కన్నబిరాన్ మన మధ్య లేక అప్పుడే సంవత్సరం దాటుతున్నది. కాలం గడుస్తున్నా..కాలం నడక మీద ప్రభావం వేసిన మనిషి జ్ఞాపకాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆయన అరుదైన మనిషి కాబట్టే ఆ ఖాళీ మనం ‘ఫీల్’ అవుతూనే ఉంటాం. నేను వ్యక్తిగతంగా కన్నబిరాన్‌తో గడిపిన కాలం చాలా విలువైంది. ఆయనతో ప్రయాణం చేయడమైనా, మాట్లాడడమైనా అంత హాయిగా, సున్నితంగా ఉండేది కాదు. ఎప్పుడు అప్యాయంగా మాట్లాడతారో, ఆగ్రహపడతాడో, మెచ్చుకుంటాడో, ఎప్పుడు విరుచుకుపడతాడో అంత సులభంగా ఊహించలేం.అందుకే ఆయన జ్ఞాపకాలు ఎంతో విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నద ని తెలుస్తూనే ఉన్నా అది మెరుగు పడటానికి ఎవ్వరూ కలవక పోవడం మంచిదని అనడంతో, చూడాలని బలంగా ఉన్నా చూడకపోవడమే మంచిదని ఆ కోరికను అదుపులో పెట్టుకోవలసి వచ్చేది.నేను ఆయనను చివరిసారిగా కలిసినప్పుడు ‘ఏం ఊళ్లో లేవా? కనిపించడం లేదు’ అని అడిగాడు. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడే గుంటూరు చంద్ర కూడా గదిలోకి వచ్చాడు. ‘హక్కుల ఉద్యమం నుంచి బయటకి వచ్చి ఏవేవో భావ ప్రయోగాలు చేస్తున్నాడని, అలాంటి వాళ్లు విశ్వవిద్యాలయాలలో ఉండడం ఉచితమేమో’ అని నేనంటే, అంత అనారోగ్యంతో ఉన్నా ‘ఏం మీ ప్రొఫెసర్లలాగా ఏది పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వాణ్ణి కూడా ఉండమంటావా?’ అన్నాడు. ఎప్పుడైనా అనుకోకుండా ఆయన నుంచి ఫోన్‌కాల్ వచ్చే ది. ‘ఏం హరగోపాల్ ఏం చేస్తున్నావ్? మీ ప్రొఫెసర్లు రాజ్యాంగాన్ని చదవడం మానేశారు. రాజ్యాంగ విలువలను మరిచిపోయారు. విశ్వవిద్యాలయాలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నాయని పదే పదే గుర్తు చేసేవాడు. ఈ అసంతృప్తి, ఆగ్రహం ఆయన చివరి క్షణాలలో కూడా స్పష్టంగా కనిపించింది. ఆయనతో మాట్లాడినంతసేపు ఆయన తన ఆరోగ్యాన్ని గురించి తప్ప ఇతర సామాజిక విషయాలగురించే మాట్లాడారు.
