బస్తర్.. భారత యేనాన్..


Sun,April 7, 2013 08:09 AM

దండకారణ్యం భారతదేశంలోని అరుణారుణ ప్రాంతం నుంచి ఢిల్లీకి తిరిగివస్తుంటే.. నాకు డ్బ్భైఐదు సంవత్సరాల కిందట ఉత్తర షాంగ్సీ లోని యేనాన్ నుంచి కొమింగ్‌టాంగ్ రాజధాని సియాన్‌కు తిరిగివచ్చినట్లనిపించింది. కానీ నేనక్కడ నాలుగు నెలలు గడిపి రాలేదు. కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాను. చైనా విప్లవ కేంద్రమైన పొడి వాతావరణపు ఉత్తర షాంగ్సీకీ, ఇవాళ్టి భారత విప్లవ కేంద్రమైన దండకారణ్యానికీ, బస్తర్ అడవులకూ తేడాలు ఎన్నైనా ఉండవచ్చు. ప్రస్తుత పోరాటపు పర్యవసానం ఏమైనా కావచ్చు..’’
img459 talangana patrika telangana culture telangana politics telangana cinema

భారత విప్లవోద్యమంపై స్ఫూర్తినిచ్చే పుస్తకం ‘భారత్‌పై అరుణతార’ రాసిన ప్రసిద్ధ స్వీడిష్ రచయిత యాన్ మిర్దాల్ తన దండకారణ్య పర్యటనను ముగిస్తూ చెప్పిన మాటలివి. ఆ భావనలు ఆయనలో కలగడాన్ని ఆ పుస్తకం చదివిన ఎవరూ తప్పు పట్టలేరు. పుస్తకానికి పెట్టిన శీర్షిక, లోపలి పేజీల్లో మిర్దాల్ తడిమిన విషయాలు పాఠకులకు పదే పదే చైనా విప్లవాన్నీ, అమెరికన్ జర్నలిస్టు ఎడ్గార్ స్నో రాసిన ‘చైనాపై అరుణతార’నూ గుర్తుకుతెస్తాయి. మావో సేటుంగ్ బలగాలను కాపాడుకునే లక్ష్యంతో లాంగ్‌మార్చ్‌కు పూనుకుంటారు. సుమారు మూడు లక్షల సంఖ్యలో ఉన్న ఎర్ర సైన్యం శత్రుదాడులు, అనేక కష్ట నష్టాల మధ్య 30వేలకు క్షీణించిన స్థితిలో వాయవ్య చైనాకు చేరుతుంది. షాంగ్సీ-కాన్సు- నింగ్సియా సరిహద్దుల్లో విశాలమైన విముక్తి ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. పార్టీ అధినాయకత్వం ఉత్తర షాంగ్సీలోని యేనాన్‌ను హెడ్‌క్వార్టర్స్‌గా చేసుకుని పనిచేస్తుంది. 1936 జూలైలో ఎడ్గార్ స్నో యేనాన్‌కు వెళ్లి మూడు నెలల పాటు ఉండి మావో, చౌఎన్‌లై, ఛూటే తదిత ర అగ్రనేతలను కలుస్తారు. ఎర్రసైన్యంతో తిరుగుతారు. చైనా విప్లవోద్యమం గురించిభగామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న ప్రజారాజకీయాధికారం గురించి అనేక సంగతులను ‘చైనాపై అరుణతార’ గ్రంథం ద్వారా వెలుగులోకి తెస్తారు.

సరిగ్గా 74 ఏళ్ల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆహ్వానం మేరకు 2010 జనవరిలో దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతానికి వెళ్లిన జాన్ (స్వీడిష్ సంప్రదాయంలో యాన్) మిర్దాల్ 16 రోజులు ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్‌జీఏ) దళాలతో కలిసి నడిచారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి సహా పలువురు అగ్రనేతలతో సంభాషించారు. నేటి భారత విప్లవోద్యమ పరిస్థితులు చాలా విషయాల్లో నాటి చైనా పరిస్థితులను పోలివున్నాయని భావించారు. 1925లో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ తదితర చోట్ల గొప్ప రైతాంగ సాయుధ ఉద్యమాలను నడిపించినప్పటికీ క్రమంగా రివిజనిస్టు రాజకీయాల్లో, పార్లమెంటరీ రొంపిలో చిక్కుకుపోయి నిర్వీర్యమైంది. ఈ పరిస్థితుల్లో చారుమజుందార్ భారత విప్లవానికి మార్గాన్ని నిర్దేశించారు. ఆయన నాయకత్వంలో ఎగసిన నక్సల్బరీ తిరుగుబాటు దేశవ్యాప్తంగా యువతీ యువకులను తట్టిలేపింది.

