ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు సంఘానికి విద్య అనేది ప్రగతి సాధించటానికి అతిముఖ్యమైన సాధనం. తెలంగాణ రాష్ట్రం ఈ రంగంలో అభివృద్ధిని సాధిస్తే, తనకున్న ప్రకృతి వనరులతో దేశంలోనే కాక
ప్రపంచంలోనే ఒక ఆదర్శ ప్రాంతం అవుతుంది.
తెలంగాణ రాష్ట్రం విలీన విధ్వంసం నుంచి బయటపడి స్వేచ్ఛా ఊపిరి పీల్చుకుంటున్నది. గత అర్ధశతాబ్దంలో జరిగిన అక్రమాల్ని, స్థానికులకు అన్ని రంగా ల్లో జరిగిన నష్టాల్ని సరిచెయ్యడానికి కం కణం కట్టుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇది చిన్నపనికాదు, తేలిక కూడా కాదు. కానీ పాలకుల చిత్తశుద్ధికి ప్రజల సహకారం తోడైతే అసాధ్యం కాదు. తెలంగా ణ వేరుపడిందన్న అక్కసు ఉన్న వారి పట్ల, వ్యక్తిగతంగా కేసీఆర్‌ని వ్యతిరేకించే తెలంగాణ వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులు, చేనేత కార్మికులు, అసంఘటిత రంగాల వారు, ఆటోడ్రైవర్లు, గిరిజను లు, దళితులు మొదలైన వారి సమస్యలు చర్చించి, పరిష్కారాలకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇక రాజధానిలో, తొమ్మిది జిల్లాల్లో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాల మీద ప్రత్యేక దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రికి అందరికంటే ఈ విషయాల్లో అవగాహన ఎక్కువ ఉన్నది గనుక ఇవన్నీ చక్కబడతాయని ఆశించవచ్చు.
ఇప్పుడు మేధావులు, విద్యావంతులు ఆలోచించవలసిన అంశాలు ఉపాధి, విద్యారంగాలు. ఉపాధి రంగంలో ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్నవారి సమస్యలకంటే పెద్ద సమస్య నిరుద్యోగులకు ఉపాధి, విద్యారంగాలు. ఇది చేయటానికి వారిని అర్హులుగా తయారుచేయాలి. ఇది స్వల్పకాలిక ప్రణాళిక కిందకి వస్తే, ఇప్పుడు ఇంకా పాఠశాల, కళాశాల విశ్వవిద్యాలయా ల్లో ఉన్నవారి గురించి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. ఈ రంగంలో సమూలమైన మార్పులు అవసరం.
ఇప్పుడు అనుసరిస్తున్న విద్యా విధానం పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టున్నది. మన పాతతరం విద్యావేత్తలు వేరే దేశాలలోని విధానాలు అనుకరించి రూపొందించుకున్నది. మారిన ఈ కాలానికి ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో అసలు పనికిరాని విధానాలివి. ఇతర దేశాలలో భాషలు,మాండలికాలెన్ని ఉన్నా, ముఖ్యంగా ఒక భాషను దాదాపు 80 నుంచి 100 శాతం మాట్లాడతారు. అందుకే ఆ భాషా మాధ్యమంగా విద్యార్థులకు చదువు మొదలై, రెండవ తరగతి నుంచి పరిసరాలు, సాధారణ విజ్ఞా నం వంటి విషయాలు బోధిస్తారు. పైగా వారి బోధ నా పద్ధతి కూడా చాలా శాస్త్రీయంగా ఉంటుంది.
ఈ విషయంలో భారతదేశం చాలా భిన్నమైంది. ఒక్కొ క్క రాష్ట్రంలో ఒక్కో భాష, దానిలో కూడా ప్రాంతీ య మాండలికాలు ఉండడంతో అసలు చిన్న తరగతులకి మాధ్యమంగా ఒక్కటే భాష ఉండాలనే వాద నే సరికాదు. ఇట్లా నిర్ణయించి ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు మాధ్యమమైతే మాతృభాష రాని దౌర్భాగ్యస్థితి ఉంటుంది. అలా అని కేవలం మాతృభాషనే 4, 5 తరగతుల దాకా మాధ్యమం చేస్తే, ఇంగ్లీషు సహజంగా నేర్చుకునే అవకాశం పోతుంది. అంతేకాక ఆధునిక శాస్త్రజ్ఞుల పరిశోధన చెప్పుకోవాలి. చిన్న పిల్లల విజ్ఞానానికి సంబంధించిన విషయాలు గ్రహించటానికి భాషమీద పట్టు అవసరం.అంతేకాదు, భాషలు నేర్చుకోవటంలో చిన్నతనంలో ఉన్న నిపుణత 11ఏళ్ల తర్వాత తగ్గుతూ వస్తున్నది.