కన్నబిరాన్‌ను వీలునప్పడుల్లా హైద్రాబాద్ విశ్వవిద్యాలయానికి పిలిచేవాళ్లం. ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడితే అది భావ సంభసంభాషణా ధోరణిలో, అనుభవైక్య ఆలోచనలతో నిండి ఉండేది. అది ఉపన్యాసంలా ఉండేది కాదు. చాలా స్ఫూర్తి దాయకంగా ఉండేది. మేమిద్దరం కలకత్తా యూనివర్సిటీకి వెళ్లినప్పుడు కూడా కన్నబిరాన్ దాదాపు రెండు, రెండున్నర గంటలు నిరాఘాటంగా తన అనుభవాలను పంచుకున్నాడు.‘లా’విద్యార్థులతో ‘పేదల తరఫున ఎందుకు పనిచేయాలో చెపుతూ, న్యాయాన్ని కాపాడడమంటే పేదల తరఫున వాదించడమే’ అని చెప్పాడు. మా విశ్వవిద్యాలయంలో ‘భారత రాజ్యాంగం-యాభై ఏళ్ల అనుభవం’ అనే అంశం మీద సెమినార్ నిర్వహించిన సందర్భంలో భారత రాజ్యాంగాన్ని సమీక్షించడానికి నియమించిన కమిటీ అధ్యక్షులు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్యను ఆహ్వానించాం. నేను, మా అప్పటి వీసీ, వెంకటాచలయ్య గారితో ఆడిటోరియంలో ప్రవేశిస్తున్నప్పుడు ఊహించని విధంగా మా విద్యార్థులు , ముఖ్యంగా దళిత విద్యార్థులు మమ్మల్ని ఘెరావ్ చేస్తూ ‘వెంకటాచలయ్య గో బ్యాక్’ ‘మనువాది వెంకటాచలయ్య గో బ్యాక్’ అని నినాదాలు చేయడంతో సెమినార్ నిర్వాహకుడిగా నేను ఒక్కసారి ‘షాక్’ తిన్నాను. విద్యార్థులతో నాకుండే సాన్నిహిత్యంతో సదస్సు జరగనివ్వాలని, వాళ్లకేమైనా అభివూపాయాలుంటే వాటిని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి కావలసిన సమయాన్ని కేటాయిస్తామని విజ్ఞప్తి చేశాను. ఎంతో సేపు వాదించి ఒప్పించిన తర్వాత మమ్మల్ని హాలులోకి వెళ్లనిచ్చారు. కాని హాలులో మళ్లీ నినాదాలు చేశారు. వెంకటాచలయ్య గారు ఉపన్యాసం ప్రారంభిస్తూనే హాలులో పెద్ద అల్లరి చేశారు. మళ్లీ వాళ్లను వేడుకొని, ఒప్పించి సభను జరిపేలా చూడటానికి చాలా శ్రమపడవలసి వచ్చింది. ఆ సభలో ఉన్న కన్నబిరాన్ దీనినంతా నిశితంగా గమనిస్తూనే ఉన్నాడు. తరువాత నేను ఆయనను కలిసినప్పుడు ‘శబాష్ హరగోపాల్, ప్రొఫెసర్ అంటే ఇలా ఉండాలి. మీ అధికారులు ఎక్కడ పోలీసులను పిలిపిస్తారోనని నేను అనుమానించాను. కానీ నువ్వు పడ్డ శ్రమ, విద్యార్థులను ఒప్పించిన పద్ధతి చాలా ప్రజాస్వామికంగా ఉంది అని అబ్బురపడ్డాడు.
