కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి


Mon,February 10, 2014 12:31 AM

చ రిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నది. సంఘ్ పరివార్ జాతీయత, దేశభక్తిలాంటి నినాదాల ద్వారా వ్యాపించింది. దేశభక్తి అంటే ప్రజలందరిని ప్రేమించడం. కాని ఈ దేశభక్తి ఒక మత విశ్వాసంతో ముడిపడి ఆ మతానికి చెందినవారు, అలాగే ఆ మత పద్ధతులను అంగీకరించిన వారే ఈ పరిధిలోకి వస్తారని అంటున్నారు. ఆ మతానికి చెందని వారందరికీ దేశభక్తి లేనట్లే. ఆ మతానికి చెందిన వారు కూడా మత విద్వేషాలను వ్యతిరేకిస్తే, తమ మతాన్ని ధిక్కరించిన దేశద్రోహులే. ఈ మొత్తం అవగాహనలో చరిత్ర ప్రస్తావన ఉండదు. ఎక్కడైనా ఉన్నా అది వక్రీకరించిన చరిత్ర. వక్రీకరించడం ఈ ఆలోచనకు చాలా ప్రధా నం. ఈ చట్రంలో చరిత్ర, తత్వశాస్త్రం, నైతికత, సాహిత్యం అన్నింటికి నిర్వచనాలు భిన్నంగా ఉంటాయి.
కశ్మీర్ విషయంలో బీజేపీ దక్పథం చాలా స్పష్టంగానే ఉన్నది. ఈనేపథ్యంలో కశ్మీర్ సమస్యను చర్చింవలసి ఉంటుంది. రాజ్యాంగంలో కశ్మీర్‌కు నేడున్న స్వతంత్ర సార్వభౌమ ప్రతిపత్తిని రద్దు చేయాలంటున్నారు. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ జాతీయతా భావానికి అడ్డంకి అంటున్నారు.
జాతి రాజ్య భావన రెండు రెండున్నర శతాబ్దాల క్రితం ముం దుకు వచ్చిన ఒక రాజకీయ పెట్టుబడిదారీ ప్రయోగం. ప్రపంచ చరిత్రలో పెట్టుబడి విస్తరణ ఒక కీలక దశ దాటినప్పుడు దాని అవసరాల కోసం జాతిభావనకు పురుడు పోశారు. జాతి రాజ్యా ల్లో వలస ఆధిపత్యం నుంచి బయటపడి నిలదొక్కుకునే లోపల సామ్రాజ్యవాదం తన అవతారాన్ని మార్చుకొని నూతన ఆర్థిక విధానమనే ఆయుధాన్ని పట్టుకొని మళ్ళీ తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటున్నది.

ఈ ఆయుధం వెనక అణుబాంబులున్నాయి. జాతి రాజ్యం మళ్ళీ అస్థిరతకు గురికావడంతో సంఘ్‌పరివార్ మాట్లాడే జాతీయత, దేశభక్తి భౌతిక పునాదుల మీద కాక సాంస్కతిక పునాదుల మీద నిర్మించడం కోసం మతాన్ని, మత విద్వేషాన్ని ఉపయోగించుకుంటున్నది.సామ్రాజ్యవాదం ఈ మతోన్మాదాన్ని ఉపయోగించుకొని మతాల మధ్య మంటలు వేస్తుంటే ఆ మంటల్లో తన చలిని కాచుకుంటూ తమ ఆక్రమణకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి అడ్డంకిని ఈ మంటల్లోకి నెడుతున్నది. సామ్రాజ్యవాద దురాశకు మతోన్మాదానికి మధ్య ఏర్పడ్డ ఈ ముడిలో కశ్మీర్ ప్రజలు చిక్కుకున్నారు.
కశ్మీర్ ప్రజల దుస్థితిని ఈ నేపథ్యం నుంచి అవగాహన చేసు కుంటే తప్ప బషారత్ పీర్ మనతో పంచుకుంటున్న ఈ భయంకర అనుభవాలు మనకు అర్థం కావు. కశ్మీర్ ప్రజలది విషాదకరమైన, ఆవేదనాభరితమైన ఒక సుదీర్ఘ అణచివేత కథ. ఈ రచనను చదివిన ప్రతి వారికీ ఇందులోని ఘటనలు హదయపు అంచులకు తగిలి పాఠకుడి రాత్రిని నిషిద్ధ్ట రాత్రిగా మారుస్తాయి. నిద్ర లో పీడ కలలు వస్తాయి. రాజ్య స్వరూప స్వభావాలు, మతంలో దాగి ఉన్న మానవత్వం కాక దానవత్వం భయంకరంగా దర్శనమిస్తుంది.

