తెలంగాణ బిడ్డకు కార్టూన్ నోబెల్!
Updated : 10/17/2014 4:14:55 AM
ఈ వారం నోబెల్ ప్రైజ్‌ల సందర్భం. చిన్న పిల్ల మలాలాకు వచ్చింది. అద్భుతం. అట్లే పిల్లలపై పనిచేస్తున్న సత్యార్థికీ వచ్చిం ది. శుభం. అంతకన్నా సంతోషం కార్టూన్ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్‌గా ఎన్నదగిన పురస్కారం మన నల్లగొండ బేటా, సాక్షి కార్టూనిస్టు శంకర్ పామర్తికి వచ్చింది. హక్కుల కోసం ఎలుగెత్తి న పిడికిలి మండేలా. ఆ నల్లమందారాన్ని రంగు పెన్సిళ్లతో అలవోకగా, అపూర్వంగా గీసిన శంకర్‌ను అభినందిస్తూ, ఒక విషయం పంచుకోవాలి.

శంకర్ ఒక్కరనే కాదు, తెలంగాణలోని చాలామంది చిత్రకారులు కళను ఆశ్రయించి బతకడంలో చేసిన సాహసం గొప్పది.అయితే, వాళ్లు ముందు ఇంట గెలిచి తర్వాత బయట గెలస్తూ వస్తున్నారనే చెప్పాలి. ఎట్లా అంటే, ముందు తాము చిత్రకళలో కృషి చేయడానికి ఇంట్లో ఒప్పించడానికి వాళ్లు పడ్డ బాధలు ఇన్నీ అన్నీ కావు. అయినా ఒప్పించగలిగారు. ఇవ్వాళ ప్రపంచం మెప్పును పొందగలుగుతున్నారు. తమ బాధలను పంటిబిగువన ఓర్చుకున్న ఫలితం. అయినా తమ బాధ ల్ని ఎక్కడా ఘనంగా చెప్పుకోలేదు. చివరకు గెలిచారు.బాధపడ్డ సంగతి చెప్పకుండానే విజయానికి చేరువవడం.ఇది ఈ తరం విజయం.

నిజానికి శంకర్ వంటి వాళ్లు తమ అభిరుచిని, ఆసక్తులను పోషించుకోవడానికి ముందూ వెనకా చూడకుండా పట్నం వచ్చేయడం అన్నది ఒక మొండితనం. సాహసం. భాగ్యనగ రం రావడం, ఇక్కడ ఏం చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నా రో తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడటం మరొక సాహసం. తాము సంతోషంగానే ఉన్నామన్న భరోసాను ఇస్తూ ఎంతో కొంత ఇంటికి పంపడం, తాము తిన్నా తినకు న్నా రంగుల ప్రపంచంలో బతికి, బట్టగట్టడం ఒక గొప్ప విజ యం. ఇలా తమను తాము నిలబెట్టుకున్న ఫలితమే ఇవ్వాళ అపూర్వ విజయాలను సొంతం చేసుకోవడం. తాము పనిచేస్తూ, పత్రికా రంగంలో ఇల్లస్ట్రేటర్‌గానో, కార్టూనిస్టుగానో స్థిరపడి భార్యా పిల్లల్ని పోషించుకుంటూ నిదానంగా తమకంటూ ప్రత్యేక శైలిని సంతరించుకోవడం మరో విజయం. వీళ్లంతా ప్రత్యేకంగా కృషి చేశారు.