అందుకే మన విద్యార్థులు 5వ తరగతి నుంచి డిగ్రీ రెండవ సంవత్సరం అంటే దాదాపు పదేళ్ళు తప్పనిసరి భాషగా ఇంగ్లీషు చదివినా ఆ భాష సరిగా ఉపయోగించటం లో విఫలమవుతున్నారు. నిజానికి యూరోపియన్ ఇతర భాషలకన్నా, మనదేశంలోని భాషలకన్నా ఇంగ్లీషు సులభంగా నేర్చుకోగలిగిన భాష. అయినా అది రాదని బాధపడే విద్యార్థుల సంఖ్యే అధికం. ఇక ఇంగ్లీషు మీడియంలోనే చదవటం దీనికి పరిష్కారం కాదు.
నిజానికి ఇప్పటి విద్యా విధానం వల్ల ఎవరికీ మాతృభాషా సరిగా రాదు. పరభాష ఇంగ్లీషు సరిగా రాదు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారు కూడా వేల తప్పులు చేస్తారు. ఈ అసంబద్ధ విద్యా విధానానికి తెలంగాణ రాష్ట్రం స్వస్తి పలకాలి. ఈ కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు తేవాలి. దానికోసం ఈ క్రింది అంశాలు పరిశీలించడం అత్యావశ్యకం.
1. ప్రీ ప్రైమరీ (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ), ప్రైమరీ (1 నుంచి 5తరగతులు) స్థాయిల్లో మాధ్య మికం ఏ భాష ఉండనవసరం లేదు. సామాన్యశా స్త్రం, సాంఘికశాస్త్రం, పరిసరాల విజ్ఞానం (ఎన్విరాన్మెంటల్సైన్స్), నీతి శాస్ర్తాలు (మోరల్ సైన్స్) సాధారణ జ్ఞానం (జెనరల్ నాలెడ్జ్) వంటి సిద్ధాంతపరమైన సబ్జెక్టులు 5వ తరగతి దాకా బోధించకూడదు. ఆ సమయంలో మంచి బోధనా పద్ధతులతో మూడు భాషలు, ఇంగ్లీషులో లెక్కలు కేవలం నాలు గు సబ్జెక్టులు చెప్పాలి. మాతృభాష, ఇంగ్లీషు, ఇంకొక ఐచ్ఛిక (ఆప్షనల్) భాష ఉండచ్చు. పదేళ్లలోపు చిన్న పిల్లలు ఎన్ని భాషలైనా నేర్చుకుంటారని మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు అనేక ఉదాహరణలతో నిరూపిస్తున్నా రు. భాష అనేది పర్సెప్షన్ (వినడం), అబ్జర్వేషన్ (స్థిరీకరించుకోవడం) అనే అయిదు సహజమైన, సులభమైన క్రియల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. జం తువులకు లేనిది మనిషికి ఉన్నదీ నేర్చుకునే నిపుణత.
అందుకే ఆరవ నెల నుంచి చిన్న పిల్లలు అత్త, అమ్మ, తాత అనే పదాలు ఉచ్చరిస్తారు. అయితే ఈ మూడు భాషలు నేర్పే ఉపాధ్యాయులకు ఆయా భాషల మీద పట్టు ఉండి, భాషా శాస్త్రజ్ఞులు చెప్పిన పద్ధతులు అనుసరిస్తే ఈ మూడు భాషలూ నేర్పించడం సులభమవుతుంది. మాతృభాష అంత సహజంగా పిల్లలు ఇంగ్లీషు, ఇంకోభాష నేర్చుకోగలుగుతారు. 2. పైన చెప్పిన సిద్ధాంతపరమైన సబ్జెక్టులు ఆరవ తరగతి నుంచి బోధిస్తే, అప్పటికి 7,8 ఏళ్లు భాషలు నేర్చుకుంటారు. కాబట్టి విద్యార్థులు ఎంత కష్టతరమైన అంశాన్నైనా అర్థం చేసుకుంటారు. భాష మీద పట్టుంటే భావంలో స్పష్టత ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు చేస్తున్నట్టు భాషా దారిద్య్రంతో కంఠోపాఠం చేసి పరీక్షలు పాసవనక్కరలేదు.
