రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు అంటారు రాజకీయ పండితులు. ఒకరిని ఒకరు ఫినిష్ చేయడం అంటూ ఉండదు. అలా ఫినిష్ చేయాలని చూసినవారే ఫినిష్ అయిపోయిన సందర్భాలు మన అనుభవంలో కూడా ఉన్నాయి. నాయకులు చేసే తప్పులే, నాయకులకు వచ్చే మెప్పులే ఏ పార్టీనయినా ముంచేది, పెంచేది. నాయకులపై ఉండే నమ్మకం, నాయకుడు ఒక విధానానికి కట్టుబడి ఉండే నీతిబద్ధత ఆ పార్టీకి డ్రైవింగ్ ఫోర్సు అవుతాయి. ఏదో ఒక కొత్త నీతిని, ఏదో ఒక కొత్త విధానాన్ని, ఏదో ఒక వినూత్న నినాదాన్ని అందిపుచ్చుకుని ముందుకు వచ్చిన నాయకులనే జనం నెత్తికెత్తుకుంటూ వచ్చారు. చరిత్ర నిండా ఇటువంటి పాఠాలు కొల్లలు. కాంగ్రెస్ కుళ్లిపోయి, పుచ్చిపోయి బుర్రలు కాస్తున్న కాలంలో ఎన్టిఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవం, బడుగులకు అధికారం, స్వచ్ఛమైన పాలన నినాదాలతో ఎటువంటి ఉరుములూ మెరుపులూ లేకుండానే తెలుగునాట విజయ దుందుభి మోగించారు.ఒక దివాలాకోరుతనం ఓడిపోయింది. కొత్త ఆశ, ఆశయం విజయం సాధించింది. కానీ ఏడేళ్లు తిరిగే సరికి ఆ ఆశ, ఆశయాలపై భ్రమలు తొలగిపోయాయి. ముఖ్యమంవూతులు మారలేదు. ఎన్టిఆర్ ఒక్క రే నాయకుడు. కానీ అహం అతిశయించి, అన్ని రకాల వెర్రితలలూ ప్రదర్శించారు.
కొత్త వేషాలు, కొత్త విధానాలు, నియంతృత్వ పోకడలు, మూఢ నమ్మకాలు...ఎన్టిఆర్ తనను తానే ప్రజల దృష్టిలో హీనపర్చుకుంటూ వచ్చారు. రాజకీయ ఆత్మహత్యలు జరిగేది ఇలాగే. ఆయననుంచి ఏ విధానాలు ఆశించారో అవి నెరవేరలేదు. ఆయనలో ఏ నీతిబద్ధతను కోరుకున్నారో అది నిలబడలేదు. అందుకే 1989లో అంతకు ముందు ఛీకొట్టిన కాంగ్రెస్‌నే తిరిగి గెలిపించారు. అయినా కాంగ్రెస్ గుణం మారలేదు. అష్టవంకరలు మానలేదు. ముఖ్యమంవూతులను మార్చడం, కీచులాటలు, నిత్య పంచాయతీలు నిరవధికంగా కొనసాగాయి.
ఆ తర్వాత అయిదేళ్లకు 1994లో ఎన్టిఆర్ మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పాత నినాదాలకు పదునుపెట్టి, కొత్త నినాదాలను జోడించి, మద్య నిషేధాన్ని హామీ ఇచ్చి కనీవినీ ఎరుగని విజయం సాధించారు. కానీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని, ఆయన భార్య లక్ష్మీపార్వతి ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని పనిగట్టుకుని ప్రచారం చేసి, పత్రికల్లో అదేపనిగా రాయించి, వేధించి, ఎన్టిఆర్ నైతికతమీద దెబ్బకొట్టారు చంద్రబాబు, ఆయన సహచరు లు. ఎన్టిఆర్, లక్ష్మీపార్వతిల వల్ల రాష్ట్రానికి మహాపాపమేదో జరిగిపోతున్నదని ఊదరగొట్టారు. మెజారిటీ ఎమ్మెల్యేల ను కూడగట్టుకుని ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేశా రు. విచిత్రం ఏమంటే, ఎన్‌టిఆర్‌ను నైతికంగా దెబ్బతీసిన చంద్రబాబు,తాను నీతిమంతుడిగా ప్రజల మెప్పును పొందలేకపోయారు. ఎన్‌టిఆర్‌ను అన్యాయంగా గద్దెదింపారని, వెన్నుపోటు పొడిచారని, ఆయన అకాల మృతికి కారణమయ్యారని చంద్రబాబునాయుడు విమర్శలు ఎదుర్కొన్నారు.