బ్రిటిష్ వాడు మనకు వదిలిపోయిన సమస్యల్లో కశ్మీర్ ప్రధానమైంది. దేశ విభజన సందర్భంలో భిన్న రాజ్యాలకు తమ తమ పద్ధతిలో తమ భవిష్యత్తు నిర్మించుకునేలా అవకాశం కల్పించారు. అయితే దేశ విభజన అనివార్యం కావడంతో పాకిస్తాన్ మతకేంద్రిత రాజ్యంగా మారడానికి ఎంచుకున్నప్పుడు, దానికి భిన్నంగా భారతదేశం సెక్యులర్ లేక మతాతీత రాజ్యాన్ని ఎంచుకుంది. ఈ రెండు దేశాలలో ఏ దేశంలోనైనా చేరడానికి, లేదా స్వతంత్ర దేశంగా ఉండడానికి భిన్న ప్రాంతాలకు లేదా రాజ్యాలకు అవకాశం కల్పించినప్పుడు చాలా రాజ్యాలు భారతదేశంలో విలీనం కావడానికి మొగ్గు చూపించాయి, వీటన్నిటి విలీనానికి సర్దార్ పటేల్ నిర్వహించిన పాత్ర కీలకమైనది. కాని కశ్మీర్, హైద్రాబాద్, జునాగడ్‌ల విలీనం ఆయన శక్తికి మించిపోయింది. జునాగడ్‌ను పటేల్ తన చాకచక్యమంతా ఉపయోగించి విలీనం చేయగలిగాడు, కాని మిగతా రెండు ప్రాంతాల విషయంలో చాలా చిక్కులు, పరస్పర వైరుధ్య దక్పథాలు ఏర్పడ్డాయి. హైద్రాబాదు రాజ్యం విషయంలో రాజు ముస్లిం మతానికి చెందితే, మెజారిటీ ప్రజలు హిందువులు. కాని కశ్మీర్ విషయంలో రాజు హిందువు, మెజారి టీ ప్రజలు ముస్లింలు. దీంట్లో ఒక ధర్మ సందేహం ఉత్పన్నమైంది.

విలీనానికి రాజు అభిప్రాయమా లేక ప్రజాభీష్టం కీలకమా అని సందిగ్ధంలో పడ్డప్పుడు భారత ప్రభుత్వం హైద్రాబాదు విషయం లో ప్రజల మత సంఖ్యను, కశ్మీర్ విషయంలో రాజు అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో చారిత్రకంగా దీనిని న్యాయబద్ధమై న విలీన పద్ధతిగా గుర్తించడం కష్టం. కశ్మీర్ విషయంలో కశ్మీర్ రాజుతో ఒప్పందం చేసుకుంది. కశ్మీర్‌ను అలాంటి పద్ధతిలో కాక దేశంలోనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతంగా అంగీకరించా రు. ఆ స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించే నిజాయితీని ప్రదర్శించక పోవడం వలన సమస్య జటిలమౌతూ వచ్చింది. జటిలమైన సమస్యకు ప్రజాస్వామ్య పరిష్కారాన్ని వెతికే బదులు హైద్రాబాదు విలీనం కోసం ఉపయోగించిన పద్ధతినే కశ్మీర్ మీద ఉపయోగించారు. ఉదారవాది అనుకున్న నెహ్రూ, ఆయన ప్రభుత్వం దాదా పు 1950లలో సైన్యాన్ని పంపితే ఇప్పటి దాకా అంటే ఈ ఆరు దశాబ్దాలు కశ్మీరు భారత సైనిక పాలనలో ఉన్నట్లే!
నిజానికి కశ్మీర్ సంస్కతి చాలా విశిష్టమైనది. ఇక్కడ ఇస్లాం మతం మీద చాలా వరకు సూఫీ ప్రభావం ఉంది.

