తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న్న అమర్దీప్సింగ్ ‘ఇదేంటి నాన్నా.. మన ఇంటిదగ్గర ఈ జెండాపూందుకు ఎగిరేస్తున్నార’ని తండ్రి సత్వంత్సింగ్ను అడిగాడు. దీంతో.. భయంతో వణికిపోయిన ఆయన ‘చిన్నగా మాట్లాడు.. ఇది అమెరికా అని మరిచిపోకు’అని హెచ్చరించి కొడుకు అమర్జీత్సింగ్ను అక్కున చేర్చుకున్నాడు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు అలా హెచ్చరించడానికి సత్వంత్‌సింగ్ లేడు. ఇన్నేళ్లుగా.. సత్వంత్‌సింగ్ దేని గురించి భయపడుతున్నాడో, అందరినీ హెచ్చరిస్తూ వస్తున్నాడో.. దానికే బలయ్యాడు. ఈనెల ఐదున విస్కాన్సన్ రాష్ట్రం ఓక్ క్రీక్‌లోని గురుద్వారా లో దుండగులు జరిపిన కాల్పుల్లో సత్వంత్‌సింగ్ చనిపోయాడు. ఆయనతోపాటు ఆ విచక్షణా రహిత కాల్పుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనను మరిచిపోకముందే...ఆ గురుద్వారా సభ్యుడే యాభైఆరేళ్ల దల్బీర్‌సింగ్‌ను మిల్స్ కీ టౌన్లో దుకాణంలో ఉండగా కాల్పులు జరిపి హత్యచేశారు.
ఇవి యాధృచ్ఛికంగా..జరిగిన ఘటనలుగా అమెరికా ప్రభుత్వం, అక్కడి పోలీసులు చెప్పుకొస్తున్నారు. కానీ..ఇది ఓ పథకం ప్రకారం ఓ వర్గం ప్రజలపై సాగుతు న్న హత్యాకాండ. ఇది ఒక్క సిక్కులపై జరుగుతున్న దాడిమావూతమే కాదు. ఆసియాటిక్ ముదురు రంగు జాతీయులపై అమెరికాలో జరుగుతున్న దాడుల్లో భాగం. కానీ వీటిని అమెరికా దాచిపెడుతున్నది. ఇవి ఏవో కొంతమంది సంఘవ్యతిరేక శక్తులు, రౌడీ మూకలు, దొంగలు చేసిన ఘటనలుగా చిన్నవి చేసి చూపిస్తున్నది. మరో వైపు గత కొన్నేళ్లుగా అమెరికాలో భారతసంతతి వారిపై వరుసగా జరుగుతున్న దాడులు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరిట ఎన్నో కళలు కంటూ.., తమ కలల ప్రపంచం అమెరికాలో అడుగు పెట్టిన వారు హతమైపో తుంటే.. తల్లిదంవూడులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అయితే.. ఈ దాడుల పరంపర, జాత్యహాంకార హత్యాకాండ ఈ నాటిదేం కాదు. దశాబ్దాలుగా సాగుతున్నా.. ఈ మధ్యన ఇం తీవ్రమయ్యాయి. మరీ ముఖ్యం గా.. వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి (9/11) తర్వాత మరింత పెరిగాయి. అమెరికా పాలకులు దాయాలన్నా దాయలేని విధంగా నగ్నంగా జాతి వివక్ష, వర్ణవివక్షను చాటిచెప్పుతున్నాయి. 9/11 తర్వాత భారతీయులపై 700లకు పైగా దాడు లు జరిగాయి. ఈదాడుల్లో భారత సంతతి పౌరులు ఇప్పటికే వందలసంఖ్యలో బలిఅయ్యారు. అందులో సిక్కులు ప్రత్యేకంగా ఎక్కువగా బలవుతున్నారు. దీనికి కొన్ని భౌతిక కారణాలు కూడా ఉన్నాయి. క్రీ.శ. 1800 సంవత్సరంలో ప్రారంభమైన సిక్కుల వలస నేటికీ.. కొనసాగి, అమెరికాలో సిక్కులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. దాదాపు ఐదు లక్షల దాకా ఉన్న సిక్కులు అక్కడి చిన్న వ్యాపార రంగంలో పాదుకొల్పుకుని ఉన్నారు. అయితే.. వీరు చేసుకున్న పాపం ఏంటంటే..ఆసియటిక్ ముదురు రంగులో ఉండటం ఒకటైతే.., రెండోది ముస్లింలకు ఉండే విధంగా గడ్డం ఉండటం. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి తర్వాత అమెరికాలో ముస్లింజాతిపై పెంచుకున్న ద్వేషం ఆసియాటిక్ ప్రజలపై పడింది. దీంతో.. అమెరికా సమాజంలో ని ముస్లింలపై, సిక్కులపై దాడులు పెరిగిపోయాయి.