అసలు చిన్నప్పటి నుంచి భాషలో చదవడం,రాయడం నేర్ప క కంఠస్తం చేయిస్తే విద్యార్థుల జ్ఞాపకశక్తి మీద భారం పడి, వారి సృజనాత్మకత దెబ్బతింటుంది. అందుకే మూడు భాషలలో బేసిక్ స్కిల్స్ 5వ తరగతి వరకు నేర్పిస్తే, 6వ తరగతి నుంచి ఏ పాఠ్యాంశమైనా చదువుకుని, స్వయంగా పరీక్షల్లో రాయగలుగుతారు. ముఖమంత్రిగారు ఆశిస్తున్నట్టు మన విద్యార్థులకు సీబీఎస్సీ విధానం అమలుచేయాలంటే భాషా నిపుణత చాలా అవసరం. ముఖ్యంగా ఆ విధానంలో సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలు రాష్ర్టానికి సంబంధించినవి ఉండవు. భాషాపరంగా, విజ్ఞానపరంగా ఎక్కువస్థాయిలో ఉంటాయి. ఆ విధానంలో పరీక్షలు కూడా కేవలం పుస్తకంలో ఉన్నట్టు ఉండవు. విశ్లేషాణాత్మకంగా ప్రశ్నలుంటాయి.
అవి అర్థం చేసుకుని జవాబివ్వాలంటే భాషలలో నిపుణత చాలా అవసరం. అతేకాక సీబీఎస్సీ విధానంలో 4వ తరగతి దాకా 2 భాష లు, 5వ తరగతి నుంచి 8వ తరగతి దాకా 3 భాష లు, 9, 10 తరగతుల్లో రెండు భాషలు చదవాలి. ఈ పుస్తకాల్లోని భాష, విజ్ఞాన సంబంధమైన సైన్స్, సోష ల్ స్టడీస్‌లోని భాష చాలా హెచ్చుస్థాయిలో ఉంటుం ది. 6వ తరగతి నుంచి సీబీఎస్సీ విధానం అమలు చేయాలంటే విద్యార్థులకు ఈ మూడు భాషలలో ముఖ్యంగా ఇంగ్లీషులో చాలా మంచి స్థాయి ఉండా లి. 3. అన్ని పాఠశాలల్లో చదువుతో పాటు కో కరిక్యులర్ (లిటరరీ క్లబ్బుల ద్వారా డిబేట్, ఎస్సే రైటింగ్ వంటివి), ఎక్స్ట్రా కరిక్యులర్ (లలితకళలు - నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఆటలు వగైరా) యాక్టివిటీస్ తప్పనిసరిగా ఉండాలి.
కేవలం అడ్మిష న్స్ కోసం తల్లిదండ్రులను ఆకర్శించడం కోసం అవి ఉన్నాయని చెప్పడం కాదు. ఇతర ఉపాధ్యాయులలాగా వీరిని కూడా రెగ్యులర్ బేసిన్ మీద స్కూలులో చేర్చుకుని విద్యార్థులకి కళలు, ఆటలంటే ఉత్సాహం కలిగేటట్టు చేయాలి. 4. ప్రాథమిక దశ (5వ తరగతి దాకా) ఉపాధ్యాయులను ఆయా భాషలు మాతృభాషలుగా ఉండి భాషా నిపుణతలు ఉన్నవారిని తీసుకోవాలి. భాషా బోధనలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. ముఖ్యంగా ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులకు డిగ్రీలకంటే వారి ఉచ్చారణ, భాషమీద పట్టు ఉండటం చాలా అవసరం.