అలాగే హిందూమత సంప్రదాయాల ప్రభావం కూడా ఉంది. కశ్మీర్ మసీదులలో ప్రార్ధన అన్ని మసీదులలో వలె కాక, దేవాలయాలలోని భజన రూపంలో ఉంటుంది. అలాగే ముల్లాలను రుషి అని పిలుస్తారు. ఈ సంస్కతి భిన్న మతాల సమ్మిళితంగా ఉంటుంది. కాని కశ్మీర్‌లో మిలిటెంట్ ఉద్యమాలు ఉధతమౌతున్న కొద్దీ మతాన్ని చాలా పెద్ద ఎత్తున ఉపయోగించడం వలన సాంప్రదాయ ఇస్లాం ప్రభావం పెరిగి మతఛాందసం పెరిగింది. విముక్తి కోసం పోరాడుతున్నామని భావిం చే వారే మత ఛాందసంలోకి జారుకోవడం ఒక కశ్మీర్‌లోనే కాదు, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, ఇరాక్ లాంటి దేశాల అనుభవంలో చూడవచ్చు. కశ్మీర్ చరిత్ర ఇలాంటి మార్పులకు గురికాకుంటే ఆ ప్రాంతం సెక్యులరిజం భావనను సుసంపన్నం చేసేది. దేశానికి, బహుశా ప్రపంచానికి ఒక కొత్త నమూనాను అందించేది.
కశ్మీర్ ప్రజలు భారత దేశంలో భాగంగా ఉండడానికి కశ్మీర్ రాజు ఒడంబడికే కాక, కశ్మీర్ ప్రజల సంస్కతి, సెక్యులర్ పునాదుల మీద కొత్త జాతి రాజ్యాన్ని నిర్మిస్తామన్న నెహ్రు ఆలోచన, రాజ్యాంగ స్ఫూర్తికి దగ్గరగా ఉండడం వలన కశ్మీర్ భారత్‌తో ఉండడానికి ప్రోత్సహించాయి. కాని నెహ్రూ సెక్యులరిజం బలమై న విశ్వాసాల నుంచే వచ్చిందా లేదా అనే సందేహం కలుగుతుంది. నెహ్రూ తన జీవిత చరిత్రలో మతాన్ని మనిషి వదులుకుంటే ప్రత్యామ్నాయంగా మార్క్సిజం ఒక్కటే నిలబడగలదు అని వ్యాఖ్యానించాడు.

నెహ్రూ మార్క్సిస్టు కాదు, అలాగే మత తత్వవాదీ కాదు. ఈ రెండింటి మధ్య రాజీబాటను వెతికే క్రమంలో సెక్యులరిజానికి కావలసిన రాజకీయ ఆర్థిక పునాదులను వేయలేకపోయాడు. రాజ్యాంగం సెక్యులరిజాన్ని అంగీకరించినా అదొక జీవన విధానంగా మారడానికి కావలసిన పరిస్థితులు సష్టించుకోలేకపోవడం ఒక పెద్ద చారిత్రక వైఫల్యం.
ఈ రాజకీయార్థిక నేపథ్యంలో బషారత్ పీర్ కశ్మీర్‌లో నిషిద్ద రాత్రి పుస్తకాన్ని చదవ వలసి ఉంటుంది. మొత్తం పుస్తకంలో పైన చెప్పిన అంశాలు ఎక్కడా ప్రత్యక్షంగా ప్రస్తావనకు రావు. కాని బషారత్ పీర్ అనుభవాల వెనక లేదా అంతర్లీనంగా ఈ అంశాలు పని చేస్తుంటాయి. ఈ రచనను బషారత్ పీర్ ఆత్మకథగా చూడొ చ్చు, భారత ప్రజాస్వామ్య ఫెడరల్ వ్యవస్థ వైఫల్యంగా చూడొచ్చు. సెక్యులరిజపు దివాళాకోరుతనంగా చూడొచ్చు, గత ఆరు దశాబ్దాల కశ్మీర్ పోరాట చరిత్రగా చూడొచ్చు, ఒక అందమైన ప్రదేశపు ప్రజ ల ఆరాటంగా చూడవచ్చు.