కన్నబిరాన్ తనకు నచ్చిన పనులు చేస్తే ఎంతో అభిమానించే వాడు. అంతే బలంగా తనకు నచ్చని అంశాల పట్ల నిరసన తెలిపేవాడు. పాలమూరు కరువు వ్యతిరేక ఉద్యమం మీద ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తించినప్పుడు, సభ్యులందరినీ భయపెడుతున్నప్పుడు పని చేయడం సాధ్యం కాదే మో అని నిర్ణయం తీసుకోక తప్పనప్పుడు, ఆయనకు ఆ విషయం తెలిసి ఫోన్ చేశాడు. ‘మీ కరువు ఉద్యమాన్ని ఆపినట్లు విన్నాను. ఇది నిజమేనా?’ అని అడుగుతూ ‘ఈ నిర్ణయంలో భాగమైన నీవు కేవలం హరగోపాల్ అనే వ్యక్తివి కావు. నువ్వు పౌరహక్కుల సంఘంలో ప్రముఖమైన వాడివి. ఈ నిర్ణయం ప్రభావం చాలా బలంగా ఇతర అంశాలమీద ఉంటుంది’అని అన్నాడు. ‘పాలమూరులోని సభ్యులందరూ పనిచేయడం కష్టమని ,కుటుంబాలు చాలా ఆందోళనతో ఉన్నాయ’ని అన్నప్పుడు, ‘వాళ్ల పరిమితులు సరే, నీవు ఈ నిర్ణయంలో భాగమైతే దాని ప్రభావం చాలా ఉంటుంది’ అని హెచ్చరించాడు. ఎప్పుడైనా ఇద్దరమే ఉన్నప్పుడు ‘ఆ నిర్ణయం సరైంది కాదు’ అనే వాడు. నేను ఏదైనా జవాబు చెప్పినా ‘ పెరాలిసిస్ ఆఫ్ అనాలిసిస్ లేదా అనాలిసిస్ ఆఫ్ పెరాలిసిస్ ’అని అనేవాడు. వ్యాస్ ఉదంతం అప్పుడు బాలగోపాల్‌ను ‘కొంతకాలం తిరగవద్ద’ని అంటే ఆయన సలహాను కాదని సదస్సుకు వెళ్లాడని చాలా ఆవేదన పడ్డాడు. ఆగ్రహ పడ్డాడు. ‘నేను చెపితే వినకుండా రామనాథం , నర్రా ప్రభాకర్‌డ్డి ప్రాణాలను పోగొట్టుకున్నార’ని అనేవాడు. ఆయన ఏదైనా విషయం చెపితే తనమాట వినలేదని కాక తన అనుభవాన్ని కాదంటున్నారని ఫీల్ అయ్యేవారు.
కన్నబిరాన్ పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తే చాలా అద్భుతంగా ఉండేది. పోలీస్ యంత్రాంగంతో కోర్టులో అయినా, మరెక్కడైనా అలాగే ఉండే వాడు. ఒకసారి ఇద్దరం పోలీస్ అకాడమీకి సీనియర్ పోలీస్ అధికారులకు లెక్చర్ ఇవ్వడానికి వెళ్లాం. కన్నబిరాన్ ముందుగా మాట్లాడి కోర్టుకు వెళ్లవలసి ఉండే. లెక్చర్ ప్రారంభిస్తూ..‘జనరల్ డయర్ వారసులారా! ’ అని ప్రారంభించాడు. లెక్చర్ మొత్తం పోలీ స్ యంత్రాంగ చట్ట వ్యతిరేక చర్యల మీద సాగింది. ఆ తర్వాత నేను మాట్లాడాను. అందరూ అధికారులు కన్నబిరాన్ ఉపన్యాసం, నా ఉపన్యాసం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివిధ రకాల విమర్శలు చేశారు. కాని గుడ్డిలో మెల్ల అన్నట్లు కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ‘కన్నబిరాన్ మీద అలా విమర్శలు చేయడం సమంజసం కాదని, ఆయన అనుకుంటే.. ఆయనకుండే ప్రతిభతో కోట్లాది రూపాయలు సంపాదించే వాడని, మనం గౌరవించే లాయర్లందరూ ధనవంతుల వైపు, బలవంతుల వైపు మాట్లాడే వాళ్లని, వాళ్లందరితో పోలిస్తే కన్నబిరాన్ చాలా అరుదైన న్యాయవాది’అని అంటూ ‘కన్నబిరాన్ మీద చేసిన విమర్శలు ఆయన వ్యక్తిత్వాన్ని గాక, మన విలువలేమిటో తెలియజేస్తుంది’ అని అంటూ వాతావరణాన్ని అదుపులోకి తీసుకొచ్చాడు. అలా నిజాయితీ కలిగిన పోలీసు అధికారుల గౌరవాన్ని కూడా కన్నబిరాన్ పొందారు.