అనైతిక చర్యకు ప్రతీకగానే ఆయనను జనం చూశారు. ఆ అనైతిక ముద్ర నుంచి బయటపడడానికి ఆయన చాలా పాట్లు పడ్డారుపజల వద్దకు పాలన, ఆకస్మిక పర్యటనలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగెత్తించడం.. వంటివి ఆయనపై పడిన ముద్రను కొంతమేరకు తగ్గించాయి. కానీ ఆయన పూర్తిస్థాయిలో ప్రజల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోయా రు. 1994లో 44.5 శాతం ఓట్లు సాధించిన తెలుగుదేశం ఇక ఆ వైభవాన్ని ఇంతవరకు చూడలేదు. 1996,1998 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా 32.59, 31.97 శాతం ఓట్లతో సరిపెట్టుకోవలసివచ్చింది. చంద్రబాబు నైతిక పతనం బిజెపికి ఉపయోగపడింది. రాజకీయాల్లో ఒక కొత్త నీతితో, కొత్త సందేశంతో బిజెపి ముందుకు వచ్చింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా 18.3 శాతం ఓట్లు సంపాదించింది.నాలుగు లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. చంద్రబాబు పతనం నుంచి తనను తాను కాపాడుకోవడానికి 1999 ఎన్నికల్లో 24 గంటల్లో విధానాలను, నినాదాలనూ మార్చి బిజెపి పంచన చేరాడు. కార్గిల్ విజయం, వాజ్‌పేయిని అన్యాయం గా దించేశారన్న మధ్యతరగతి ఆగ్రహం, టిడిపి-బిజెపి కూటమికి ఉపయోగపడ్డాయి.‘నువ్వు మంచివాడివి కాకపోయినా పర్వాలేదు, మంచివాళ్లతో ఉంటే కొంత కీర్తి నీకు వస్తుంది’అని లోకనీతి. చంద్రబాబుకు అదే ఉపయోగపడింది. మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయినా ఆయనకు వచ్చింది 39.5 శాతం ఓట్లు మాత్రమే.
ప్రతి ఎన్నికలోనూ ఒక నీతి గెలిపిస్తూ ఉంటుంది.ఒక బలహీనత, ఒక అనైతిక త, ఏ నీతీ లేనితనం ఓడుతూ ఉంటుంది. 1999 ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఒక చోదకశక్తి ఎవరూ లేరు. బహునాయకత్వం, తన్నులాటలు, సీట్ల పంపకం లో లాలూచీలు, టికెట్ల అమ్మకాలు....ఇక ఆ పార్టీ ఏం నీతిని చెబుతుంది? ప్రజల కు ఎలా విశ్వాసం కలిగిస్తుంది? అందుకే కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించలేదు. 2004 కు వచ్చే సరికి వైఎస్ రాజశేఖర్‌డ్డి కాంగ్రెస్‌కు ఒక చోదక శక్తిగా, ఒక నైతిక శక్తిగా రాణించారు. చంద్రబాబునాయుడు ప్రచారం మాయలో పడి నేలవిడిచిన సాము మొదలు పెట్టారు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా స్టార్ ఆఫ్ ఏసి యా అనిపించుకోవడానికి ఉబలాటపడ్డారు. పత్రికలు, వందిమాగధులు, ప్రపంచబ్యాంకు ఆయనను మునగచెట్టు చివరికొమ్మ మీదికి తీసుకెళ్లాయి. మరోవైపు రాజశేఖర్‌డ్డి అంగన్వాడి కార్మికులు మొదలు కాంట్రాక్టు టీచర్ల వరకు ఎక్కడ ఏ సభ జరిగినా వాలిపోయి, కలిసిపోయి, జనంలో విశ్వాసాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆయన పాదయాత్ర ఆయనను ఒక త్యాగశీలిగా, ఒక పోరాట యోధునిగా జనం ముందు నిలబెట్టింది. రాజశేఖర్‌డ్డికి సంబంధించి అంతకుముందున్న ముద్రలన్నింటినీ ఆయన చర్యలు తుడిపేశాయి.
