తెలంగాణలో ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి సాగులోకి వచ్చిందో మనకు తెలుసు. ఈ డబ్బులు ఎక్కడకు పోయాయో తెలుసు. మన రాష్ట్రం మనం సాధించుకునే లోపే మన కళ్ల ముందే ఒక పెద్ద దగా జరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎస్కలేషన్ కాదు, త్వరితగతిన పూర్తి చేసి ఇన్సెంటివ్ తీసుకొమ్మని చెబుతున్నది. కాలవ్యవధి పెట్టి పనులు పూర్తి చేయాలని ఆరాటపడతున్నది. ఈ యజ్ఞం విజయవంతం కావాలంటే కొంతకాలం రాజకీయాలకు సెలవు పెడదాం. ఒకే మాట, ఒకే బాటగా నడవాలి. రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఏ ప్రయోజనాలైనా అని అన్ని రాజకీయపక్షాలు గుర్తించాలి.

గోదావరి తెలంగాణలో చాలా లోతున ప్రవహిస్తుంది. ఎంత ఎత్తు ఆనకట్ట వేసినా నీళ్లు మళ్లించడం కష్టం. అటువంటప్పుడు ఎత్తిపోతలు పెట్టాలి. ఎత్తిపోతలు నడపడానికి కరెంటు ఎక్కడుంది. పొలాలకు ఇవ్వడానికే నానా ఇబ్బం దిపడుతున్నాం. ప్రాజెక్టులు కట్టలేదని ఊరికే బద్నాం చేస్తే ఎలా? అని సమైక్య పాలనలో ఒక నాయకుడు వేసిన ప్రశ్న. కృష్ణా నది గురించి కూడా మహబూబ్‌నగర్‌కే చెందిన అప్పటి టీడీపీ మంత్రి ఒకరు అచ్చం ఇలాగే వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ చాలా ఎత్తున ఉన్నది. కృష్ణ నీళ్లెలా వస్తాయి? అని అమాయకంగా ఆయన ప్రశ్నించారు. ఇదంతా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే. సమైక్య నాయకత్వం అలాగే ప్రచారం చేసింది. తెలంగాణ నాయకత్వం అదే నమ్మి వారికంటే విధేయతతో ప్రచారం చేసింది. ఒక్క నీళ్లేమిటి కరెంటు గురించి కూడా ఇలాగే ప్రచారం చేశారు. తెలంగాణ లో బిల్లులు కట్టరు.
ఆదాయం వసూలు కాదు. అన్నీ కావాలంటారు. ఎలా సాధ్యం? అని ఒక సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమ సమయం లో అక్కసుతో స్వయంగా అన్నమాట ఇప్పటికీ గుర్తే. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అంధకారం అవుతుందన్నాడు. నక్సల్స్ చెలరేగుతారన్నారు. పరిస్థితులు అదుపుతప్పుతాయన్నారు. ఆశ్చర్యం ఏమంటే ఈ పిల్లుల శాపనార్థాలన్నింటినీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఏడాది తిరగకుండా తప్పని రుజువు చేశారు. సంకల్పం ఉంటే అంధకారాన్ని బద్దలు కొట్టవచ్చునని రుజువు చేశారు. గోదావరి మళ్లించవచ్చునని, కృష్ణను తరలించవచ్చునని తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగించారు. మూడు నాలుగు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలను వేపుకుతిన్న కరెం టు సమస్య తెలంగాణ వచ్చిన ఆరుమాసాలకే ఎలా పరిష్కారమయిందో ఇప్పటికీ ఒక అద్భుతమే. ఒక్క యూనిట్ కొత్తగా ఉత్పత్తి చేయకుండానే కోతలకు ఫుల్స్టాప్ పెట్టడం ఒక రికార్డు, ఒక చరిత్ర. మనవాళ్లకు మందికి ఉండే తేడా అది. సమస్యను అర్థం చేసుకున్నవారికి, సమస్యగానే గుర్తించని వారికి మధ్య ఉండే అంతరం అది.
ఇప్పుడు గోదావరి జలాల తరలింపు విషయంలో కూడా అదే జరుగుతున్నది. గోదావరి నది నుంచి గరిష్ఠంగా నీటిని మళ్లించి కోటి ఎకరాలను సాగులోకి తేవడానికి భగీరథ ప్రయత్నం మొదలయింది. ముఖ్యమంత్రి ఏడాదిన్నర కాలంగా ఒక నీటిపారుదల ఇంజనీరు కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. నీరు ఎక్కడుందో, ప్రాజెక్టులు ఎక్కడ నిర్మించాలో, పల్లమెక్కడుందో ఎక్కడ ఎత్తిపోతలో, ఎక్కడ పారు కాలువలో ఆయన ఇలా చిటికెలో చెప్పగలరు. తెలంగాణలో నదీ జలాలపై ఇంత సాధికారికంగా మాట్లాడగలిగిన మరో నాయకుడెవరయినా ఉంటే ఒట్టు. ఇంతకాలం తెలంగాణ నష్టపోయింది అలానే? ఇప్పుడు వరుస బరాజ్‌లకు మార్గం సుగమం అవుతున్నది. అదీ మహారాష్ట్రతో అవగాహనకు వచ్చి జరుగుతున్నది. వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే మహారాష్ట్రతో ఐదు దఫాలు చర్చలు జరిపారు. ఒకసారి కేసీఆర్ వెళ్లొచ్చారు. రెండుసార్లు హరీశ్‌రావు వెళ్లొచ్చారు.
అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. లక్ష్యశుద్ధి, సంకల్పసిద్ధి ఉన్నవాళ్లు మాత్రమే ఇలా చేయడం సాధ్యం. మహారాష్ట్రతో ఒప్పందం కుదిరితే కాళేశ్వరం, తుమ్మిడిహట్టి బరాజ్‌లకు మార్గం సుగమం అవుతుంది. ఎల్లంపల్లికి దిగువన వచ్చే పెద్ద ప్రాజెక్టు ఇది. నీళ్లు పుష్కలంగా లభించే ప్రాజెక్టు ఇది. ఇదొక చారిత్రక సన్నివేశం. నీటి నిల్వ మళ్లింపు కోసం సుందిళ్ల, అన్నారం బరాజ్‌లను కూడా ప్రభుత్వం చేపడుతున్నది. ఇవన్నీ పూర్తయితే ఉత్తర తెలంగాణ సుసంపన్నం అవుతుంది. గోదావరి నదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కలిపి 1480 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పటికి రెండు రాష్ర్టాలు కలిపి వాడుకుంటున్నది 500 టీఎంసీలకు మించదు. మిగిలిన వెయ్యి టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఇంతటి కరువు సంవత్సరం ఈ ఏడాది కూడా 1631 టీఎంసీల నీరు అగాధంలో కలిసింది.
ఇప్పుడా వెయ్యి టీఎంసీల నీటిని మళ్లించుకోవడం ఎలా అన్నదే తెలంగాణ ముందున్న సమస్య. ఇవే కాదు కాళేశ్వరం దిగువన తుపాకులగూడెం, కంతానపల్లి, దుమ్ముగూడెం బరాజ్‌లు నిర్మించుకుని నీటిని ఎత్తిపోసుకునే ఏర్పాటు చేసుకోవాలి. విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరుగుతున్న దృష్ట్యా ఎత్తిపోతల పథకాలకు కరెంటు సమస్య ఉండదు. నీటికంటే విలువైనదేదీ లేదు. ఒట్టిపోయిన తెలంగాణ నేలల్లో తిరిగి జలధారలు ప్రవహింపజేయడానికి ఈ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవలసి ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో చెరువులు, రిజర్వాయర్లు నింపడంతోపాటు పొలాలకు నీరు మళ్లిస్తే వాగులు వంకలు అన్నీ తిరిగి రీజెనరేట్ అవు తాయి. భూగర్భ జలాలు పొంగుతాయి.
టీడీపీ, కాంగ్రెస్‌లు ఇన్ని దశాబ్దాల్లో తెలంగాణకోసం ఒక్క సరైన ప్రాజెక్టును నిర్మించలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కచ్చితంగా నీరొచ్చే వనరులు లేవు. శ్రీరాంసాగర్ పొంగితేనే ఎల్లంపల్లి నిండుతుంది, లేదంటే కడెం, ఇతర చిన్నచిన్న నదులు, వాగు లు పొంగితే కొంతమేరకు నీరు వస్తుంది. అసలు నీరు పుష్కలంగా లభించే దిగువ గోదావరిని ఉద్దేశపూర్వకంగా వదిలేసి, నదీ జలాలపై పదేపదే పొరుగు రాష్ర్టాలతో గిల్లికజ్జాలు పెట్టేవారు. బాబ్లీ ప్రాజెక్టుపై టీడీపీ వేసిన నాటకం మామూలుది కాదు. తెలంగాణ ఉద్యమాన్ని మాయ చేయడానికి చంద్ర బాబునాయుడు ఆడించిన మాయనాటకం అది. తెలంగాణ ప్రజలకేమో ఏదో ప్రాజెక్టులకోసం కొట్లాడు తున్న బిల్డప్.
అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వానికి తిక్క పుట్టి ఇంకెప్పుడూ ఏ విషయంలో తెలంగాణకు సహకరించకుండా చేసే కుయుక్తి. ఈ నాటకం ఈ నాలుగు దశాబ్దాలుగా నడుస్తూనే వచ్చింది. తుమ్మిడి హట్టి నుంచి ప్రాణహిత నీటిని తరలించే యోచన కూడా అటువంటిదే. మహారాష్ట్రతో చర్చలు లేవు, సమావేశాలు లేవు బరా జ్ ఎత్తుకు సంబంధించి ఒప్పందం లేదు. చేవెళ్ల దాకా కాలువలు తవ్వేశారు. నిజానికి ప్రాజెక్టులు కడితే ఏది ముందు చేయాలి? ఏది వెనుక చేయాలి? నీటిని నిలిపి ఉంచుకునే ప్రాజె క్టు ముందు కడతారా? కాలువలు ముందు తవ్వుతారా? టీడీపీ, కాంగ్రెస్‌లు ఇన్నేళ్లలో చేసిన నిర్వాకమంతా కాలువలు తవ్వడంతోనే సరిపోయిం ది. బరాజ్‌లు, ప్రాజెక్టులు నిర్మించకుండానే వేల కోట్ల రూపాయలు మట్టిలో పోశా రు.
