కుళ్లిన పాదాల కుటిల యాత్ర


Sun,April 7, 2013 10:18 AM

నడక నలుగురికీ
ఓ కొత్తదారిని చూపించే రహదారి కావాలి
నడక నాలుగు దిక్కులను కలిపే తొవ్వ కావాలి
నడకంటే తనతోపాటు
నలుగురినీ నడిపించేది కావాలి
ఎక్కడో ఒక దగ్గర.. ఏదో ఒక రోజున..
తొలి అడుగుతో మొదలైన నడక
లక్షల ఏండ్లు దాటి.. కోట్ల మైళ్లు నడిచి..
సైబర్ వేగాన్ని అందుకున్నది

గ్లోబల్ గ్రామాన్ని చేరకున్నది
కానీ బాబూ.. నీ నడకేమిటి?
అధికారపీఠం ఆశీస్సులతో
ప్రశ్నించే గొంతులను మూయించి

ప్రతిఘటించే ప్రజలను బంధించి
సాయుధబలగాల పహరాలో
చంద్రదండు సైనిక పటాలం మధ్యలో
పరిహసించే ప్లాస్టిక్ నవ్వులతో
విషాదపూరిత విజయచిహ్నాలను ఎగురవేస్తూ

నీ నడక
ఆఖరి మజిలీ కోసం
అంగలారుస్తున్నట్లే కనిపిస్తున్నది

కానీ...
భూమి విడిచి సాము నేర్చిన పాదాలు
నేల మీద నిలవలేవు
అధికార దురహంకార మత్తులో
కూరుకుపోయిన తొమ్మిదేళ్లు
అడ్డదారిలో అడుసుతొక్కి కుళ్లిపోయినపాదాలు
ఎనిమిదేళ్ల పదవీమోహాన్ని

మోసుకుంటూ ప్రయాస పడుతున్నయ్
ఎవుసం దండుగజేసి రియల్‌ఎస్టేట్ కంచెలు వేసి
నేల నేలంతా చెరబట్టి మట్టికరిచిన మనిషికి
అరికాళ్లు మోకాళ్లదాకా అరిగినా..
మట్టి మహత్యం ఒంటబట్టదు
నేలతల్లి ముఖాన ఓ నాలుగు నవ్వుల పువ్వులను
పూయించ ప్రయత్నించినందుకే కదా !?
ఆ ముగ్గురు రైతుబాంధవులను

బషీర్‌బాగ్‌లో నేలకూల్చింది
నేలను నమ్ముకున్న వాళ్లను
భూస్థాపితం చేసిన చేతులకు
మట్టిని ముట్టుకునే మర్యాద ఎక్కడిది?
మనిషి ఆఖరి కరచాలనం మట్టితోనే కదా!
రీబాక్ పాదుకలకు చిటికెడు మట్టి అంటకుండా
అరక దున్నుతున్న దృశ్యాలను తిలకించి
పులకరించిపోతున్న

ఏకపక్ష మీడియా అజ్ఞానానికి
అధినాయకుని అడుగుల
ఓటు విత్తనాలు మొలకపూత్తుతాయని
పాదధూళిలో పరవశించిపోతున్న
తెలుగుతమ్ముళ్లను చూసి
బురదలో బువ్వమెతుకులు

దేవులాడుకుంటున్న రైతన్నలు బెదిరిపోతున్నరు
అందుకే ..
ఆయ్యా! మమ్మల్ని మూడోసారి కూడా మన్నించు

-పిట్టల రవీందర్(తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

37

RAVINDAR PITTALA