పొంగి పొరలిన తెలంగాణ ప్రజాచైతన్యం


Sun,April 7, 2013 09:08 AM

అల్లం సోదరులకు కన్నతల్లి జన్మనిస్తే, కరీంనగర్ పోరాటాలు మరో జన్మనిచ్చాయి. ముగ్గురు సోదరులు (రాజయ్య, వీరయ్య, నారాయణ) సృష్టించిన సాహిత్యము, చేసిన విశ్లేషణ తెలంగాణ చైతన్యంలో అంతర్లీనంగా ఉండడమేగాక పరిణామక్షికమంలో అవి తమవంతు చారివూతక పాత్రను నిర్వహిస్తున్నాయి.నూతన సామాజిక సంబంధాలు ఏర్పడేదాకా ఆ సాహిత్యం అలా సజీవంగానే ఉంటుంది. చాలా ఇతర సందర్భాల్లో నేను పంచుకున్న ఫీలింగ్స్‌లో వ్యక్తులు సామాజిక చైతన్యాన్ని ఎంత ప్రభావితం చేస్తారో, సామూహిక చైతన్యం వ్యక్తులను ఎలా మలుచుకుంటుందో నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు కాని- వ్యక్తుల ప్రభావం సామాజిక చైతన్యీకరణ పైనా ఉంటుంది అని అంగీకరిస్తే, ఈ ముగ్గురు సోదరులు నిర్వహించిన పాత్ర నిస్సందేహంగా గొప్పదే.అల్లం రాజయ్య కథ-నవలల్లోనూ, అల్లం వీరయ్య గేయ సాహిత్యంలోనూ, నారాయణ కవిత్వం-రాజకీయ విశ్లేషణల్లోనూ.. ఇలా భిన్నవ్యక్తిత్వాలకి తగ్గట్టుగా భిన్నమైన సాహిత్య ప్రక్రియలు ఎన్నుకున్నారు. నారాయణ స్వయంగా ఆయుధం పట్టుకుని ప్రత్యక్షంగా ఉద్యమాలలో పాల్గొన్నవాడూ, రాజ్యహింసను అనుభవించిన వాడు. ఆయన వ్యాసాలు చదువుతుంటే, ఒక కవికుండే సున్నితమైన మనస్తత్వంతో కవిత్వమో వచనమో తేల్చుకోవడం సాహిత్యంతో గాఢ పరిచయం లేని నాలాంటి వాడికి కష్టంగానే ఉంటుంది. ప్రతి వ్యాసాన్ని- ఒకసారి దాని పొయటిక్ బ్యూటీకి, పొంగిపొరలిన ఆవేశం కొరకు.. మరోసారి విశ్లేషణ కొరకు చదివాను.నారాయణ చేతిలో భాష భావాలకి తగ్గట్టుగా ఒదిగిపోయింది. భాష ఆయన చెప్పినట్లు వినడం తప్ప ఆయన రచనకు ఎక్కడా పరిమితి కాలేదు, ప్రతిబంధకం కాలేదు. చదివేవాళ్లకి ఇలాంటి సుసంపన్నమైన భాషాజ్ఞానం మనక్కూడా వుంటే ఎంత బావుండునో అనిపిస్తుంది.ఈ వ్యాసాలు చాలా అంశాలనే చర్చించాయి. కానీ మూడో నాలుగో అంశాలు చాలా ప్రధానంగా ఆలోచనలని కుదిపి, అంతరంగానికి తగిలి కదిలించేలా ఉన్నాయి.