ప్రాజెక్టుల నిర్మాణం ప్రజలకు నీరివ్వడం కోసం కాకుండా కాంట్రాక్టర్లు, నాయకుల బొజ్జలు నింపడం కోసం అన్నట్టుగా సాగిం ది. కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్ అవకాశం ఇచ్చి వీలైనం త ఎక్కువకాలం ప్రాజెక్టులను సాగదీసేందుకు పాదులు వేశారు. ఫలితంగా ఒక్కో ప్రాజెక్టు ఏళ్ల తరబడి పూర్తి కాకుండా నీల్గవలసి వచ్చింది. తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాతనే దీనిని రివర్సు చేసింది. ముందుగా నదీజలాలను ఒడిసి పట్టుకునే ప్రాజెక్టులపై దృష్టిని కేంద్రీకరించింది. అందుకే ముందుగా బరాజ్‌ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఎత్తిపోతల పనులకు ప్రాధాన్యం ఇచ్చి వెంటపడుతున్నది.
టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణకు చేసిన పాపాలు సాధారణమైనవి కాదు. తెలంగాణలో వేల కిలోమీటర్ల పొడవున పంట భూములను సేకరించి, కాలువలు తవ్వా రు. వేలాదిమంది రైతులను నిర్వాసితులను చేసి, పరిహారం చెల్లించి ఈ భూముల సేకరణ జరిగిం ది. శ్రీరాంసాగర్ రెండో దశ, శ్రీరాంసాగర్ వరద కాలువ, ఏఎమ్మార్ కాలువ, మహబూబ్‌నగర్‌లో ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద కాలువలు, వాటి కింద డిస్ట్రిబ్యూటరీలు దశాబ్దకాలంగా పడువబడి ఉన్నాయి. వాటిమీద ఖర్చు చేసిన సుమారు ఇరవైవేల కోట్ల రూపాయలపై కోటి రూపాయల ఆదాయం కూడా జనరేట్ చేయలేకపోయారు. ఇటు రైతుల భూములు పోయాయి. అటు ప్రభుత్వం సొమ్ము ఖర్చయిపోయింది. చుక్క నీరు రాలేదు. ఈ నేరం ఎవరిదో చెప్పనక్కర లేదు.
ఇప్పటికయినా కాలువలకు నీరు మళ్లించకపోతే, అక్కడ పొలాలను పారించకపోతే తెలంగాణ ఎప్పటికీ కోలుకునే అవకాశం లేదు. అధికారిక వివరాల ప్రకారం 1994 నుంచి 2014 వరకు నీటిపారుదల ప్రాజెక్టులపై ఖర్చు చేసిన మొత్తం 1,05,451 కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడుల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా సాగులోకి వచ్చినట్టుగా రికార్డుల్లో చూపించింది 34 లక్షల ఎకరాలు. ఈ లెక్కలు వాస్తవికమైనవని నమ్మడానికి లేదు. తెలంగాణలో మనకు తెలిసి కొత్తగా సాగులోకి వచ్చినది మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు మించి లేదు. మరీ దారుణం ఏమంటే 2004 నుంచి 2014 వరకు 95,539 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, కొత్తగా వచ్చిన ఆయకట్టు 23.49 లక్షలని తేల్చారు.
అంటే ఒక్కో ఎకరం భూమి కి నీరివ్వడానికి ఖర్చు చేసిన మొత్తం 4,06,772 రూపాయలు. ఇంత డబ్బు ఖర్చు చేస్తే ఎంత నీరు వచ్చి ఉండాలి? ఎన్ని లక్షల ఎకరాలకు నీరు వచ్చి ఉండాలి? ఎంత సంపద ఉత్పత్తి అయి ఉండాలి? ఇవేవీ జరుగలేదు. ఇదంతా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నకాలమే. తెలంగాణలో ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి సాగులోకి వచ్చిం దో మనకు తెలుసు. ఈ డబ్బులు ఎక్కడకు పోయాయో తెలుసు. మన రాష్ట్రం మనం సాధించుకునే లోపే మన కళ్ల ముందే ఒక పెద్ద దగా జరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎస్కలేషన్ కాదు, త్వరితగతిన పూర్తి చేసి ఇన్సెంటివ్ తీసుకొమ్మని చెబుతున్నది. కాలవ్యవధి పెట్టి పనులు పూర్తి చేయాలని ఆరాటపడతున్నది. ఈ యజ్ఞం విజయవంతం కావాలంటే కొంతకాలం రాజకీయాలకు సెలవు పెడ దాం. ఒకే మాట, ఒకే బాటగా నడవాలి. రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఏ ప్రయోజ నాలైనా అని అన్ని రాజకీయ పక్షాలు గుర్తించాలి.
-kattashekar@gmail.com