ఆ కొత్త ముద్రే ఆయనను విజేతగా నిలబెట్టింది. ఆ తర్వాత ఐదేళ్లూ రాజశేఖర్‌డ్డి తాను స్వయంగా ఎన్ని అనైతిక చర్యలకు పాల్పడినా, చంద్రబాబు నైతికత మీదనే దాడిని కొనసాగిస్తూ వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన ఆ రెండు పత్రికలు ఎన్ని కుంభకోణాలు, ఎన్ని అక్రమాలు బయటపెట్టినా ప్రజలు నమ్మకుండా ఉండడంకోసం, వాటి నైతికతపైనా దాడి చేశారు. చంద్రబాబు నమ్మదగిన మనిషి కాదు అన్న వాదాన్ని ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ పోయాడు. చంద్రబాబు చేసిన తప్పులన్నీ రాజశేఖర్‌డ్డి కూడా చేస్తూ పోయారు. తన తప్పులు ఎత్తిచూపినప్పుడల్లా ఎదురుదాడిని ఆయుధంగా చేసుకు ని ప్రచారం చేశారు. చంద్రబాబును గతం పీడలాగా వెంటాడుతూ వచ్చింది. చంద్రబాబు నైతికంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి పెద్ద ప్రయత్నమేదీ చేయలేదు. అసలు తాను తప్పులే చేయలేదన్నట్టు, తనను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టు ఆయన మాట్లాడుతూ వచ్చారు. సాధారణంగా ప్రజాతీర్పు చూసిన తర్వాతయినా నాయకులు తప్పులు ఒప్పుకుంటారు. చెంపలేసుకుంటారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కానివ్వబోమని తిరిగి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయ త్నం చేస్తారు.
దూరమైన వారికి తిరిగి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు మొదటి నాలుగేళ్లూ ఏనాడూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు. తప్పు లు తెలుసుకోవడం, ఒప్పుకోవడం నామూషీగా ఫీలయ్యారు. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఆయన పాత తప్పులన్నింటినీ తెరమరుగుచేసింది. మహాకూటమి ఏర్పాటు చేయడానికి అది దోహదం చేసింది. ఆయనకు ఒక నైతిక సమర్థన రావడానికి, రెండు ప్రాంతాల్లోనూ ఊపురావడానికి, పార్టీ ముక్క చెక్కలు కాకుండా చూడడానికి ఇది ఉపయోపడింది. కానీ తీరా ఎన్నికల వేళ చంద్రబాబు మళ్లీ నీతితప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడాని కి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. టిఆస్ పొత్తు ధర్మాన్ని పాటించి టిడిపికి ఓట్లేస్తే, టిడిపి చాలా చోట్ల వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు అతితెలివి అసలుకే మోసం తెచ్చింది. తెలంగాణలో మరో 25-30 సీట్లు తేలికగా వచ్చేవి. తెలంగాణలో మహాకూటమికి 35.4 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ కు 33.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల బదిలీ నిజాయితీగా జరగకపోవడమే మహాకూటమి ఓటమికి కారణం అని ఈ అంకెలు తెలియజేస్తాయి.
మరోవైపు చిరంజీవి కల్పించిన కొత్త ఆశలు, కొత్త విధానాలు కొన్ని ఓట్లను చీల్చాయి.