విప్లవ కదనరంగాన దింపింది. శ్రీకాకుళానికి వ్యాపించిన ఉద్యమం అక్కడ నష్టాలకు గురి కాగానే తెలంగాణకు విస్తరించింది. సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ నాయకత్వాన భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేబట్టి ప్రభుత్వ వ్యతిరేక పోరాట స్థాయికి చేరింది. ఉత్తర తెలంగాణ, మన్యం, నల్లమలల్లో సంఘటితమై సాయుధ నిర్మాణాలను పెంచుకుంది. దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. మరో ధారగా చారుమజుందార్ పంథాను ఎత్తిపట్టిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ), సీపీఐ(ఎంఎల్) పార్టీ యూనిటీలు బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో బలమైన ఉద్యమాలను నిర్మించాయి. ప్రభుత్వ బలగాలను సైతం ప్రతిఘటిస్తూ జార్ఖండ్ అడవులను, జహనాబాద్ మైదానాలను గెరిల్లా జోన్లుగా అభివృద్ధి చేశాయి.

ఈ దశాబ్దంలో రెండు విరుద్ధ పరిణామాలు సంభవించాయి. విప్లవ క్యాంపునకు అనుకూల పరిణామమేమంటే వివిధ రాష్ట్రాల్లో బలమైన నిర్మాణం కలిగిన పై మూడు ఎంఎల్ పార్టీలు 2004 నాటికల్లా ఒకే పార్టీగా విలీనమయ్యాయి. సమకాలీన ప్రపంచంలోనే అతిపెద్ద మావోయిస్టు పార్టీగా, దేశవ్యాప్త నిర్మాణం కలిగిన సంస్థగా రూపుదిద్దుకున్నాయి. నిరాశ పర్చే విషయమేమంటే మైదాన ప్రాంతాల్లో ఉద్యమం బలహీనపడడం.
కొత్తగా ఏర్పడ్డ భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఈ విరుద్ధ పరిణామాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించింది. ప్రపంచీకరణ తదనంతర కాలంలో భారత విప్లవ వ్యూహం-ఎత్తుగడ ల్లో తేవాల్సిన మార్పులను గుర్తించింది. మార్క్సిజం-పూనినిజం- మావోయిజాన్ని దేశ నిర్ధిష్ట పరిస్థితులకు ఆన్వయించింది. దీర్ఘకాలిక యుద్ధ పంథా ప్రకారం దేశంలోని వెనుకబడిన, మారుమూల అటవీ-ఆదివాసీ ప్రాంతాలు ముందుగా విముక్తమవుతాయని, ఆ తర్వాత క్రమంగా మైదానాల పల్లెలు, పట్టణాలు, అంతిమంగా నగరాలు విముక్తి చెందుతాయని చెప్పింది.

ఆంధ్రవూపదేశ్- మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ (దండకారణ్యం), ఆంధ్రవూపదేశ్-ఒరిస్సా(ఏఓబీ), బెంగాల్-ఒరిస్సా-జార్ఖండ్ (జంగల్‌మహల్), జార్ఖండ్-బీహార్-ఛత్తీస్‌గఢ్(సరాండా అడవులు) సరిహద్దు ప్రాంతాలపై కేంద్రీకరించింది. ఈ నాలుగు ప్రాంతాలను పూర్తి స్థాయి గెరిల్లా జోన్లుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. దళాలుగా, ప్లాటూన్లుగా విడిగా పని చేస్తున్న పీఎల్‌జీఏ బలగాలను గెరిల్లా జోన్ స్థాయిలో కంపెనీలుగా, బెటాలియన్లుగా సంఘటితం చేసింది. ఈ బలగాల రక్షణలో ప్రజా రాజకీయాధికార అంగాలైన జనతన సర్కార్ల(విప్లవ ప్రజా కమిటీ)ను గ్రామస్థాయిలో, ఏరియా, జిల్లా స్థాయిల్లో ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో ఒక్కో గెరిల్లా జోన్‌లోని కొన్ని ఏరియాలను శత్రువు ప్రవేశించ వీలుగాని గెరిల్లా బేస్‌లు (స్థావరాలు)గా మార్చుకుంది. దండకారణ్యంలోని బస్తర్‌లో గల సరిగ్గా ఇలాంటి ఒక గెరిల్లా బేస్‌లోనే జాన్ మిర్దాల్ పర్యటించారు. తెలంగాణలో ఓడిపోయిన విప్లవ శక్తులు దండకారణ్యానికి తిరోగమించి అక్కడ విప్లవ కేంద్రం స్థాపించడాన్ని హునాన్ నుంచి తిరోగమించిన చైనా ఎర్రసైన్యం యేనాన్‌లో పాగా వేయడంతో పోల్చారు.