ఇందులో రాజ్య స్వభావాన్ని చూడొ చ్చు. ఒక సజనాత్మక సున్నిత మనిషి అనుభవాలనీ, స్పం దననీ, చారిత్రక స్పహనీ, కళాత్మకంగా ప్రజల బాధలని చెపుతూ పాఠకుడిని కుదిపి వేసే శక్తి ఈ రచనకుంది. ఈ పుస్తకాన్ని చదివి మన హదయం వేగంగా కొట్టుకోక పోయినా, మేధస్సు వేదనకు గురికాక పోయినా, మనలో ఏదో లోటు బలంగా ఉందని భావించవలసి ఉంటుంది. సాహిత్యపరంగా, అలాగే చారిత్రక, రాజకీయ ఆర్థిక విశ్లేషణ ప్రమాణాల పరంగా ఈ రచన ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతుంది.
బషారత్ పీర్ వత్తిపరంగా జర్నలిస్టు. జర్నలిజం ఏ పాతాళ లోకంలో ఉందో మనందరికి తెలుసు. జర్నలిస్టులు మసాలా వంటలు తయారు చేసే నలభీములుగా మారారు. వాస్తవాలని, సామాజిక సత్యాలని, ప్రజల బాధలని మాసాలాగా మార్చి వార్తా పత్రికల్లో, టీవీ ఛానెళ్ళలో మనకు వడ్డిస్తున్నారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమపడే మయ సభను మనకు చూపిస్తున్నారు. ప్రసార సాధనాల మీద ఆధారపడే మధ్య తరగతికి కశ్మీర్ అంటే దేశం నుండి విడిపోవడానికి మిలిటెంట్లు చేస్తున్న పోరాటంగా, వారిని విచ్ఛిన్నకారులుగా చూపిస్తున్నారే తప్ప, భారత సైనిక బలగాలు ఏం చేస్తున్నాయో ఆలోచించాలి. పరిస్థితి ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నలు అడగకపోతే కశ్మీర్ చరిత్ర, అక్కడి పోరాటాల నేపథ్యం మనకు అర్థం కావు. అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేనివారు, కశ్మీర్‌ను హిందూమతోన్మాద కళ్ళతో చూసే వారు, ఈ పుస్తకం చదవవలసిన అవసరం లేదు. వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటేనే చదవండి.


కశ్మీర్ భారతదేశంలో భాగంగా ఉండాలి అని భావించే వారి మీద ఈ రచన చాలా భారాన్ని వేస్తుంది. రచనలో కశ్మీర్ మిలిటెం ట్ల తీవ్ర చర్యల మీద విమర్శ ఉంది. వాళ్ళు చేసే పనులన్నింటినీ సమర్థించే రచన కాదిది. ఒక చారిత్రక పరిణామ క్రమంలో, భారత దేశం తనను తాను జాతి రాజ్యంగా నిర్మించుకుంటున్న సందర్భంలో, ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలని, స్వేచ్ఛామయ కోరికను చాలా లోతులకు వెళ్లి అర్థం చేసుకుని, ప్రజల పట్ల బాధ్యతతో రాసిన రచన ఇది. ప్రజలని ప్రజాస్వామ్య కళ్ళనుండి చూడవచ్చు లేదా ప్రజాస్వామ్యాన్ని ప్రజల కళ్ళనుండి చూడవచ్చు. ఈ రచన ఆ రెండు పనులు చేసింది. అందుకే కశ్మీర్ ప్రజల హదయ వేదనని, ఒక రాజ్య పరుషత్వాన్ని అమానుషత్వాన్ని, అహంకారాన్ని ప్రజల కోణం నుంచి పట్టగలగిన ఒక అరుదైన రచన ఈ నిషిద్ధ రాత్రి.
2014 ఫిబ్రవరి 10, సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిషిద్ధ రాత్రి పుస్తకావిష్కరణ సభ..
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన
జరిగే సభలో కె.రామచంద్రమూర్తి,
పొఫెసర్ హరగోపాల్, ఎన్. వేణుగోపాల్,
అల్లం నారాయణ, జహీర్‌అలీఖాన్,
పుస్తక రచయిత బషారత్ పీర్ ప్రసంగిస్తారు.