ముస్లింలకు ఉన్నట్లుగానే గడ్డం కలిగి ఉండటం సిక్కువూపజలకు శాపమై పోయింది.ఈ డిసెంబర్లో సురేందర్ సింగ్ అనే షాప్‌కీపర్‌పై కత్తులతో దుండగులు దాడి చేశారు. ‘ఈరోజు బిన్లాదెన్ను చంపేస్తాం’అంటూ ఇరవై సార్లు కత్తులతో పొడిచి చంపారు. మరో ఘటనలో మరో సిక్కు యువకునిపై దాడి చేస్తూ..‘అల్‌ఖైదాను తుద ముట్టిస్తాం మీరిక్కడ ఉండటానికి వీల్లే దు’ అంటూ.. చావబాదారు. వీరంతా అమెరికాలోని జాతిదురహాంకార శక్తుల ప్రతినిధులు.తమను తాము అమెరికా రక్షకులుగా ప్రకటించుకుని ఇతర జాతీయులపై ప్రతీకార దాడులకు దిగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మధ్యన భారతీయ సంతతి స్కూలు విద్యార్థులు కూడా జాతి వివక్షను ఎదుర్కొంటున్నారు. భారతసంతతి పిల్లలను ఒక రకమైన హేళన చూపులతోఅమెరికా పిల్లలు గేలి చేసిన ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే.., అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రోజూ ఏదో మూల తుపాకులు గర్జిస్తున్నాయి. దీనికి అమెరికాలో నెలకొని ఉన్న సంస్కృతే ప్రధాన కారణంగా చెప్పక తప్పదు.
ఏ సమాజానికైనా ఓ ఉత్పత్తి సంస్కృతి ఉంటుంది. ఆ ఉత్పత్తి సహజంగా మని షి జీవించడానికి అత్యవసరమైన ఆహార ఉత్పత్తిగా ఉంటుంది. లేదా నిజజీవితంలో ఉపయోగపడేదై వినియోగ వస్తువై ఉంటుంది. ఆ ఉత్పత్తి సంస్కృతిపై ఆధారపడి అక్కడి సమాజంలో మానవ విలువలు, సామాజిక నీతి ఉనికిలో ఉంటాయి. నాగరిక సమాజంగా అభివృద్ధి చెందే క్రమంలో వస్తూత్పత్తి ఎంత పెరిగినా మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేసే ఉత్పత్తి విధానం వినాశకరం. భూమండలంలో ఎక్కడాలేని విధంగా...మారణాయుధాల ఉత్పత్తే ప్రధానంగా ఉన్న సమాజం ఏదైనా ఉదంటే అది అమెరికానే. అందుకే అమెరికాలో మరెక్కడాలేని ఆయుధ ఉత్పత్తి, తుపాకుల సంస్కృతి రాజ్యమేలుతున్నది. దీనికి ప్రతిఫలంగా వచ్చిన సినిమాలే.. స్టార్ వార్, రాంబో లాంటి సినిమాలు. అత్యాధునిక, శక్తివంతమైన ఆయుధాలతో ప్రపంచాన్ని జయించవచ్చని ఆ సినిమాలు బోధిస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో పాఠశాల పిల్లవాడు మొదలుకొని అందరూ తుపాకులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్నారు.