ఆ ప్రత్యేకత ఫలితమే ఇవ్వాళ శంకర్ అందుకున్న గ్రాండ్ ప్రి పురస్కారం.ఇట్లా తమదైన శైలిని ఏర్పాటు చేసుకోవడానికి వారికి కొద్దిమంది వ్యక్తుల సహకారం ఎంత మేలు చేసిందో, ముఖ్యంగా శంకర్ విషయంలో మోహన్ గారి పరిచయం పెద్ద విజయం. ఇవ్వాళ మోహనన్నా విజేతే. తను గీసే పిడికిలే ఇవ్వాళ గొప్ప అస్తిత్వంతో ఎట్లా లేచిందో చూసి మురిసే సందర్భం. అదే సమయంలో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంలో అత్యంత కీలక పాత్ర వహించిన ఇంటర్నెట్‌ను అద్భుతంగా వాడుకోవడం శంకర్ మలి విజయం. ఇదీ అసలు విజయం. ఇవ్వాళ శంకర్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి దశాబ్దకాలంపైగా తాను మిత్రులతో గడిపిందానికన్నా, సహచరులతో అధ్యయనం చేసిందానికన్నా, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్త కార్టూనిస్టులు, కేరికేచరిస్టులు, ఇతర కళాకారుల శైలిని అధ్యయనం చేయ డం మహత్తరమైన భూమికను పోషించింది.

తనను తాను రిఫైన్ చేసుకోవడానికి సమాచార సాంకేతిక విజయం ఎంతగా ఉపకరించిందో చెప్పాలంటే ఇంటర్నెట్ లేకపోతే శంకర్ పట్నానికే పరిమితం. కానీ ఇవ్వాళ తాను ఇంటర్నేషనల్ ఫిగర్. కేవలం మౌస్‌ను వదలకుండా సాధించిన విజయం ఇది.అందువల్లే తాను దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చిండు. ఇదంతా కూచున్న చోటే అయింది. కానీ, ఇది చిన్న విషయమేమీ కాదని గ్రహించాలి. అయితే, ఇంత పెద్ద విషయానికి మూలం తాను తన తండ్రిని ఒప్పించి ఈడికి రావడమేనన్న అసలువిజయం గురించిచెప్పాలి. కార్టూనిస్టుగా పత్రికల్లో చేరిన పామర్తి శంకర్ కేరికేచరిస్టుగా తనను తాను సానబెట్టుకుని ఇవ్వాళ అంతర్జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ సాధించనన్ని పురస్కారాలు అందుకున్నడూ అంటే అదంతా పట్నంలో కాటగలసి పోకుండా తనను తాను మెలుకువగా వుంచుకోవడం వల్లే జరిగింది. ఈ మెలకువ ఎక్కడిదీ అంటే తండ్రి కరంటు నర్సింహ్మకు ఇచ్చిన మాట ఫలితమే.

అవును లైన్‌మెన్‌గా పనిచేసిన తండ్రికి శంకర్ నగరానికి రాక మునుపు ఇచ్చిన మాట ఫలిత మే. ఆ తర్వాతే శంకర్ లైన్ సూటి గా, వైభవోపేతంగా మలుపులు తిరిగింది. తండ్రి విద్యుత్తు ప్రసరణ అయితే బిడ్డ వెలుగులు విరజిమ్మే రేఖలే అయిండు.
ఆ సంగతి చెప్పడానికి ముందు మరొక్క మాట. శంకర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తూనే ఆర్టిస్టుగా ఎదగడమూ మరో విజయంగా చూడాలి. నిరంతరం తనను తాను మలచుకోవడం అన్నది ఇక్కడి ప్రత్యేకతగా గమనించాలి. ఇదంతా కూడా, ప్రపంచ పోకడలని అధ్యయనం చేస్తూ సాగిన ఫలితమే ఇవ్వాళ నల్లగొండలోని మారుమూల గ్రామీణుడు పోర్చుగల్‌లో కాలీడే స్థాయికి రావడంగా చూడాలి. కళ వీళ్లను పేదరికాన్ని జయించేలా చేసింది. భాగ్యవంతులనూ చేస్తున్నది. దానికి దారిచూపింది సాహసోపేతంగా వాళ్లు ఎంచుకున్న తోవ. అదే శైలి. ఇటు పత్రికల్లో తాము చేసే పనిస్థాయి పెరిగింది. అట్లే, కళాకారులుగా గౌరవం అందుకునేలా చేసింది. అంతర్జాతీయంగా మన అస్తిత్వాన్ని చాటగలిగేలా చేసింది.

