మనిషా? మతమా?


Sun,October 18, 2015 12:03 AM

మతస్వేచ్ఛ ఉండాలని కోరుకున్నట్టే మతాచరణ లేకుండా జీవించే స్వేచ్ఛ కూడా ఎప్పటిలాగే వర్ధిల్లాలి.
మతం కంటే మానవత్వాన్ని మన పతాకంగా మార్చుకోవాలి. గొప్ప సంస్కృతి, వారసత్వం, విలువలు కలిగిన సమాజంగా మన దేశానికి ఇప్పటికే పేరుంది. కొత్తగా మతం రంగు పులిమితే వచ్చేదేమీ లేదు. మతాన్ని, దైవ భావననుకాపాడుకోవడంలో తప్పులేదు. దానికోసం తపించడంలో ఆక్షేపించాల్సిందేమీ లేదు. మనిషిని కాపాడుకోవడం అంతకంటే విలువైన అంశంగా గుర్తించండి.

kattashekar


దేశంలో మతవాదులు కొంతకాలంగా చేస్తున్న హత్యలు, దాడులు, వ్యాఖ్యలు, వ్యవస్థల హననం చూస్తుంటే మనం ముందుకు వెళుతున్నామా వెనుకకు వెళుతున్నామా అన్న అనుమానం కలుగుతున్నది. మళ్లీ మధ్య యుగాలనాటి అంధ విశ్వాసాల ఊబిలోకి జారిపోతున్నామా అనిపిస్తుంది. మతా లు, విశ్వాసాలు శాశ్వతం కాదు. అవి మారుతూ ఉంటాయి. ఆధునీకరణ చెందుతుంటాయి. మానవాళి మనుగడ శాశ్వతం. ఒక మతం, దానిని నమ్మే మనుషులు విశ్వాసాలను వ్యాప్తి చేయగలరు. ఆ విశ్వాసాలకు రూపాలను ఆపాదించి మహామందిరాలను నిర్మించగలరు. దేవుడి రూపాన్ని ప్రతిష్టించగలరు. కానీ మతాన్ని నమ్మేవారు ఎంతటి మహిమాన్వితులయినా ఒక మనిషికి ప్రాణం పోయలేరు. అందుకే ఒక మనిషిని చంపే హక్కూలేదు. సృష్టిలో అత్యంత ఉత్కృష్టమైన జీవి మనిషి.

మిగిలిన ప్రాణికోటి నుంచి మనిషిని వేరుచేయగలిగింది వివేచనాశక్తి. మిగిలిన ఏ ప్రాణికీ, ఏ మతం ఎంత గొప్పతనం ఆపాదించినా అది మనిషి కంటే గొప్పది కాదు. మిగిలిన ప్రాణులకు గొప్పతనం ఆపాదించిందీ మనిషేనన్న సంగతి మరువకూడదు. మతం, విశ్వాసం అన్నవి సాపేక్షాలు. సార్వజనిక సత్యాలు కాదు. మత భావన, దైవ భావన మనిషి మెదడులో పుట్టినవి. మనిషి మెదడులో పుట్టినవి కాబట్టే ఇన్ని మతాలు, ఇన్ని భావనలు. ఇన్ని వైరుధ్యాలు. ఖండానికో మతం, దేశానికో దేవుడు, ప్రాంతానికో విశ్వాసం అలా వ్యాప్తిలోకి వచ్చినవే. మనిషికి ఉన్న వివేచనా శక్తి కారణంగానే నేనెవరు? విశ్వంలో నా పాత్ర ఏమిటి? ఈ ప్రళయాలేమిటి? విధ్వంసాలేమిటి? ఈ విశ్వం ఇంత క్రమబద్ధంగా ఎలా నడుస్తున్నది? అని ప్రశ్నించుకుని, సమాధానాలు చెప్పుకునే క్రమంలో ఇన్ని మతాలు, ఇన్ని దైవ భావనలు ఉద్భవించాయి. మనిషి రకరకాల అనుభవాలు, అనుభూతులకు లోనయ్యి వాటికి శక్తులను ఆపాదించాడు.