ఈ రచన ముగింపు వాక్యాలు చాలు దీనిని అర్థం చేసుకోవడానికి. బషారత్ పీర్ మాటలలోనే.. ప్రయాణం ముగియలేదు. అది ఎప్పటికీ ముగియదు. 1990 నుంచి ఆకాశం ఎర్రగా, పగళ్లు భయంతో, రాత్రులు కర్ఫ్యూతో కొనసాగుతున్నాయి. ఆ వాతావరణంలో అప్పుడు పధ్నాలుగేళ్ల వయసున్న నేను మత్తెక్కించే స్వాతంత్య్ర నినాదాలతో, సరిహద్దు మంచులో ప్రమాదకరమైన ప్రస్థానాల కథలు విం టూ, ఒక కొత్త ప్రపంచం రాబోతుందని నిజాయితీగా నమ్ముతూ ఉత్తేజితుడినై ఉండేవాడిని. నేను కశ్మీ ర్ వదిలాను, ఎదిగాను. ఉద్యోగంలో చేరా ను, దాన్నీ వదిలాను. వెనక్కి వచ్చాను. పాశవికత, ధైర్యం, ప్రేమ,ద్వేషం,విశ్వాసం,నష్టం,చివరకు ఇంకా నమ్మకంతో ఉన్న కథలు విన్నాను, జ్ఞాపకం పెట్టుకున్నాను. కశ్మీర్, నేను ఇద్దరం మారాము. నా యవ్వనారంభంలో నేను వదిలిపెట్టిన విప్లవ ఉత్తేజిత కశ్మీర్, ప్రస్తుతం పాశవికతను ఎదుర్కొంటూ, అలసిపోయిన అనిశ్చితితో ఉన్న ప్రజల భూమిగా మారింది. నేనిప్పుడు ముప్పయి ఏళ్లకు దగ్గరలో ఉన్నాను. పెద్ద వాడినైపోయా ను. వీథుల్లో నుండి ఘర్షణ వెళ్లిపోవచ్చు. కాని అది ఆత్మల్లో నుంచి వెళ్లదు...
- ప్రొఫెసర్ జి. హరగోపాల్
(నిషిద్ధరాత్రి పుస్తకానికి రాసిన
ముందు మాట నుంచి కొన్ని భాగాలు)1010

HARA GOPAL

Published: Thu,January 23, 2014 05:01 AM

అన్ని పార్టీల తర్వాతే టీపై కాంగ్రెస్ నిర్ణయం: సీఎం

హైదరాబాద్: తెలంగాణపై అన్ని పార్టీలు నిర్ణయం తమ నిర్ణయం ప్రకటించిన తర్వాతే తమ కాంగ్రెస్‌పార్టీ అత్యున్నత విభాగం సీడబ్ల్యూసీ నిర్ణయ

Published: Thu,September 27, 2012 12:39 AM

తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్30

దశాబ్ద కాలంలో తెలంగాణ చూసిన భిన్నమలుపులలో 2012 సెప్టెంబర్ 30 ఒక ప్రధానమైన మలుపుగా నిలిచిపోయేలా ఉద్యమం జరగాలి. జిల్లాలన్నింటిలో ర

Published: Thu,September 20, 2012 12:33 AM

నిండమునిగిన వాడికి చలేమిటి?

చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నది. తోటి ఇతర పార్టీలు అ

Published: Sat,November 12, 2011 10:50 PM

కాళోజీ బతికుంటే...

చరిత్ర గమనంలో, సమాజ పరిణామంలో వ్యక్తుల పాత్ర ఎంత ఉంటుందనేది నిరంతరంగా చర్చనీయాంశమే. చరివూతను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తు