ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయస్సీ వంటి కోర్సులకు కానీ వెళతారు. వీటిలో విజయం సాధించాలంటే
వారి వారి రంగాల్లోని స్పెషలైజ్డ్ సబ్జెక్టు అర్థం చేసుకోగలిగిన భాషా సామర్థ్యం చాలా ముఖ్యం.
విద్యారంగంలో ఇంటర్మీడియెట్ ముఖ్యమైనది. ఉన్నత విద్యలోకి అడుగు పెట్టే ముందు ముఖ్యమైన నైపుణ్యాలన్నీ సంతరించుకోవలసిన సమయం. ఆస్థాయి దాటగానే వచ్చే డిగ్రీ విద్య భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగరంగాన్ని ఇంకాపైకి చదువుకోవాలంటే ఆ స్థాయి విద్య గరపడానికి ఉపయోగపడేటట్టు ఇంటర్ స్థాయి విద్య ఉండాలి. వయస్సు పరంగా కూడా 18 ఏం డ్లు నిండిపోతాయి. కాబట్టి జీవితంలోకి ప్రవేశించే ముఖ్య సందర్భానికి పునాది వేసేది ఈ ఇంటర్ విద్యాస్థాయే.
రెండు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా దెబ్బతిన్నది ఇంటర్మీడియెట్ విద్య. మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞుల ప్రకారం 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న వయస్సు చాలా ముఖ్యమైనది. శారీరక, మానసిక పెరుగుదల అధికంగా జరిగే సమయం. ఇంట్లో తల్లిదండ్రులు, ఇతర సభ్యులు, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఈ వయస్సు వారిని ఎంతో జాగ్రత్తగా గమని స్తూ, సున్నితంగా వ్యవహరించవలసిన సమయం. కానీ గతకాలంలో ఈ స్థాయి విద్య కార్పొరేటీకరణకు బలైపోయింది. పువ్వుల్లా ఎదుగుతూ ప్రపంచాన్ని తులనాత్మకంగా అర్థం చేసుకోవాల్సిన (ఇంటర్)రెండేళ్లు ఈ విద్యార్థులు పుట్టగొడుగుల్లా వెలిసిన కళాశాలల్లో, ఇరుకు తరగతి గదుల్లో కుక్కి, తమ సంతోషాన్ని, ఉత్సాహాన్ని నారాయణార్పణం చేసి, తమ వ్యక్తిగత, సామాజిక చైతన్యాన్ని కోల్పోయారు. బానిసల్లా అనేకరకాల హింసలకూ గురయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్నారు.
అవన్నీ భరించి మంచి ఫలితాలు సాధించి మంచి కోర్సు ల్లో చేరినవారు బహుశా పది శాతం ఉంటారు. మిగిలేవారిలో చాలా మంది పుట్టగొడుగుల్లా వచ్చిన ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివి డిగ్రీలు సంపాదించినా, నైపుణ్యాలు సంపాదించలేక నిరుద్యోగులుగా ఉండటమో, ఏదో ఒక ఉద్యోగంలో చేరడమో చేస్తున్నారు. ఒక సర్వే ప్రకారం సాంకేతిక పట్టాలు (బీ.టెక్ వంటివి) ఉన్నవారిలో 83 శాతం సాధారణ పట్టాలు (బీకాం,బీఏ,బీఎస్సీ వంటివి) ఉన్నవారిలో 93 శాతం యువత ఏ ఉద్యోగాలకు పనికిరారని తేలింది. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలో విద్యా రంగం సాధించిన ప్రగతి! ఈనాడు పట్టాలు పొందుతున్నవారిలో చాలా మందికి ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంప్లాయి ఎబిలిటీ స్కిల్స్, గ్లోబల్ స్కిల్స్ వంటి సాఫ్ట్ స్కిల్స్ కొరవడ్డాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీ దశదాకా విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి.
ఇంటర్‌స్థాయి విద్య ఎలా ఉండాలో పరిశీలిద్దాం. పదవ తరగతి తర్వాత దాదాపు 30 శాతం విద్యార్థులు పై తరగతులు చదువరు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దళితులు, గిరిజనులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు వీరిలో ఎక్కువగా ఉంటారు. వీరిలో కొందరు వృత్తివిద్యా కోర్సులైన ఐటీఐ, పాలిటెక్నిక్ చేస్తారు. కొద్దిమంది ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులు చేస్తారు. ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయస్సీ వంటి కోర్సులకు కానీ వెళతారు. వీటి లో విజయం సాధించాలంటే వారి వారి రంగాల్లోని స్పెషలైజ్డ్ సబ్జెక్టు అర్థం చేసుకోగలిగిన భాషా సామర్థ్యం చాలా ముఖ్యం. ఇవి పెంపొందాలంటే ఇప్పుడున్న కంఠస్థం చేసే పద్ధతిని రూపుమాపి, విద్యను వంట పట్టించుకునే పద్ధతులు ప్రవేశపెట్టడం అవసరం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనరల్ ఇంటర్మీడియెట్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులను కూడా బలోపేతం చేయా లి. జనాభా అధికంగా ఉన్న మన దేశంలో ప్రతీస్థాయినీ బలోపేతం చేయాలి. ప్రతి స్థాయి విద్యకోసం స్పష్టమైన పాలసీలు రూపొందించాలి. అవి రూపొందించేటప్పుడు ఈ కింది విషయాలు పరిశీలించాలి.