తన ప్రశ్నలకు ఎక్కడ సమాధానపడితే అక్కడ అది దైవ మహిమగా భావించి, దేవుడిని ప్రతిష్టించుకుని, రూపాన్ని ఆపాదించుకుని, శక్తులను ఊహించుకుని పూజించడం వేడుకోవడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు ఒక్కడే కాలేదు. కొందరు తమ దేవుడికి రూపమే ఆపాదించుకోలేదు. కానీ అన్ని మతాలు చెప్పుకున్నది ఒక్కటే. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వాంతర్యామి. సర్వజ్ఞాని. శాశ్వతుడు. కానీ ప్రపంచమంతా ఒక్క మతం లేదు. ఒకే దేవుడు లేడు. ఒకే విశ్వాసం లేదు. బ్రటిష్ సామ్రాజ్ఞి పూజించే దేవుడు వేరు. నరేంద్ర మోదీ ఆరాధించే దైవం వేరు. ఆగ్నేయాసియా దేశాల ప్రజల దైవ భావన వేరు. అరేబియా దేశాలలో దైవ భావన వీటన్నింటికీ భిన్నమైనది. యూదులు, పారశీకులు.. వారి వారి దైవ భావన వేరు వేరు. ఆదిలాబాద్ గోండు కొండల్లో ఉన్న ప్రజలకు అక్కడ వేరే దైవం కొలువై ఉన్నాడు. దక్షిణాఫ్రికా అడవుల్లో ఉన్నవారికి మరో దేవుడు ఆసరాగా ఉన్నా డు. వాళ్ల దైవ రూపాలు వేరు.

వారి దైవ భావనలు వేరు. ఏది గొప్ప, ఏది అథమం అన్న ప్రశ్నే అర్థరహితమైనది. ఎవరి మతం వారికి గొప్ప. ఎవరి దైవం వారికి గొప్ప. ఎవరి సంస్కృతి వారికి గొప్ప.భారతీయ తత్వశాస్ర్తాన్ని బోధించే ఒక ఆచార్యుడు ఒకసారి పాఠం చెబుతూ తన్మయత్వంలో శ్రీకృష్ణుడి భగవద్గీత చదువుతుంటే నేను ప్రపంచాన్ని మరిచిపోతాను. అంతటి తాదాత్మ్యత నాకు ఇంకే తత్వంలోనూ లభించలేదు అని నోరు జారారు. తత్వశాస్త్ర బోధనలో తత్వవివేచనే తప్ప, మతాపేక్ష ధ్వనించకూడదు. కానీ ఆయన ఆత్మకు దగ్గరగా ఉన్న మతం, ఆయనను ఆవరించి ఉన్న మతం, ఆయన పుట్టి పెరిగిన మతం ఆయనను ఆవహించి ఆయనతో ఆ మాటలు చెప్పించింది. ఒక విద్యార్థి ప్రశ్నించాడు-సార్. నేను కూడా శ్రీకృష్ణుడిని అమితంగా ఇష్టపడతాను. స్ఫూర్తిని పొందుతాను. నేను శ్రీకృష్ణుడిని ఇష్టపడినట్టే నా మిత్రుడు నజీర్ అల్లాహ్‌కోసం ప్రార్థన చేస్తాడు.

అల్లాహ్ కోసం తపిస్తాడు. నేను శ్రీకృష్ణుడిని ఇష్టపడితే నా మిత్రుడు రాజేంద్ర శివుడిని ఇష్టపడతాడు. నేను శ్రీకృష్ణుడిని ఇష్టపడినట్టే, రష్యాలో నాలాంటివారు ఏసుప్రభువును కొలుస్తారు. బ్రిటిష్ మహారాజ్ఞి ఏసు ప్రభువును వేడుకుంటారు. చైనాలో మన దేవుడు లేడు. నాలాంటివారే ఆగ్నేయాసియాలో బుద్ధుడి ముందు మోకరిల్లుతారు. వారు తమతమ దేవుళ్లను ఎందుకు అంతగా ఇష్టపడతారంటే వారు ఏ సంస్కృతి, ఏ విశ్వాసాలు, ఏ సంప్రదాయాల్లో పుట్టి, పెరిగి, జీవిస్తారో వాటిపై అమితమైన మమకారం పెంచుకుంటారు. అది చాలా సహజంగా జరిగే పరిణామం. మన విశ్వాసాలు గొప్పవయినందునకాదు. మన విశ్వాసాలు మన జీవన విధానంలో ఇంకిపోయాయి కాబట్టి, మన నరనరాల్లో శ్రీకృష్ణుని బోధలు, లీలలు, కథలు అమరిపోయాయి కాబట్టి మనకు కృష్ణుడి పేరు వినగానే అటువంటి తాదాత్మ్య భావన కలుగుతుంది. ఇంకో దైవభావనలో అటువంటి తాదాత్మ్యత లభించాలంటే ఆ భావనను ప్రేమించాలి. ఆ భావనలో జీవించాలి. ఆ భావనను మన మస్తిష్కాలకు పట్టించాలి. అంతదాకా మరో దైవ భావనపై మనకు మమకారం కలిగే అవకాశమే లేదు.