భారత ప్రజలు, ఇక్కడ కొనసాగుతున్న విప్లవోద్యమం, నక్సల్స్ నిర్మూలన పేరుతో ప్రభుత్వం మధ్యభారతంలో కొనసాగిస్తున్న యుద్ధం తదితర విషయాలను మిర్దాల్ తన పుస్తకంలో తర్కబద్ధంగా విశ్లేషించారు. భారత ప్రజలు పేదవారుగా ఉన్నారు తప్ప ఆ దేశం పేదది కాదని కుండ బద్దలు కొట్టారు. 1940లో రజనీ పామీదత్ రాసిన ‘ఇండియా టుడే’ గ్రంథాన్ని ఉటంకిస్తూ స్వాతంత్య్రం వచ్చిందని చెబుతున్న ఈ 65 ఏళ్లలో ఇక్కడ జరిగిన మార్పు శూన్యమని అభివూపా
యపడ్డారు. పేదరికంపై యుద్ధం కాస్తా పేదలపై యుద్ధంగా మారిందని వాపోయారు. దేశ పరిస్థితులను గమనిస్తే రెండు విషయాలు కొట్టొచ్చినట్లు కనబడతాయంటూ ఇక్కడి సహజ సంపద, విస్తారమైన వనరులు ఇవాళ ఉనికిలో ఉన్న యావత్తూ ప్రజానీకానికీ, ప్రస్తుత జనాభాను మించిన జనాభాకూ సరిపోతాయనీ, అయితే, చేతికి అందేంత దూరంలోనే ఉన్న ఈ సిరిసంపదలను పేదలు అందుకోలేకపోతున్నారనీ వివరించారు. స్థూలజాతీయోత్పత్తి సాలీనా 8శాతం ఉన్న దేశంలో 55శాతం మంది అంటే 66కోట్ల మంది పేదరికంలో మగ్గడం అసమంజసమని, ఆకలి సూచికలో సహారా ఎడారి దేశాల కంటే భారత్ దిగువన ఉండడం సిగ్గుచేటంటారు ఆయ న.మారని ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా తరాలుగా పోరాటం కొనసాగుతోందని మిర్దాల్ తెలిపారు.

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా 1857 నుంచి కొనసాగిన జాతీయోద్యమంలో పేద ల ఆకాంక్షలు దాగివున్నాయన్న విషయం మరవరాదన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అధికారాన్ని బ్రిటిష్ రాచరికానికి దఖలు చేస్తే, ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొంటున్న మలివిడత ఉద్యమం నామమావూతపు అధికార బదలాయింపును మాత్రమే సాధించగలిగిందని వివరించారు. ‘ఒక విదేశీ ప్రభుత్వం స్థానంలో దేశీయ ప్రభుత్వం వచ్చి స్వార్థ ప్రయోజనాలన్నిటినీ యథాతథంగా ఉంచినట్లైతే అది కనీసం స్వాతంవూత్యపు నీడ కూడా కాజాలద’ంటూ 1933లోనే ‘విదర్ ఇండియా’ పుస్తకంలో నెహ్రూ పేర్కొన్నారనీ, 2010లో భారత్ పరిస్థితి చూస్తే నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఎవరైనా ఒప్పుకోక తప్పదనీ అన్నారు. దేశానికి నిజమైన స్వేచ్ఛా స్వాతంవూత్యాలు రావాలంటే తృతీయ, చివరిదైన స్వాతం త్య్ర సంగ్రామం కొనసాగాల్సివున్నదని పరోక్షంగా సూచించారు. మావోయిస్టుల ప్రస్తుత విప్లవ పోరాటం ఆ స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