1.పదవ తరగతి పాసయ్యే సమయానికి విద్యార్థులు మాతృభాష, ఇంగ్లీషులలో కనీస భాషా నైపుణ్యాలు కలిగి ఉండాలి. 2.ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సులు అయ్యేటప్పటికీ పైస్థాయి చదవగలిగిన భాషా నైపుణ్యాలు, ఏ రంగంలోకి వెళ్లాలి అనే స్పష్టత విద్యార్థులకు ఇవ్వాలి. 3.ఇంటర్మీడియెట్ (ఒకేషనల్) కోర్సులను బలోపేతం చేసి, సరైన కోర్సులను డిజైన్ చేసి, సిలబస్ నిర్మించడంలోనూ, దానిని బోధించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కార్పెంటర్, శిల్పకళ, హ్యాండీక్రాప్ట్స్ వంటివి కూడా ప్రవేశపెట్టాలి. ఆ విద్యార్థులు ప్రొఫెషనల్‌గా ఎదగటానికి కావాల్సిన ఆలోచ న, ఆచరణా సరళిని విద్యార్థులకు అందించాలి. ఈ కోర్సులు చేసినవారికి డిగ్రీ కోర్సులలో వారి ఐచ్ఛిక పాఠ్యాంశాలతో చేరే వీలు కల్పించాలి.
4.ఒకేషనల్ కోర్సుల్లో ఇప్పుడున్న పెద్ద లోపం ఇంగ్లీషు సిలబస్. వారికి జనరల్ ఇంటర్మీడియెట్‌కు ఉన్న ఇంగ్లీషు పుస్తకాలే ఇవ్వటంతో, దాదాపు 90 శాతం విద్యార్థులు ఇంగ్లీషు పరీక్ష లో ఉత్తీర్ణులు కావడం లేదు. దానికోసం గతం లో ఒక ఎక్స్పర్మెంట్ చేయటం జరిగింది. 2000 నుంచి 2007 విద్యా సంవత్సరం దాకా ఉస్మాని యా యూనివర్సిటీలోని ఇఎల్టీసీ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకా లు బోధించటంతో ఇంగ్లీషులో ఉత్తీర్ణతా శాతం 9 నుంచి 100శాతం అయింది. వారందరికీ ఇంగ్లీషు భాషా నిపుణతలు అబ్బాయి. మళ్లీ 2008లో జనరల్ ఇంటర్ ఇంగ్లీషు పుస్తకమే పెట్టడంతో ఉత్తీర్ణతా శాతం 14 శాతానికి పడిపోయింది. విద్యాశాఖలోని అధికారులు 2007 దాకా ఉపయోగించిన ఇంగ్లీషు పుస్తకాన్ని రివైజ్డ్ చేయించి ఒకేషనల్ విద్యార్థులకు అందిస్తే బాగుంటుంది.
5. కులవృత్తులైన కార్పెంటర్ పని, బంగారం పని, తాపీ పని వంటి వాటికి కూడా సరైన కోర్సులు రూపకల్పన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ పనులు చేసేవారిలో చాలా మందికి సరై న ప్రోత్సాహం లేదు. పని ఎలా సంపాదించుకోవాలో తెలియదు. కొంతమందికి ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా ఉండవు. ఇలాంటి వారికి ప్రొఫెషనల్ ఎథిక్స్ బోధించటం చాలా అవసరం. నేను రోడ్లు ఊడ్చే పనిచేస్తే, నగరంలో అన్ని రోడ్ల కంటే నా రోడ్డు బాగుండాలని అనుకుంటాన ని ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. అటువంటి ఆత్మగౌరవం ప్రతి పనిలోనూ ప్రతిఫలించాలని విద్యార్థులందరికీ బోధించాలి.కేజీ టు పీజీ ఉచిత విద్యే గాక, అంతటా నాణ్యమైన విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అన్నిస్థాయిలల్లో, ముఖ్యంగా ఇంటర్మీడియెట్ స్థాయిలో ఈ ప్రక్షాళన జరుగుతుందని ఆశిద్దాం!
- ప్రొఫెసర్ కనకదుర్గ దంటు