కన్నబిరాన్ చాలా హాస్యవూపియుడు. ఒక సందర్భంలో ‘మీ లాయర్లు కేసు ఓడినా గెలిచినా ఫీజు తీసుకుంటారు. కేసు ఓడిపోతే కె్లైంటుకు ఫీజు వాపస్ ఇవ్వాలి కదా’ అంటే.. నవ్వుతూ ‘మీ ప్రొఫెసర్లు విద్యార్థులు పరీక్షల్లో ఫేయిల్ అయితే జీతాలు వాప స్ ఇస్తారా’ అని నవ్వేవారు. పౌరస్పందన వేదిక శాంతి చర్చల సందర్భంగా సెక్ర ఒక మీటింగ్‌లో పీపుల్స్‌వార్ మీద నిషేధం ఎత్తి వేయాలనే అంశం చర్చకు వచ్చింది. ఈ అంశం మీద ముఖ్యమంత్రితో మాట్లాడటానికి వెళ్తూ శంకరన్ గారిని తనతో రావలసిందిగా అప్పటి హోం మినిస్టర్ జానాడ్డి కోరారు. ఇద్దరూ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లారు. వాళ్లు వెళుతూనే మీడియా వారు పెద్ద ఎత్తున మీటింగ్ హాల్లోకి చొచ్చుక వచ్చారు. మీడియా ఎంత ఒత్తిడి చేసినా ఎవ్వరం మాట్లాడలేదు. మీడియా వాళ్లు కన్నబిరాన్‌తో ‘ మీరు పౌరహక్కులలో పారదర్శకత ఉండాలి. మీడియాకు ఏం జరుగుతుందో చెప్పకపోవడం ఎంతవరకు సమర్థనీయం’ అని వాదించసాగారు. కన్నబిరాన్ స్పందిస్తూ ‘పారదర్శకత ఒక విలువే కాని... గుడ్డలు మార్చుకుంటున్నప్పుడు కూడా పార దర్శకత అంటే ఎలా?’ అని చాలా స్పాంటేనియస్‌గా అన్నప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు కన్నబిరాన్ అనిపించింది. ఇంత సమయస్ఫూర్తితో మాట్లాడడానికి అనుభవం, సాహిత్య లోతులు కావాలి.
స్నేహితుడుగా కన్నబిరాన్‌ను చూస్తే ఆయన స్నేహన్ని అతి గాఢంగా పొందిన వారు శంకరన్. వాళ్ళిద్దరి స్నేహితం చరివూతలో రాయగలిగిందే. కన్నబిరాన్ కొన్ని విషయాలలో శంకరన్‌తో ఏకీభవించే వారు కాదు. కానీ స్నేహం దగ్గర శంకరన్‌ను ప్రాణమివూతుడుగానే చూశారు. శంకరన్ కూడా కన్నబిరాన్ మీద అనుచితమైన మాటలు అననిచ్చేవారుకాదు. కన్నబిరాన్‌ను ఎవరో పేద మహిళ ‘ఆయన పేదవాళ్ల వకీలు’ అని అన్నప్పుడు అమితానందాన్ని పొందారు. ఆ సంఘటనను నాకు చెప్పుతున్నప్పుడు తనకు అలాంటి స్నేహితుడున్నడన్న గర్వం, గౌరవం కనిపించింది. శంకరన్ మరణించిన తర్వాత ఆయన మరణాన్ని కన్నబిరాన్‌కు చెప్పడానికి కుటుంబ సభ్యు లు చాలా మదన పడ్డారు. చివరకు ధైర్యం చేసి చెప్పడంతో స్నేహితుడి మరణం కన్నబిరాన్‌ను కుంగదీసింది. వీరిద్దరి స్నేహాన్ని గురించి సాహిత్యం గుర్తించి, లిఖించదగ్గ ఒక గొప్ప స్నేహితం. ఈ అరుదైన మనిషి చాలా మంది హృదయాలలో బతికే ఉన్నారు.
పొఫెసర్ హరగోపాల్
(నేడు కన్నబిరాన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా..)