ప్రమాదకరమైన పదార్థమేదీ బహిరంగ మార్కెట్లో అమ్మరాదన్నది, దాన్ని పట్టుకొని ఏ పౌరుడూ బహిరంగంగా తిరగరాదన్నది నాగరిక సమాజ కనీస నియమం. ఇదొక విలువగా కూడా అస్తిత్వంలో ఉన్నది. కానీ అమెరికాలోని 12 రాష్ట్రాల్లో ఎలాంటి లైసెన్స్ లేకుండానే తుపాకులు కలిగి ఉండవచ్చు. 17 రాష్ట్రాల్లోనైతే.. బహిరంగ ప్రదేశాల్లో కూడా తుపాకులు పట్టుకొని తిరగొచ్చు. ఇంకో 13రాష్ట్రాల్లో నామమావూతపు లైసెన్సు తో తుపాకులు ఎన్నయినా కలిగి ఉండవచ్చు. అభివృద్ధి చెందిన ఏదేశంలో లేని విధంగా అమెరికాలో ఈ ‘గన్‌కల్చర్’ రాజ్యమేలుతున్నది. అమెరికాలో సగటున నిమిషానికి డజన్ తుపాకులు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. అమెరికాలో 60 శాతం హత్యలు తుపాకీ కాల్పులతోనే జరుగుతున్నాయి. ప్రతిరోజు ఈ కాల్పులకు 87 మంది బలవుతున్నారు. 183 మంది గాయాల పాలవుతున్నారు. అదే అమెరికాలో ఒక్క సంవత్సరంలోనే 8,775 హత్యలు జరిగాయి. ఇవన్నీ గన్నులతో కాల్చి చంపినవే. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అమెరికాలో తుపాకీ హత్యలు 20 రెట్లు. ఈ గన్ కల్చర్ భారత సంతతి ప్రాణం మీదికి వచ్చింది. అక్కడ భారత సంతతి పౌరులపై దాడులు పెరిగిపోతున్నాయి.
1960 దశకం నుంచి తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమెరికా మేధోవలసను పెంచి పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులనందరినీ ఆకర్షణీయమైన జీతభత్యాలతో ఆహ్వానించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఎదిగివస్తున్న మేధస్సును,నైపుణ్యాన్ని ‘చీప్ లేబర్’ దృక్పథంతో వలసను పెంచి పోషించింది. నాటినుంచి ప్రారంభమై న వలస నేడు చినుకు చినుకు జడివానగా మారిం ది. ఆసియా దేశాలు, ముఖ్యంగా భారత్ నుంచి వలసలు తీవ్రమయ్యాయి. ప్రతిఏటా వేల సంఖ్య లో అమెరికా విమానమెక్కుతున్నారు. దశాబ్దకాలం లో మొత్తం అమెరికా జనాభాలో 13 శాతం విదేశీయులే అయ్యారు. దీంతో.. అమెరికాలోని నిరుద్యోగానికి, పేదరికానికి ఈ విదేశీయులే కారణమన్న వాదమొకటి పురుడు పోసుకుంది. అమెరికా పాలకుల విధానాలు, దేశాధ్యక్షులే పరోక్షంగా వ్యక్తంచేసిన అభివూపాయాలూ అమెరికన్ యువతలో అసూయా ద్వేషాలకు కారణమయ్యాయి. దీనికితోడు 9/11 దాడి ఉత్ప్రేరకంగా పనిచేసింది. దీంతో ద్వేషాలు తీవ్రమయ్యాయి. ఆసియాటిక్ వాసులం హంతకులు, టెర్రరిస్టులన్న అనుమానంతో అమెరికన్లు చూసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోంచే.. అమెరికాలో తుపాకుల కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. 9/11 అల్‌ఖైదా దాడి తర్వాత 21 శాతం ఆయుధాల అమ్మకాలు పెరిగాయి. భారతీయులపై దాడులూ పెరిగాయి. ఇదంతా జాత్యహాంకారంతో, ఆసియాటిక్ ప్రజలపై ద్వేషంతో జరుగుతున్నాయి. జాతి వివక్షతో జరుగుతున్నాయి.
వందేళ్ల చరివూతలో అమెరికా తన తుపాకీ బలంతో ప్రపంచంపై ఎలా పెత్తనం చెలాయిస్తుందో, అదే సంస్కృతి ఆ దేశ ప్రజలకు అబ్బింది. 1890లో దక్షిణ డకోటా వూండెడ్నీలో 100 మంది ఇండియన్లను ఊచకోత కోసిన నాటి నుంచి మొదలు నేటిదాకా.. కోట్లాదిమందిని పొట్టనపెట్టుకున్నది. నిన్నమొన్నటి ఇరాక్‌లోనే 14 లక్షల మందిని చంపి ఆ దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను హత్యచేసింది. ఒక్క ఇరాక్ యుద్ధానికే 40లక్షల కోట్లను ఖర్చు చేసింది. లిబియాపై దాడిచేసి దాదాపు పదిలక్ష ల మందిని పొట్టన పెట్టుకున్నది. గఢాఫిని క్రూరంగా చంపింది. గత 110 సంవత్సరాల్లో 142 సందర్భాల్లో అమెరికా తన తుపాకీ బలంతో.. దేశ దేశాలపై దురాక్షికమణలు చేసి రక్తపు పారించింది. ఆయా దేశాల్లోని సహజవనరులను కొల్లగొట్టింది. అమెరికా ఇప్పటికీ 14 దేశాలను స్మశాన దిబ్బగా మార్చింది. హవాయి, క్యూబా, పుయెర్తొరికా, ఫిలిప్పైన్స్, నికారాగువా, హోండురాస్, ఇరాన్, గౌటెమా లా, వియత్నాం, చిలీ, గ్రెనెడా, పనామా, అఫ్ఘనిస్థాన్, ఇరాక్, లిబియా దేశాలను వల్లకాడు చేసింది.