రాష్ట్ర ప్రజలు ఏది నీతి, ఏది అవినీతి అని తేల్చుకోలేని ఒక పరిస్థితిని రాజశేఖర్‌డ్డి సృష్టించగలిగారు. అందుకే 2009 ఎన్నికలు అంత సంక్లిష్టంగా ముగిశాయి. రాజశేఖర్‌డ్డి అవినీతిపై ఆగ్రహం నిజమే. చంద్రబాబు నీతిమంతుడుగా, నమ్మదగిన నాయకుడుగా విశ్వాసం కలిగించకపోవడం నిజమే. చిరంజీవి కొత్త నీతితో ముందుకు వచ్చినా ఆయన కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోయారు. ఓట్ల చీలిక రాజశేఖర్‌డ్డిని గెలిపించింది. కేవలం 36.5 శాతం ఓట్లతో రాజశేఖర్‌డ్డి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇంత తక్కువ శాతం ఓట్లతో ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఐదు దశాబ్దాల తర్వాత తిరిగి ఇదే. ఈ పరిణామాలన్నీ చెబుతున్నది ఒక్కటే. పార్టీలను గెలిపించినా ఓడించినా నాయకుల చేతుల్లోనే ఉంది. వారి మంచి చెడులే గీటురాయి అవుతాయి. వారు ఇచ్చే నినాదాలే చోదక శక్తులవుతాయి.
కాంగ్రెస్ తెలంగాణపై తన వైఖరి ప్రకటించి, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పాటుపడిఉంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని నెత్తిన పెట్టుకునే వారు. చంద్రబాబు తెలంగాణపై మాటమార్చకుండా ఉండి ఉంటే తెలంగాణలో ఆయనకు ఈ గతి పట్టి ఉండేది కాదు. విషాదం ఏమంటే, నీతిలేని ఇటువంటి విధానం వల్ల కాంగ్రెస్, టీడీపీలను అటు ఆంధ్రలో కూడా జనం నమ్మని పరిస్థితి వచ్చింది. జగన్మోహన్డ్డిని ఎందు కు నమ్ముతున్నారంటే, ఆయనను జనం ఇంకా అధికారంలో చూడలేదు. రాజశేఖర్‌డ్డి చేసిన కొన్ని సంక్షేమ పథకాలు, ఆయన అకాల మరణం జగన్మోహన్డ్డి పట్ల కొన్నివర్గా ల ప్రజల్లో ఒక ఆబ్లిగేషన్ సృష్టించాయి. నీతి అవినీతిలతో నిమిత్తం లేదు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అన్నదే తేడా. జగన్మోహన్డ్డి మీద చంద్రబాబు వేస్తున్న బాణాలు పనిచేయకపోవడానికి కారణం అదే. చంద్రబాబు లేక కాంగ్రెస్ నేతలు నైతికంగా తిరిగి తమను తాము రుజువు చేసుకునేదాకా వారిని ప్రజలు క్షమించరు. నైతికంగా రుజువు చేసుకోవడం అంటే ప్రత్యర్థులపై ఆరోపణలు, బురద కుమ్మరించడం కాదు. అది బుకాయింపు అవుతుంది.
బుకాయింపులను, దొంగదెబ్బలను జనం ఇంకా ఛీత్కరిస్తారు. మనం ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామో, ఎంత సూత్రబద్ధంగా ఉన్నామో రుజువు చేసుకోవాలి. కేసీఆర్ అలా ఒక సూత్రబద్ధతకు కట్టుబడి నిలబడ్డారు కాబట్టే ఇవ్వాళ ఆయన బలపడుతున్నారు. ఆయన బలం తెలంగాణ నినాదం. ఆయన నైతిక శక్తి తెలంగాణ. తెలంగాణలో ఇవ్వాళ ఏ పార్టీ బతికి బట్టకట్టాలన్నా మళ్లీ ఒక నీతిబద్ధమైన నిర్ణయం(మోరల్ పొజిషన్) తీసుకోవాల్సిందే. రెండు కళ్లు, మూడు కళ్లు, అనేక నాలుకలను జనం సహించరు.
kattashekar@gmail.com