ఎండి బీటలు వారిపోయిన కోట్లాది హృదయాల్లో
ఆత్మీయ జలాలు కుండపోతగా వర్షించినట్టు..
దుఃఖంతో తడారిపోయిన కళ్లల్లో
ఆనంద బాష్పాలు జలజలా పారినట్టు..
ఎదురుచూసీ ఎదురుచూసీ స్తంభించిపోయిన మస్తిష్కాలు
భావోద్వేగంతో ఉప్పొంగిపోయినట్టు..
తనువులు కాల్చుకుని ధిక్కార నినాదాలిచ్చిన తమ్ముళ్లు
స్వేచ్ఛా పతాకాలను ఎగురవేసినట్టు..
ఉరితాళ్లు పేనుకుని మృత్యువును అలుముకున్న బిడ్డలు
శాంతించి ఆనంద తాండవం చేస్తున్నట్టు..
పంజరంలో బందీగా పాటలు మాత్రమే పాడుకున్న పక్షి
రెక్కలు విప్పుకుని స్వేచ్ఛా విహారం చేస్తున్నట్టు..
ఆర్థిక, రాజకీయ, భావజాల ఆధిపత్యపాదాలకింద నలిగిపోయిన జాతి
శృంఖాలలను తెంచుకుని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్టు..
తెలంగాణ తన జీవితకాలంలో ఒక విజయం సాధించింది.
లోక్సభ తెలంగాణ బిల్లుకు జేజేలు పలికింది.
జై తెలంగాణ, జయహో తెలంగాణ!
- కట్టా శేఖర్డ్డి