గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గా తాను విశేష సేవలు అందించారు. వారు ఎనిమిదేళ్ల క్రితం మరణించారు. ఐతే, గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో గాంధీ మహాత్ముడి స్మారక సంగ్రహాలయాన్ని తన ఇరవై ఎనిమిదవ ఏటే నిర్మించిన మరో ఆర్కిటెక్టే చార్లెస్ కొరియా. అతడు మన భారతీయుడు. మన తెలంగాణ వాడు. హైదరాబాదీ. లారీ బేకర్ తదనంతరం దేశీయ అవసరాలకు తగ్గ ఆర్కిటెక్ట్‌గా, లారీ బేకర్‌కు కొనసాగింపుగా చెప్పుకునే ఆర్కిటెక్ట్ తాను. వారు సామాన్యులకే కాదు, మధ్య తరగతికీ, పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకీ- ఒక్క మాటలో విదేశీ పోకడలేని స్వదేశీ ఆర్కిటెక్ట్‌గా అద్భుతమైన కృషి సలిపారు. ఆర్కిటెక్చర్ రంగంలో వెలుగుకీ, నీడకీ తాను ప్రాధాన్యం ఇచ్చారు. నేల విడవని సాము చేశారు. వారు మొన్న, అంటే పదహారవ తేదీ రాత్రి 84వ ఏట ముంబైలో తనువు చాలించారు. దాంతో మన దేశ నిర్మాణరంగంలో, పునర్నిర్మాణ రంగంలో ఒక తీరని వెలితి ఎప్పటికీ కనిపిస్తుందనే ఈ నివాళి.

నిజానికి తెలంగాణ పునర్నిర్మాణంలో చురుగ్గా ఉండవలసిన చార్లెస్ కొరియా ఎందుకనో అవశ్యమై న సమయంలో తనువు చాలించారనిపిస్తుంది. ఎం దుకంటే, ఆయన నిర్మాణ రీతిని, దృక్పథాన్ని గమనిస్తే ఆ సంగతి మనకర్థమౌతుంది.
1 సెప్టెంబర్ 1930లో సికింద్రాబాద్‌లో జన్మించిన చార్లెస్ కొరియా ముంబైలోని సెయింట్ క్జెవియ ర్ కాలేజ్‌లో విద్యాభ్యాసం చేశారు. తర్వాత మిచిగా న్ యూనివర్సిటీలో, అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసుకుని వచ్చారు. తర్వాత ఆర్కిటెక్ట్‌గా, యాక్టివిస్టుగా తన పూర్తి జీవితాన్ని గడిపారు. లారీ బేకర్ తర్వాత మన దేశం అటువంటి ముద్దుబిడ్డను చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సంపన్నుల ఆకాశ హర్మ్యాలు కాదు, జనసామాన్యానికి ఆకాశాన్ని మిగిల్చిన మనిషాయన.
చార్లెస్ కొరియా భారతదేశంలో సమకాలీన ఆర్కిటెక్టులందరిలోకెల్లా ముఖ్యమైనవాడు. గాంధీ అభిలషించిన గ్వామ స్వరాజ్యంలో కూడు, గూడు, గుడ్డ అన్నవి కీలకమైతే గూడు గురించి తపించి, ఆ స్వప్నాన్ని పరిమితంగానైనా సాకా రం చేసిన ఆర్కిటెక్టుల్లో తానొకరు. తన స్వప్నాలు ఇంకా పెద్దవి. కానీ, అనివార్యంగా మూడో ప్రపంచ దేశాలు మొదటి ప్రపంచ దేశాలను అనుసరిస్తుండటం, మరోవంక -ప్రపంచమే ఒక కుగ్రామం అవుతూ నగరీకరణ ముందుకు వచ్చినప్పుడు వలస జీవులకూ నగరాలు కేంద్రం అవడాన్ని ఆయన ముందే పసిగట్టా రు. తన దీర్ఘదృష్టితో లారీ బేకర్ పరిమితిని దాటి తనదైన మార్గంలో ఒక విశిష్టమైన అర్బన్ ప్లానర్‌గా ముందుకు వచ్చారు. వర్నాక్యులర్ ఆర్కిటెక్చర్‌ని తనదైన శైలిలో అనుసరించారు. ఒక రకంగా స్థానికత అవసరాల నుంచి ఆయన నిర్మాణ రంగాన్ని మలుపు తిప్పారనాలి. తగిన గుర్తింపునూ పొందారు.
చార్లెస్ కొరియా మన దేశంలో అనేక ప్రభుత్వ అకాడమీ భవనాలు, రిసార్టులను నిర్మించారు. అల్పాదాయ వర్గాల కోసం నిర్మించిన హౌసింగ్ యూనిట్స్ గురించైతే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చెప్పవలసింది నావీ ముంబై సబర్బ్. 1970లో ఆయన చీఫ్ ఆర్కిటెక్ట్‌గా కొత్త ముంబై (నేవీ ముంబై) నగరాన్ని నిర్మిం చే బాధ్యతను స్వీకరించి సమర్థంగా తన విధిని నిర్వహించారు. అట్లే, జైపూర్‌లో జవహర్లాల్ కళాకేంద్రాన్ని, ఢిల్లీలో నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియాన్ని ఆయన నిర్మిం చి, నెలకొల్పిన విధానం ఒక చూడ ముచ్చట. దేశీయకళా రూపాలకు ఎట్లా వేదిక కల్పించాలో వాటి పనితీరే చూపుతుంది. అంతేకాదు, భోపాల్‌లోని భారత్ భవన్ కావచ్చు, మన హైదరాబాద్‌లోని జేఎన్ఐడీబీ భవనం గానీ వారు నిర్మించినవే. తాను నేషనల్ కమిషన్ ఆఫ్ అర్బనైజేషన్‌కు తొలి చైర్మన్‌గానూ పనిచేశారు. 2006లోనే ఆయన పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత. అయితే తన ఆశయం, ఆచరణ అంతానూ -స్థానికుడు, అతడి సంప్రదాయం, సంస్కృతి, అందుబాటులోని మెటీరియల్. వీటన్నిటితో ఆయన ఒక ఆర్కిటెక్ట్‌గా భారతీయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ ప్రపంచ పోకడలో మనదైన అస్తిత్వాన్ని నిరూపించారు. ఆధునికతను సైతం జోడించి అర్బన్ లైఫ్‌లో రూరల్కీ చోటిచ్చి మెప్పించగలిగారు.