తత్వశాస్త్రంలో అపేక్షలుండకూడదు కదా సార్? ఆ ఆచార్యుడు వెంటనే వాస్తవంలోకి వచ్చారు. తత్వం వేరు. మతం వేరు. మతం కేవలం విశ్వాసాన్ని కోరుతుంది. తత్వం వివేచన చేస్తుంది. ప్రశ్నలు వేస్తుంది. తర్కిస్తుంది. సమాధానాలు రాబడుతుంది. నేనే బ్రహ్మ అంటారొకరు. నేనే దేవుడు అంటారొకరు. కానీ నేనున్నాను కాబట్టే, నేను ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ ప్రపంచం ఉంది అనుకుంటాడు మరొక తాత్వికుడు. జగం మిథ్య, ఇహం మిథ్య అన్నారొక ఆచార్యుడు. మనిషి సత్యం, ఇహం సత్యం, పరం మిథ్య అంటారు హేతువాదులు. ఇన్ని భావాలు ప్రశ్నలు వేసుకోవడం నుంచి, సమాధానాలు వెదకడం నుంచి వచ్చినవే. అన్ని ఆలోచనాధారలూ వర్ధిల్లాలి.
ఒకే దైవ భావన విశ్వమంతటా లేనట్టే, ఏ దైవాన్నీ విశ్వసించకుండా జీవించేవాళ్లు ఇలాతలంపై అనాదిగా ఉన్నారు. నాటి చార్వాకుల నుంచి నేటి కాల్బుర్గీ, పన్సారేల వరకు అదొక అవిచ్ఛిన్న చైతన్య స్రవంతి కొనసాగుతూనే ఉంది. వాళ్లు మనిషిని ప్రేమించారు.

మనుషుల కోసం బతికారు. మనిషి కోసం బతకడమే మతం అనుకున్నారు. కనిపించని శక్తులను ఆరాధించడం కంటే కనిపించే మనుషుల కోసం జీవించడం పరమార్థమని వారు భావించారు. మానవ సేవే మాధవ సేవ అని హిం దూ ధర్మం చెబుతుంది. మాధవ సేవలో నమ్మకం లేకపోయినా, మానవ సేవే అత్యుత్తమ ధర్మమని కాల్బుర్గీ, పన్సారేవంటివారు భావించారు. వారిని చంపడమంటే మానవత్వాన్ని చంపడమే. దాద్రీ ఘటన మనిషి హీనత్వానికి పరాకాష్ఠ. ఒక గోవుకోసం గోవు చుట్టూ అల్లుకున్న భావాల కోసం ఒక మనిషిని చంపడం ఏమిటి? గోవుకున్న పవిత్రతలన్నీ మనం ఆపాదించుకున్నవే. ఆపాదించుకోవడంలోనూ పూజించడంలోనూ తప్పులేదు. కానీ మన విశ్వాసాలనే విశ్వమంతా అంగీకరించి తీరాలని భావించడంలోనే సమస్యంతా ఉత్పన్నమవుతున్నది. గోవు సాధు జీవి నిజం.