ప్రజాఉద్యమాలు, విప్లవ పోరాటాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ప్రపంచీకరణ దుర్మార్గం.. అరుదైన కొందరు వ్యక్తుల పాత్రపై నారాయణ అంచనా - ఈ కోవలోకి వస్తాయి. తన గ్రామం గురించి, తన అనుభవాల గురించి వ్రాసిన జ్ఞాపకాలలో ఒక రకమైన నోస్టాల్జియా కనిపిస్తుంది. విప్లవోద్యమాల గురించిన రచనల్లో ఇంద్ర దగ్గర ప్రారంభించి సమకాలీన విప్లవ ఉద్యమాన్ని కూడా స్పృశించినా, ఆయన ఇంకా రాయవల్సింది మిగిలే ఉందనిపిస్తుంది. ఇందు లో ఆరుట్ల జ్ఞాపకాలు దానితో ముడిపడిన త్యాగాల చరివూతను గుర్తుచేస్తాయి. అలాగే సమ్మక్క సారక్కల తిరుగుబాటు దాని విశిష్టతలను, తెలంగాణ పోరాట వారసత్వాన్ని ‘జనవనం మనాది’ గుర్తుచేస్తుంది. సెప్టెంబర్ 17 మీద వ్యాసం కనువిప్పు కలిగించేలా ఉంది. చరివూతలో ఒక సంఘటనని ఎలా చూడాలో, ఏ కోణం నుంచి పరిశీలించాలో ఆ వ్యాసం చదివితే తెలుస్తుంది. ఉద్యమ విశిష్టతలే కాక, దాని పెదధోరణులను- విభేదాలను, స్వార్థాన్ని, స్వప్రయోజనాన్ని, ‘అహం’వూపభావాన్ని- అంతే నిజాయితీగా ఎత్తిచూపాడు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పట్ల నారాయణకుండే కన్‌సర్న్, కమిట్‌మెంట్ అత్యంత బలంగా, ఆవేశపూరితంగా ఈ రచనల్లో కనిపిస్తాయి.నిజానికి ప్రధాన స్రవంతిగా ప్రవహించిన ప్రాణహిత అదే. దీంట్లో తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం, తెలంగాణ మీద జరిగిన అణచివేత, దోపిడీ, అంతర్గత సామాజిక సంబంధాలు.. ఇలా చాలా చాలా అంశాలున్నాయి. ఉదాహరణకు పాలమూరు జిల్లాలో బాలస్వామిని హత్య చేసిన పద్ధతి, ఇతర కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు, అలాగే ‘కరువు అరిగోస’లో ఆ జిల్లా అనుభవిస్తున్న వేదనామయ జీవితాన్ని హృద్యంగా చెప్పాడు. తెలంగాణ అభివృద్ధి ఎంత సంక్షోభంలో ఉందో, దేవాదుల ప్రాజెక్టు ఒక మృగతృష్ణగా ఎలా మారిందో వివరించాడు. తెలంగాణ ఉద్యమాన్ని భిన్నకోణాల నుండి చూసే పెద్ద కృషి ఉంది- కొన్ని వ్యాసాలు చాలా ఆవేశంతో రాసినవి, కొన్ని విపరీతమైన ఆవేదనతో రాసినవి, కొన్ని సమస్యల మూలాల్లోకి వెళ్లినవి.

