బొగ్గు మార్కెట్లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చు కూడా పెరిగిపోయింది.దేశీయ సంస్థలైన కోలిండియా, సింగరేణి కూడా దీనిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం కోలిండియా, దాని సబ్సిడరీలు, సింగరేణి లాభాలలో నడుస్తున్నాయి. కోలిండియా, సింగరేణి ఈపోటీని ఎదుర్కొవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
బొగ్గుతోనే దేశంలోని 72శాతం విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయినప్పటికి బొగ్గు సంస్థల మీద పెట్టుబడులు పెట్టడం ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేసినయి. అయితే ప్రతియేటా రాయల్టీల పేరిట, పన్నుల పేరిట, డివిడెండుల పేరిట వేలకోట్ల రూపాయలు తీసుకోవడం మాత్రం మానలేదు. చివరికి సింగరేణి లాంటి సంస్థకు ఎప్పుడో 90వ దశకంలో ఇచ్చిన అప్పుకు 663 కోట్లకు వడ్డీ వేసి అసలు వసూలు చేసుకున్నప్పటికి వడ్డీని మాత్రం వసూలు చేసుకోవడం బంద్ చేయలేదు.
సంవత్సరానికి 33 కోట్ల చొప్పున ఇప్పటికే 200 కోట్ల పైగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు కేంద్ర ప్రభుత్వం వైఖరి బొగ్గు సంస్థలపై ఎలా ఉందో చెప్పడానికి.మరోవైపు కొత్తబొగ్గుబావులు ప్రారంభించడానికి కూడా సింగరేణి లాంటి సంస్థలు స్వతహాగానే పెట్టుబడిని కూడబెట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థలనుంచి బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని పెగడపల్లి దగ్గర సింగరేణి నిర్మాణం చేపట్టిన 1200 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం ఏడు వేలకోట్ల ఖర్చు పెడుతుంటే అందులో ఐదు వేలకోట్ల వరకు అప్పు.
ఈదశలో కోలిండియా నిర్దేశించిన 500 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయినా, సింగరేణి నిర్దేశించిన 54 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయినా ఈ మార్చి 31లోపు సాధించాల్సి ఉంది. కానీ విదేశీ బొగ్గు ధర టన్నుకు వెయ్యి వరకు పడిపోయింది. దీనితో దేశంలోని బొగ్గు వినియోగదారులంతా విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవడానికే శ్రద్ధ చూపుతున్నారు. మరోవైపు ఈ యాక్షన్లో కోట్ల రూపాయల లాభాలు కోలిండియాకు, సింగరేణికి వచ్చేవి. గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ యాక్షన్ సేల్స్ భారీగా తగ్గాయి. దీనితో 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ యాక్షన్ ద్వారా లాభాలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం రూ.600 కోట్ల వరకు సింగరేణికి ఈ యాక్షన్ ద్వారానే లాభాలు వచ్చాయి. ఈసారి గత నవంబర్ నుంచి ఈ యాక్షన్లో సేల్స్ చాలా తగ్గిపోయాయి. రూ. 200 కోట్ల వరకు లాభాలు తగ్గిపోవచ్చు.
విద్యుత్ ధరలతోపాటు డీజిల్, స్టీల్, సిమెంట్ ధరలు పెరిగిపోయిన ప్రభావం బొగ్గు సంస్థలపై పడింది. సింగరేణి లాంటి సంస్థపై ఈ ప్రభావం టన్నుకు రూ. 300 వరకు పడింది. రూ. 300 ధరలు పెంచి సంబంధిత సంస్థల నుంచి సింగరేణి వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ. 150 వరకే సంస్థ వసూలు చేస్తోంది. దీనితో నేరుగా రూ. 150 భారం పడుతుంది. మరోవైపు బొగ్గు ధర పెరిగే అవకాశాలు కూడా కన్పించడం లేదు. బొగ్గు ధర పెంచితే ఇప్పటికే విదేశీ బొగ్గు ధర తగ్గిపోయి అక్కడినుంచి దిగుమతి అవుతుంది. అలాంటప్పుడు ఇంకా ఇక్కడి బొగ్గు ధర పెంచితే వినియోగదారులు గతంలో లాగా బొగ్గు కొనే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. బొగ్గు మార్కెట్లో ఇబ్బందులు తీవ్రం గా ఉండే అవకాశం ఉంది. మరోసారి డీజిల్ ధరలు పెరుగుతాయంటున్నారు. మరోసారి డీజిల్ ధర పెరిగితే దాని ప్రభావం రూ. 50 ఒక టన్ను ఉత్పత్తిపై నేరుగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ధరల పెరుగుదల వల్ల సింగరేణి ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటా యి. ఇప్పుడే సంస్థ మార్జిన్లో ఉంది. రానున్న రోజుల్లో ఉత్పత్తి లక్ష్యాలు సాధించని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది.
అమెరికాలో షెల్ గ్యాస్ వచ్చి బొగ్గు వినియోగం తగ్గింది. దీంతో బొగ్గును చౌకగా ఎగుమతి చేస్తున్నారు. ఈ పోటీని ఎదుర్కోవాలంటే లక్ష్యాలను పెంచుకోవడమే దారి అని అధికారులు అంటున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఈ సంవత్సరం మార్చి 31 లోపు సాధించడం అనివార్యమైంది. ఒక్కరోజు ఉత్పత్తి జరగకున్నా ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం ఛేదించడం కష్టమేనని అధికారులు బాహాటంగా చెప్తున్నారు. అయితే ఆ దిశన పయనించడం కోసం కార్మికవర్గ ప్రయోజనాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని, ఆదిశన కూడా యాజమాన్యం యోచించాలని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే కోల్బెల్ట్లోని ప్రజా ప్రతినిధులకు మాత్రం సంస్థ కష్ట నష్టాలపై, కార్మికుల సమస్యలపై ఏమాత్రం పట్టింపులేదు. ఓపెన్ కాస్టు బొగ్గు బావుల వ్యతిరేకఆందోళనలైనా, కొత్త బొగ్గు బావుల తవ్వకమైనా వారు పట్టించుకోవడం లేదు. సింగరేణి మనుగడ సాగించాలంటే ప్రజా ప్రతినిధులు కూడా మేల్కొని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కొత్త ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెట్టేవిధంగా అప్పులపై, వడ్డీలపై మాఫీని సాధించే దిశన కొత్తగా ఉద్యోగాలను సాధించే దిశన పయనించాల్సిన అవసరం ఉన్నది.
-ఎండీ. మునీర్