1909లో నికరాగువా అధ్యక్షుడు జార్జ్ సాంటోస్ జెలాయాను అధికారంనుంచి కూలదోయాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు విలియం హోవార్డ్ టాఫ్ట్ హుకుం జారీ చేశాడు. ‘అమెరికా భద్రత కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం’ ఈదాడి అని ప్రకటించాడు. నాటి నుంచి నేటి దాకా.. అఫ్ఘనిస్థాన్, ఇరాక్‌పై దాడిచేసేటప్పుడు బుష్ చెప్పిందీ అదే. మొన్న లిబియాపై దాడి చేసేటప్పుడు ఒబామా చెప్పిందీ అదే. మాటల్లో ఏం చెప్పినా.. అమెరికా తన దగ్గరున్న ఆయుధ సంపత్తి బలంతో దేశాలను బెదిరించి లొంగదీసుకుంటున్నది. లొంగని దేశాధ్యక్షులపై ఆకుకు అందని పోక కు పొందని కారణాలు చెప్పి అక్రమంగా యుద్ధం ప్రకటించి ఆక్రమించింది. ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తున్నది. ఈ తుపాకీ సంస్కృతే.. ఆ దేశ పౌరులకూ అబ్బింది. సాధారణ పౌరుల జేబులో పెన్ను ఉన్నంత సహజంగా జేబుల్లో గన్ పెట్టుకొని తిరుగుతూ.. హత్యాకాండ చేస్తున్నారు. ఈ తుపాకుల స్వైర విహారాన్ని ఆపే చట్టాలు కానీ, చిత్తశుద్ధి కానీ అమెరికా ప్రభుత్వానికి లేదు. ఈ మధ్యన పెరిగిపోతున్న తుపాకీ కాల్పుల ఘటనల నేపథ్యంలో తుపాకులను నిషేధించాలని ఓ సర్వే చేశారు.
అందులో.. మెజారీటీ అమెరికన్లు.. ‘వాక్ స్వాతంత్య్రం ఎలా మౌలికమైనదో, మాకు తుపాకీ కలిగి ఉండే హక్కుకూడా అలాంటిదే’ అని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా.. అమెరికా తన తప్పును తాను గుర్తిస్తేనే ఆ సమాజానికి మనుగడ ఉంటుంది. జాతి, వర్ణ వివక్షతో జరుగుతున్న దాడులను దొమ్మీలుగా, యాధృచ్చిక ఘటనలుగా చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇవ్వాళ ఆసియా దేశాల ప్రజలు తుపాకులకు ఎరకావచ్చు. ఎల్లకాలం ఇలాగే ఉండదు. నిరుద్యోగం, పేదరికంలో మగ్గిపోతూ.. బ్రెడ్డుముక్క కోసం అలమటించే అమెరికా ప్రజల చేతుల్లోకి ఆ తుపాకీ వెళుతుంది. అప్పుడు అంకుల్ శ్యాంను ఏశక్తీ రక్షించలేదు. తుపాకులు మనుషులను చంపవు. మనుషులు మాత్రమే సాటి మనుషులను చంపుతారు. తుపాకీ బయెనెట్కు జొన్న కంకులు కాయవు. పాల పిట్ట వాలదు. తుపాకుల నీడలో శాంతి నెలకొనదు. మక్కజొన్నలతోనే మనిషి బతుకుతాడు. మరతుపాకులతో కాదు. ఇది గుర్తించిననాడే.. అమెరికా మానవీయసమాజంగా మనగలుగుతుంది.
-ఎస్.మల్లాడ్డి