ఓపెన్ కాస్టుల (ఓసీ) విధానం తెలంగాణ ప్రాంత పర్యావరణాన్ని అడ్డు అదుపు లేకుండావిధ్వంసం చేస్తున్నది. అండర్ గ్రౌండ్ విధానం వల్ల మానవ నివాసయోగ్యమై న భూమి పైపొరకు నష్టం జరుగదు. అందుకు భిన్నంగా ఓపెన్‌కాస్టు గనుల తవ్వకాలు సారవంతమైన భూమి పైపొరను తలక్షికిందులుగా చేస్తుంది. దీంతో భవిష్యత్తులో ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. ఏయేటికి ఆయేడు ఉత్పత్తి లక్ష్యాలను విపరీతంగా పెంచుకుంటూపోవడం, ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు ఓపెన్ కాస్టుల ద్వారానే తవ్వి తీయడం వల్ల పర్యావరణ విధ్వంసం కూడా ఆ మేరకు తీవ్రంగా పెరిగిపోతున్నది.
నిరంతర బ్లాస్టింగ్ మూలంగా గాలి కలుషితమై విపరీత అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. చుట్టు పక్క గ్రామాలలో ఇండ్లు కూలిపోతున్నాయి. ఓపెన్‌కాస్టు గనులు తవ్వినచోట- పర్యావరణ పరిరక్షణ కోసం, భూమిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావడానికి అనుసరించే విధానం గురించి పర్యావరణ రక్షణ చట్టాలు రూపొందించాయి. అవేవి వలసపాలకుల వివక్షవల్ల ఆచరణకు నోచుకోవడం లేదు. పర్యావరణ పరిరక్షణకోసం కంపెనీ చేపడుతున్న చర్యలన్నీ కంటితుడుపు చర్యలే. బొగ్గు గనుల ప్రాంతంలో వందల కోట్లుఖర్చు చేసి కోట్లాది చెట్లు పెంచామని, కాగితాలలో లెక్కలు చూపారు. కానీ ఆంధ్ర అధికారుల అవినీతి మూలంగా అదంతా కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాంత పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఆంధ్ర పాలకులకు ఈ ప్రాంత బొగ్గు సంపద మీదున్న ప్రేమ ఈ ప్రాంత పర్యావరణం మీద, ఈ ప్రాంత ప్రజల మీద లేదు.
90 శాతం బొగ్గు నిలువలు తెలంగాణలోని గిరిజన ప్రాంతంలోనే ఉన్నాయి. గనుల తవ్వకం వల్ల నిర్వాసితులయి నష్టపోతున్న వారిలో గిరిజనులే ఎక్కువగా ఉన్నారు. గిరిజనుల హక్కుల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ ల ప్రాంతంలో ఆదివాసేతరుల ప్రవేశాన్ని నిషేధించారు. 1/70 చట్టం గిరిజనభూములకు రక్షణ కల్పించింది. ఆదివాసుల భూములు ఆదివాసేతరులు కొనరాదని 1959 నాటి చట్టం చెబుతున్నది. 1996 నాటి పంచాయితీ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా చట్టం ప్రకారం గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, ప్రత్యేకతలను, ఉమ్మడి వనరులను కాపాడుకునే హక్కు కల్పించింది. ఆదివాసుల హక్కులపై జెనీవాలో జరిగిన సదస్సు ఆదివాసుల జీవించే హక్కుకు, సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించకుండా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్దేశించింది. కానీ తెలంగాణ వనరుల దోపిడీ మీదు న్న ఆబ ఈ ప్రాంత ప్రజలపైలేని వలసపాలకులు ఈ చట్టాలను అమలు చేయడం లేదు.
సింగరేణి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణలోని నాలుగు జిల్లాలకు చెందిన 60 మండలాల్లో ఇప్పటికే 6.04 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులయ్యారు. గిరిజనుల అమాయకత్వాన్ని, వెనుకబాటు తనాన్ని ఆసరాగా చేసుకొని నష్ట పరిహారం చెల్లింపులో అనేక అన్యాయాలు జరిగాయి. ఇంకా కోర్టులలో కొన్ని కేసులు మూలుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2007లో ప్రతిపాదించిన ఆదిలాబాద్ జిల్లాలోని ఇందారం ఓపెన్ కాస్టు గనిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాసంఘాలు వారికి అండగా నిలిచాయి. గనిని తవ్వబోమని ప్రజలు వ్యతిరేకించినచోట ఓసీలు ఉండవని యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఇందారం ఓసీని ప్రారంభించడానికి ఒక ప్రాజెక్టు అధికారిని కూడా నియమించి సర్వేలు చేయించడం మొదలుపెట్టారు.
ఐకే 1, ఐకే 1ఏ భూగర్భ గను ల కన్వర్షన్ పేరు పెట్టి ఈ ఓసీకి సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇందారం, దాని చుట్టుపక్కల శెట్పల్లి, రామారావుపేట గ్రామాల ప్రజలంతా ఓసీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ గ్రామం మూడు వేల మంది కి ప్రత్యక్షంగా వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పిస్తున్నది. ఈ గ్రామం పోతే వారికి తీవ్ర నష్టం జరుగుతుంది. వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇప్పటికే గోదావరిలో నీళ్లు లేక ఎడారిలా మారింది. దాని పక్కనే ఉన్న ఈ గ్రామం ఇక స్మశానంగా మారే అవకాశముంది. గోదావరి చుట్టు పక్కల, ఒడ్డున ఉన్న 30 గ్రామాలకు మంచినీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఓపెన్ కాస్టులకు వ్యతి రేకంగా ఉద్యమిస్తున్నారు. ఇందుకు ప్రజావూపతినిధులంతా కలిసి రావాలంటున్నారు.
ఇప్పటికే ఓసీల హోరు భరించరాకుండా ఉంది. ఇక ఇందారం ఓసీ కూడా వస్తే ఈ ప్రాంతం దుమ్ము, దుబ్బతో మహారాష్ర్టలోని చంద్రాపూర్, బల్లార్షాలను తలపిస్తుంది. వాస్తవ పరిస్థితులు ఇప్పటికయినా విజ్ఞులైన ప్రజావూపతినిధులు, తెలంగాణవాదులు గ్రహించాలె. స్వచ్ఛందంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతు ఇవ్వాలి. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక జీవించే హక్కు కోసం పోరాడే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుంది.
-ఎండీ. మునీర్