అయితే, శంకర్ పామర్తి తన తండ్రిని ఒప్పించిన తీరు కళాకారులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. అక్కడ్నుంచే తన విజయం ప్రారంభమైంది. శంకర్ తాను చిన్ననాడే బొమ్మలు వేస్తుంటే తండ్రి భయపడ్డాడట. వీధుల్లో బొమ్మ లు వేసే చిత్రకారుడి వలే భిక్షగాడివే అవుతావని బెదిరించాడు. నిజమే. కళను ఆశ్రయిస్తే దరిద్రం ఇంట్లో వుంచుకున్నట్టే అన్న భావన ఎవరి ఇంట్లోనైనా ఉండనే ఉంది. అందుకు కారణం ఆంద్రప్రదేశ్‌లో బతికినన్నాళ్లూ మన కళకు, కళాకారులకు గౌరవం లేకపోవడం ఒక ముఖ్య కారణం. కానీ, తండ్రి మాటలో నిజముంది. అయితే, శంకర్ ఒక అద్భుతం చేశాడు.

తాను తండ్రితో అన్నదేమిటంటే, నాయినా. దేవుడి బొమ్మలు చేసే ఆయనకు నిజంగానే మూడు బొమ్మలే వస్తయి. కానీ, నేను నాలు గో బొమ్మ కూడా నేర్చుకుంట అని ఒప్పించిండు. నమ్మకాన్ని పంచిండు. ఆ ఒప్పందం ఫలితమే ఇవ్వాళ మూడో ప్రపంచ దేశాల నుంచే కాదు, మొదటి ప్రపంచ దేశాల చిత్రకారుల సరసన శంకర్ సమవుజ్జీగా నిలబడగలిగేలా చేసింది. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ శంకర్ వేసిన బొమ్మనే ఉత్తమ కార్టూన్‌గానూ, అట్లే ఉత్తమ కేరికేచర్(గ్రాండ్ ప్రి) గానూ ఎంపికయ్యేలా చేసింది. నెల్సన్ మండేలాపై వేసిన తన చిత్రం 64 దేశాల చిత్రకారుల్లో మనదేశ చిత్రకారుడిగా, ఆసియాలోనే తొలి కార్టూనిస్టుగా గ్రాండ్ ప్రిని సొంతం చేసుకుంది. ఇదంతా కూడా ఆ నాలుగో బొమ్మ వేయాలనుకున్న ఫలితం.ఇయ్యాళ శంకర్ పదివేల యూరోల బహుమతి అందుకుంటున్నడూ అంటే అట్లా ఉదర పోషణా ర్థం చేసే కళకూ, సిసలైన కళకూ ఉన్న తేడా ఏమిటో గ్రహింపు ఉండటమే. ఈ మెలకువే శంకర్‌ను విజేతను చేసింది. పట్నం వచ్చినా కాటగలసి పోకుండా నిలిపింది. అందుకే ఈ విజయం ఇంటిది.

rameshbabu

ఇంట్లో నమ్మకాన్ని పంచి బయట లోకాల ను గెల్చుకుంటున్న తెలంగాణ బిడ్డలది.జయహో శంకర్. కళ-కాసులు, పేరు-ప్రతిష్టలు.. అన్నీ గెల్చుకోవడం ఇవ్వాళ్టి మన అవసరం. టైమింగ్. బంగారు తెలంగాణ అంటే ఇదే. వేచి వుండి ఫలితం సాధించుకోవడం. శంకర్ నీకు వందనం. కరెంటు నర్సింహులుకు నచ్చజెప్పిన బిడ్డగా అభివందనం.
Advertisement


Advertisement
Advertisement
Today's E-paper
Advertisement
Advertisement