బోధనలో శిక్షణ తప్పనిసరిగా ఉం డాలి. 5వ తరగతి పూర్తయ్యేసరికి మూడు భాషల్లో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చేస్తే, పదవ తరగతి పూర్తయ్యేసరికి ఆయా భాషలు ధారాళంగా వస్తాయి. అప్పుడు +2లో ఇంగ్లీషులో, రెండవ భాష లో ఎడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్పించవచ్చు. 5.డిగ్రీ స్థాయికి వచ్చేసరికి ఇంగ్లీషు భాషా నిపుణత బాగా ఉంటే ఇతర దేశాలలో లాగా డిగ్రీ రెండేళ్ళు ఇంగ్లీషు ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్(ఇఎస్పి) కోర్సులు ప్రవేశపెట్టి బోధించవచ్చు.
అంటే ఏ ఫీల్డు వారికి ఆయా కోర్సులు తేలికవటానికి దానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉం టాయి. ఉదాహరణకు హోటల్ మేనేజ్మెంట్ చేసేవారికి ఆహారపు అలవాట్లు, క్లయింట్స్‌తో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న అంశాలు ఇంగ్లీషు కోర్సులో ఉంటాయి. ఇతర దేశాలలో చాలా భాగం ఇటువంటి కోర్సెస్ ప్రవేశపెట్టి విద్యార్థులకు తమ రం గంలో రాణించడానికి అవకాశం కల్పిస్తున్నారు. 6.చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం హైదరాబాదులోనూ, తొమ్మిది జిల్లా కేంద్రాలలోనూ స్కిల్ ట్రెయినింగ్ సెంటర్లు స్థాపించాలి.
వీటిలో గ్లోబల్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణనివ్వాలి. ఈ మధ్య ఒక సంస్థ చేసిన సర్వేలో ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో 83 శాతం, జనరల్ డిగ్రీ ఉన్నవారిలో 93శాతం యువతకు ఉద్యో గం తెచ్చుకోవటానికి తగిన స్కిల్స్లేవని తేలింది. తెలంగాణ యువతకు ఇటువంటి పరిస్థితి ఉండకూడదంటే ఈ పది స్కిల్స్ ట్రెయినింగ్ సెంటర్లు వెంటనే స్థాపించి శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. వీటి పాలన చూడటానికి హైదరాబాదులో ఒక అపెక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ట్రెయినింగ్ కార్యక్రమాలకు దాన్ని కేంద్రం చేయాలి. పది సెంటర్లు నెట్వర్కింగ్ చేసి అపెక్స్ సెం టర్నించి జిల్లాల వారికి కూడా శిక్షణ తరగతులు అందేటట్టు చేయాలి.
7 ఇప్పుడు ఇంగ్లీషు కోర్సుల కోసం పాఠశాలల, కళాశాలలో వాడుతున్న పుస్తకాలని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలి. కాంప్రెహెన్సివ్ ఎండ్గ్రేడెడ్ కోర్సులను 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా నిర్మించి, పాఠ్యాంశాలు ఈ తరానికి తగినట్టు, మన సంస్కృతి ప్రతిబింబించేటట్టు తయారు చేసుకోవాలి. ఇంగ్లీషు స్థాయి ప్రపంచీకరణకు తగినట్టుగా ఉండాలి. దీనికోసం వెంటనే ఇంగ్లీషు బోధనానుభవం, పరిశోధనానుభవం ఉన్న నిపుణులతో ఒక కమిటీ వేయాలి. ఇప్పటి నుంచీ పనిచేస్తే 2015 జూన్ నాటికి పాఠ్యాంశాలు తయారవుతాయి. సమీప భవిష్యత్తులో నిరుద్యోగ యువతను ఉద్యోగాలందుకునే అర్హులుగా తయారుచేయాలి.
ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ప్రజలు సౌఖ్యంగా, మంచి జీవనశైలితో తమ స్వంత ప్రభు త్వ సంరక్షణలో మనశ్శాంతితో బతుకుతారు. విద్య అనేది సంఘంలోని ప్రతి మనిషికి కావాలసిన సాధ నం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఉన్న ఒకే ఒక్క సాధనమది. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేది చదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు సంఘానికి విద్య అనేది ప్రగతి సాధించటానికి అతిముఖ్యమైన సాధనం. తెలంగాణ రాష్ట్రం ఈ రంగంలో అభివృద్ధిని సాధిస్తే, తనకున్న ప్రకృతి వనరులతో దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక ఆదర్శ ప్రాంతం అవుతుంది.
- ప్రొఫెసర్ కనకదుర్గ దంటు