ఈ ఉద్యమ క్రమంలో జరిగిన ఆత్మబలిదానాలు, వాటిని ఆపడానికి తన సృజనాత్మక శక్తినంతా ఉపయోగించి రాసిన మనసు కదిలించే వ్యాసాలున్నాయి. ఇక తెలంగాణ రాజకీయ నాయకుల మోసాలను, ద్రోహాన్ని, స్వార్థాన్ని, అవినీతిని,అబద్ధాలను, అవకాశవాదాన్ని, అమ్ముడుపోవడాన్ని ఉతికి పారేశాడు. ఇంతటి విమర్శనాత్మక వ్యాసాలు ఇంత సూటిగా, ఇంత వేడిగా వాడిగా ఇంతవరకూ ఎవరూ రాయలేదు. రాయలేక పోవచ్చుకూడా. ఇది ఒక రకంగా తెలంగాణను ప్రేమించిన ఒక ప్రతిభావంతమైన జర్నలిస్టు రాజకీయ నాయకులు చేసుకోవాల్సిన ‘ఆత్మవిమర్శ’ గురించి చేసిన శంఖారావం లాగుంది. మరీ నిస్సహాయంగా ఫీల్ అయినప్పుడు వ్యంగ్యంగా రాశాడు. అసహాయతని, ఆగ్రహాన్ని వ్యక్తీకరించే ఒక రచనా పద్ధతిగా వ్యంగ్యాన్ని వాడాడనిపిస్తుంది. ఈ వ్యాసాల్లో సోనియమ్మకు లేఖ, మిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటూ రాజశేఖర్‌డ్డికి రాసిన లేఖ హైలైట్స్‌గా ఉన్నాయి.తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రపంచీకరణ సందర్భం కూడా చాలా ముఖ్యం. నారాయణకి స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంది. కాబట్టే, తెలంగాణను కేవలం అస్తిత్వానికీ పరిమితం చేయకుండా, దాని విస్తృతిని కూడా చూడగలిగాడు. ప్రపంచీకరణ చేస్తున్న విధ్వంసాన్ని సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల మీద, రైతుల ఆత్మహత్యల మీద ఎలా ప్రతిఫలిస్తుందో చాలా ఆగ్రహంతో రాశాడు. అలాగే హైదరాబాద్ నగర జ్ఞాపకాలు రాస్తూ... పెరుగుతున్న రియల్ ఎస్టేట్ల వ్యాపారాన్ని, కాలుష్యంతో ముంచెత్తుతున్న నగర విధ్వంసక పారిక్షిశామిక విధానాలని నిరసిస్తూ ఎంతో హృదయవేదనతో రాశాడు. లోపిస్తున్న మానవీయ విలువల పట్ల కరుణతోనూ, కసిగానూ రాశాడు. ప్యారడైజ్‌లాస్ట్, ఆర్ట్స్ కాలేజీ జ్ఞాపకాల్లో ఈ ఆందోళన కనిపిస్తుంది. విశిష్ట వ్యక్తులుగా కాళోజీ, బాలగోపాల్‌ల గురించి రాస్తూ, వాళ్ల పట్ల నారాయణ తనకున్న గౌరవాన్ని బాగా వ్యక్తీకరించాడు. ‘ఇప్పుడు రక్షకుడు లేడు’ అని కాళోజీమీద, ‘మనకాలపు పరిపూర్ణ మానవుడు’ అని బాలగోపాల్ మీద రాసిన వ్యా సాల్లో శీర్షికనుంచి చివరి దాకా ఆ లోటుని, గౌరవాన్ని ఎంతో ఉన్నతంగా వ్యక్తీకరించాడు. అలాగే ‘పాటని బంధించడమా’అని గద్దర్ గురించి, ‘కన్నీటి కలత’ అని చుక్కారామయ్య గారి గురించి భావోద్వేగంతో రాశాడు. ప్రాణహితలో అల్లం నారాయణ వ్యక్తిత్వాన్ని, ఆయన ఆవేశ కావేశాలని మనం చూడడమే కాక, నడుస్తున్న చరివూతలోని ఒక సామాజిక, చారివూతక ఉద్యమ స్ఫూర్తిని కూడా చూస్తాం. వీటిని యాంత్రికంగా చదవలేరు. మనసు పెట్టి చదివితే నారాయణ ఆలోచనలతో, ఆగ్రహంతో, ఆవేదనతో.. కలిసో, కలబడుతూనో సాగవలసిందే. దేశవ్యాప్తంగా జర్నలిజం ప్రమాణాలు దిగజారుతూ, ఫాసిజంవైపు దేశం నెట్టబడుతున్న సందర్భంలో ఈ పుస్తకంతో తెలుగు జర్నలిజానికి నారాయణ అందించిన ప్రాణహితే కాదు, ప్రాణవాయువు కూడా.

పొఫెసర్ జి. హరగోపాల్
(‘ప్రాణహిత’ పుస్తకానికి రాసిన ముందుమాట)

37

HARA GOPAL