మావోయిస్టులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య కొనసాగుతున్న అప్రకటిత యుద్ధాన్ని విశ్లేషిస్తూ రచయిత 2010 జూలై 4న హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని ఉటంకించారు. ‘‘ప్రతి ఐదుగురిలో ఒకరు తిరుగుబాటు నీడలో బతుకుతున్న దేశంలో ఇప్పుడొక యుద్ధం మొదలైంది. ఇది కాశ్మీర్ కన్నా, ఇరాక్ కన్నా, ఆఫ్ఘనిస్తాన్ కన్నా కష్టతరమైన యుద్ధం. దుర్భర దారివూద్యాన్ని అనుభవించే ప్రజలకు నెలవైన భారతదేశపు భూములు ఆ ఘర్షణకు మహా రణస్థలంగా మారబోతున్నాయి. పరిమాణాన్ని బట్టి చూసినా, జరగబోయే ప్రాంతా న్ని బట్టి చూసినా ఈ యుద్ధం ప్రపంచంలోకెల్లా తిరుగుబాట్ల మీద జరిగిన అత్యంత కఠినతరమైన యద్ధం కాబోతున్నది. ప్రధాన యుద్ధక్షేవూతమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సుదూర, సాంద్ర అరణ్యాలు ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన ఇనుప ఖనిజానికి కాణాచి. ఈ యుద్ధక్షేత్రం కాశ్మీర్‌లోయతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ విశాలమైనది.

ఈ ప్రాంతంలోని విస్తారమైన భూభాగాలు గత రెండు దశాబ్దాలుగా తిరుగుబాటుదార్ల ఆధీనంలోనే ఉన్నాయి.’’ఈ యుద్ధపు అసలు లక్ష్యాలనూ మిర్దాల్ బయటపెట్టారు. గ్రీన్‌హంట్ నామంతో కొనసాగుతున్న యుద్ధం వెనకాల అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచబ్యాంకు, బహుళజాతి కంపెనీల హస్తం ఉందని ఆరోపించారు. దేశ జనాభాలో 9 శాతం మాత్రమే ఆదివాసులు ఉన్నారని, అయితే అభివృద్ధి పథకాల కోసం సేకరించిన మొత్తం భూముల్లో 40శాతం కన్నా ఎక్కువ ఆదివాసులవేనని తెలిపారు. గ్రీన్‌హంట్‌లో భాగంగా భారత సాయుధ బలగాల అకృత్యాలను ఆదివాసుల అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు.

సీపీఐ(మావోయిస్టు)నాయకత్వంలో కొనసాగుతున్న ప్రస్తుత విప్లవ పోరాటాన్ని మిర్దాల్ ప్రజాయుద్ధంగా ప్రకటించారు. ప్రభుత్వ ప్రాంతం నుంచి నక్సల్ ప్రాంతంలో ప్రవేశిస్తున్నప్పుడు దారి పొడవునా మాట్లు ఏర్పాటు చేసివుండడాన్ని గమనించి ఇది ప్రజాయుద్ధమనడానికి ఇవే ప్రబల నిదర్శనాలని పేర్కొన్నారు. గ్రామక్షిగామాన స్థానిక మిలీషియా బృందాలు ఎదురుపడడం, జనతన సర్కార్ల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్షికమాలు కొనసాగుతుండడం చూసి స్ఫూర్తి పొందారు. పీఎల్‌జీఏ క్యాంపుల్లో సకల సౌకర్యాలు ఉండడం, సోలార్ సెల్స్‌తో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ముద్రణాయంవూతాలు నడుస్తుండడం చూసి విముక్తి ప్రాంతాల కల నిజమైందన్నంతగా ఉద్వేగం చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి ఎంతో పరిణతి చెందిన నాయకునిగా కనిపించారని కితాబిచ్చారు. భారత విప్లవోద్యమ దశ-దిశ విషయంలో అయనకు చాలా స్పష్టత ఉందని మెచ్చుకున్నారు.

చారుమజుందార్ సూత్రీకరణలను సరిదిద్దుకోవడంలో, జాతుల పోరాటాలతో మైత్రిని కొనసాగించడంలో, ఎంఎల్ పార్టీల మధ్య ఐక్యత కోసం ఎలాంటి భేషజాలు లేకుండా కృషి చేయడంలో, పారిస్ కమ్యూన్ మొదలు చైనా సాంస్కృతిక విప్లవం వరకు గతానుభవాల నుంచి నేర్చుకోవడంలో మావోయిస్టు నేతలు చాలా వరకు విజయం సాధించారని తెలిపారు.