కానీ గోవు కన్నా మనిషి ఇంకా ఉన్నతుడు అనే విషయం ఎందుకు గుర్తించడం లేదు. ఆహారపు అలవాట్లు మనిషి సుదీర్ఘ జీవన ప్రయాణంలో తమ తమ విశ్వాసాల పునాదులపై ఆధారపడి ఏర్పడతాయి. ఇప్పటికిప్పుడు అవతరించినవి కాదు. మన ప్రాంతంలో చేప మాంసాహారం. బ్రాహ్మణులు, ముఖ్యంగా వైదికులు తినరు. ఒరిస్సా, బెంగాల్‌లలో అది వైదికులకు కూడా ఆహారమే. మనం పాములను తినడమంటే అసహ్యించుకుంటాం. కోతులను తినడం గురించి కలనైనా ఊహించుకోలేము. నాగుపాములను కొలుస్తాం. కోతులను కూడా ఆంజనేయుడి సంతతిగా భావిస్తాం. కోతులను కొట్టడం కూడా తప్పని భావిస్తాం. కానీ కొన్ని దేశాలలో పాములను, కోతులను కూడా తింటున్నారు. అది వారివారి జీవన విధానాల్లో భాగంగా మారిపోయింది. ఇది జీవన వైవిధ్యం. ఇది నిజం.

దీనిని ఆకళింపు చేసుకోవడంలోనే మనిషి, మతం రెండూ పరిణతి చెందుతాయి. అనేక మతాల సమ్మేళనంగా మిగిలిపోయిన మన సమాజంలో ఇప్పుడు మతాల ఇనుపకంచెలు వేసుకుని గిరులు గీసుకుని కత్తులు దూయడమంటే మళ్లీ మతయుద్ధాల కాలం నాటి మధ్యయుగాల్లోకి జారిపోవడమే.
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఈ ఘటనలకు నేరుగా సంబంధం ఉన్నట్టు కనిపించకపోయినప్పటికీ కేంద్రీయ సంస్థలను కాషాయీకరణ దిశగా కదుపుతున్న తీరు, బీజేపీ నాయకులు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు నేరం చేస్తున్నవారిని ప్రోత్సహించేవిగా, సమర్థించేవిగా ఉంటున్నాయి. ప్రజాస్వామిక రాజకీయాల యుగంలో మతం పునాదులపై వ్యవస్థలను నిర్మించాలనుకోవడం ప్రమాదకరం. మతం పేరుతో సమాజాన్ని నియంత్రించాలనుకోవడం తిరోగమనమే. మతం ఆవహించిన రాజ్యాలలో జరుగుతున్న నరమేధం మనం స్వయంగా చూస్తున్నాం. వాటి విషఫలితాలను మనం కూడా అనుభవిస్తున్నాం.

మన దేశాన్ని కూడా అటువంటి అనాగరిక దారులలోకి మళ్లించాలనుకోవడం అవివేకం. అత్యధిక ప్రపంచ దేశాలు మతం నుంచి రాజకీయాలను వేరు చేసుకుని పురోగమిస్తున్నాయి. మన దేశం కూడా అదే మార్గంలో పయనిస్తున్నది. ఇప్పుడు బీజేపీ మతరాజకీయాలవైపు గేరు మార్చే పనిచేస్తే తాత్కాలికంగా అది ఫలితాలను ఇస్తుందేమో కానీ దీర్ఘకాలికంగా అటువంటి ప్రయత్నాలు ఆ పార్టీకి కూడా ఉపకరించవు. మతస్వేచ్ఛ ఉండాలని కోరుకున్నట్టే మతాచరణ లేకుండా జీవించే స్వేచ్ఛ కూడా ఎప్పటిలాగే వర్ధిల్లాలి. మతం కంటే మానవత్వాన్ని మన పతాకంగా మార్చుకోవాలి. గొప్ప సంస్కృతి, వారసత్వం, విలువలు కలిగిన సమాజంగా మన దేశానికి ఇప్పటికే పేరుంది. కొత్తగా మతం రంగు పులిమితే వచ్చేదేమీ లేదు. మతాన్ని, దైవ భావనను కాపాడుకోవడంలో తప్పులేదు. దానికోసం తపించడంలో ఆక్షేపించాల్సిందేమీ లేదు. మనిషిని కాపాడుకోవడం అం తకంటే విలువైన అంశంగా గుర్తించండి.

2411

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles