలాంటి పరిస్థితులు తెలంగాణలోనూ ఉన్నాయని సీఎం అన్నారు. రాష్ర్టాలు ఇప్పుడు అమల్లో ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి, అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్న సరై న గణాంకాలు తెలంగాణలో కూడా ఉన్నాయని సీఎం అన్నారు. శాసనసభలో జరిగిన చర్చలో సీఎం, రిజర్వేషన్ల లాంటి కొన్ని కొన్ని విధా నపరమైన ముఖ్యమైన అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ర్టాల జనాభా ప్రాతిపదికన, తదితర ప్రాధాన్య అంశాల క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ర్టాలకే ఉండాలి. వాటిని రాష్ర్టాలకే కేంద్రం వదిలేయాలి. పరిణితి చెందిన మన దేశంలాంటి ప్రజాస్వామ్యంలో, రాష్ర్టాల అవసరాలకనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన సౌలభ్యం కేంద్రం రాష్ర్టాలకే వదిలేయాలి. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి స్థితిగతులు, పరిస్థితులు నేడు లేవు. ఇప్పుడు జనాభా పెరిగింది-పెరుగుతున్నది. ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది. అందుకు తగ్గ అవకాశాలు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం అభివృద్ధిపథంలో ముందుకు సాగడానికి రిజర్వేషన్ల అంశాన్ని ఆయా రాష్ర్టాల నిర్ణయానికి వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. తెలంగాణకు జరిగిన అన్యాయానికి, వివక్షకు వ్యతిరేకంగా మేం పోరాటం చేసినప్పుడు మాకు లభించిన, అందించిన సహకారం, కలిసి వచ్చిన నేపథ్యం ఇప్పుడూ కావాలి. భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం. అదే మనకు ప్రాతిపదిక. లేనిపక్షంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగి ఉద్యమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను, ఆలోచనలను గౌరవించాలి. కేంద్రంలో పార్టీలు మారవచ్చు. కానీ పటిష్టమైన కేంద్ర వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. అదో నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో తీసుకున్న నిర్ణయం ఎన్డీయే కొనసాగించక తప్పలేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించాయి. ఇవి జాతీయ స్థాయిలో విస్తృత చర్చకు దారితీసే అవకాశాలున్నాయి.
సీఎం కేసీఆర్ అభాగ్యులను ఆదుకోవాలనే ఆశయ సాధన ఉన్న వ్యక్తి. సమాజంలోని వెనుకబడినవర్గాలను ప్రగతిపథాన నడిపించడానికి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం నిర్విఘ్నంగా ముందు కు సాగగలదని ఆయన నమ్మకం. తెలంగాణలోని యావన్మంది ప్రజల మెరుగైన జీవనానికి, అభ్యున్నతికి నాంది పలుకాలనే సదుద్దేశమే రిజర్వేషన్లు పెంచాలనే ముఖ్యమంత్రి నిర్ణయాని మూలం.
న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి, సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్ దాటి, 62 శాతానికి పెంచిన రిజర్వేషన్లను అమలు చేస్తాం. అలా చేయగలమన్న నమ్మకం తనకున్నదని సీఎం స్పష్టం చేశా రు. మొత్తంమీద గత ఆదివారం జరిగిన రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు, ఆ సమావేశాల్లో బీసీ-ఇ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల బిల్లు ఆమో దం పొందడం కేసీఆర్ రాజకీయ విజ్ఞతకు, నాయకత్వ పటిమకు నిదర్శనం.