మావోయిస్టు ఉద్యమం గురించిన అన్ని కోణాలనూ పుస్తకంలో తడిమిన మిర్దాల్ ఆ పార్టీకి ఒక హెచ్చరికను చేశారు. రాజ్యం ఉక్కుపాదం అత్యంత క్రూరమైనదని, ఎల్లవేళ లా జాగరూకతను కనబర్చకపోతే ఓటమి తప్పదన్నారు. ‘దండకారణ్యంలో ఇవాళ పార్టీకి పునాదిగా దళితులూ ఆదివాసులూ ఉన్నారు. వాళ్లు లేచి నిలిచారు. కానీ వాళ్లు దేశ జనాభాలో కేవలం 25 శాతం మాత్రమే. వాళ్లు లేచి నిలిచే లోపల జారిపోతే, ఇతర ప్రాంతాల్లో ప్రజలను పార్టీ సంఘటితం చేయలేకపోతే అప్పుడు ఈ తిరుగుబాటు 25 శాతం ప్రజల విప్లవంగానే మిగిలి, ఇతర దేశాల్లో తమ సహచరులు ఏ వైఫల్యాలను ఎదుర్కొన్నారో అలానే బలి కావచ్చు. మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుపోవడం ఒక వాస్తవికత కావచ్చ’న్నారు. ఆ రకంగా ‘భారత్‌పై అరుణతా ర’ మావోయిస్టు పార్టీకి ఒక హెచ్చరిక సందేశాన్ని అందించినదని చెప్పవచ్చు. పుస్తకానికి అనుబంధంగా ఇచ్చిన గణపతి, మురళి, సోనులతో మిర్దాల్ జరిపిన సంభాషణలు పాఠకులకు ప్రస్తుత విప్లవోద్యమ వ్యూహం-ఎత్తుగడల విషయంలో స్పష్టతనిస్తాయి. దండకారణ్య ఉద్యమం నేటి స్థాయికి ఎదిగిన క్రమాన్ని తెలుపుతాయి.

మావోయిస్టు ఉద్యమం గురించి ఇన్ని విషయాలు చెప్పిన ఈ పుస్తకంలో ఓ లోపం కనబడుతుంది. ఒక విషయం చెబుతూ అనుకోకుండానే మరో విషయంలోకి వెళ్లడం పాఠకులను కొంత ఇబ్బంది పెడుతుంది. పాత చరిత్ర, ముఖ్యంగా యూరపు పరిణామాలు పునరావృతం కావడం అప్రస్తుతమేమోననిపిస్తుంది. 1927లో పుట్టి, చిన్న వయస్సులోనే మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల రచనలను అవుపోసన పట్టి, ప్రపంచ దేశాలను పలుమార్లు చుట్టి, మావో, చౌఎన్‌లై వంటి మహా నేతలను కలిసి, వామపక్ష ఉద్యమాలతో విడదీయరాని అనుబంధాన్ని, సుదీర్ఘ జీవితానుభవాన్ని సంపాదించిన వ్యక్తిగా అనేక విషయాలు చెప్పాలను కున్నట్లున్నారు. 84 ఏళ్ల వయస్సులో, తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ కూడా రహస్యంగా, ఒక నిషేధిత పార్టీ ఆధ్వర్యంలో గల ప్రాంతానికి వెళ్లి సాహసమే చేసిన మిర్దాల్‌ను విమర్శించడం సమంజసం కాదేమో. భారత్‌పై అరుణతార ఇంగ్లీష్ ప్రచురణకర్తలు పుస్తకం వెనుక అట్ట మీద ఉద్యమ పరిచయం రాస్తూ ‘‘ఎన్నో లోపాలున్నప్పటికీ’’ అని రాస్తే దానిని ‘‘ఎన్నో ఇబ్బందులున్నప్పటికీ’’ అని మార్చుకొమ్మని మిర్దాల్ పట్టుబట్టినారట. అదే ఈ పుస్తకానికీ వర్తిస్తుంది. ఆ ఇబ్బందిని పక్కన పెడితే ‘భారత్‌పై అరుణతార’ మేధావులు, ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, విప్లవాభిమానులు అందరూ తప్పక అధ్యయనం చేయాల్సిన పుస్తకం.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com


37

MARKANDEYA D