భారతదేశంలోనే కాదు, విదేశాల్లోనూ చార్లెస్ కొరియా కీలకమైన ప్రాజెక్టులనే చేపట్టారు. న్యూయార్క్‌లోని ఇండియాస్ పర్మినెంట్ మిషన్ భవనం అందులో ఒకటి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బ్రెయిన్ సైన్స్ భవ నం మరొకటి. తాజా నిర్మాణాల్లో ఒకటి, కెనడాలోని ఇస్మాయిల్ సెంటర్. అయి తే, తన నిర్మాణ కౌశలంలో ఒక ప్రధాన అంశం తన భవనాలు, ఇండ్లు ఏవైనా తలుపులు తెరిచినట్టు తెరిచి నలుదిక్కులా చూస్తుంటాయి. ముఖ్యంగా ఆకాశం కనిపించేలా నిర్మాణాలుంటాయి. అవి ఓపెన్ స్కై నిర్మాణాలుగా పేరొందాయి. పొద్దు పొడవటం నుంచి పొద్దుగూకే దాకా సూర్యుడి ప్రవర్తన ఇంటికి కళ తేవడం ఎలా వుంటుందో తన నిర్మాణాల్లో చూడవచ్చు. చంద్రోదయం నుంచి పున్నమి వరకూ ఇల్లు వెన్నెలకోన కావడాన్ని గమనించగలుగుతాం. ఇట్లా తన ఈస్తటిక్స్ కూడా ఆర్కిటెక్చర్ వికాసానికి పెద్ద అస్సెట్ కావడం చూస్తాం.
దశాబ్దాలుగా మనదేశంలోని అన్ని కాలేజీల్లోనూ ఆయన గురించి చదువుకోని ఆర్కిటెక్ట్ విద్యార్థి వుండరంటే అతిశయోక్తి కాదు. శివ్ కుమార్ అన్న యువ ఆర్కిటెక్ట్ మాటల్లో చెబితే, ఎండ తీవ్రత అధికంగా వున్న మన దేశ అవసరాలకు తగ్టట్టు చార్లెస్ కొరియా ప్లానింగ్ స్టయిల్ వుండేది. అందం కన్నా అవసరాని(ఫంక్షనాలిటి)కి ప్రాధాన్యం ఇచ్చే చార్లెస్ కొరియా డ్రాయింగులు మా వంటి యువ ఆర్కిటెక్టులకు గొప్ప ప్రేరణ. వెలుగు నీడలనే కాదు, వర్షం కూడా ఆయన దృష్టిలో వుంచుకోవడం మరో ప్రత్యేకత అనీ అన్నారాయన.
అయితే, చార్లెస్ కొరియా ఆధునిక నగరాల నిర్మా ణం పట్ల విమర్శనాత్మకంగా ఉండేవారు. మార్కెట్ శక్తులు నగరాలను నిర్మించవు. అవి నిర్మూలిస్తాయి, విధ్వంసానికి గురిచేస్తాయి అని గట్టిగా నమ్మేవారు. నమ్మడమే కాదు, 1984 లోనే ముంబైలో ఆయన అర్బన్ డిజైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను కూడా ప్రారంభించి, పర్యావరణానికి దోహదపడే నిర్మాణాల కోసం యోచించారు. దేశీయ జీవనానికి ప్రాధాన్యం ఇస్తూ వాటి నిర్మాణాలుండాలని సరికొత్త మార్గానికి పునాదు లు వేశారు. అంతేకాదు, స్వాతంత్య్రానంతర భారతదేశపు రూపురేఖలు మార్చడంలో ఆయన ఇంటిని, కార్యాలయాన్ని, సంస్థలనే కాదు, ఫుట్‌పాత్‌లనూ పట్టించుకున్నారు. మెజారిటీగా ఈ దేశ పౌరులు ఇంకా మానవులుగా కూడా గుర్తింపు కు నోచుకోలేదని, వారు నివసించడానికి ఫుట్‌పాత్‌లను కూడా విశాలంగా వుం చాలని, అక్కడ నీళ్ల ట్యాపులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఆ పని ఆయన నిర్వహించారు కూడా. ఇట్లా చార్లెస్ కొరియా మన దేశం గర్వించే సుతారి. ముఠామేస్త్రి, దీర్ఘదర్శి, భవన నిర్మాత, పునర్నిర్మాణ వేత్తా. అయితే, ఆయన మన వాడు. హైదరాబాదీ. భారతీయ ఆర్కిటెక్ట్‌గా సమూన్నత సేవలందించి విశ్వవిఖ్యాతి నొందిన ఆయన ఇప్పుడు లేరు. ఆయన పనితీరు, హెచ్చరికలు పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న తెలంగాణకు గుణపాఠాలు.
- కందుకూరి రమేష్‌బాబు