జయశంకర్ సర్‌తో కరచాలనం!


Fri,June 22, 2012 12:09 AM

ఆంధ్రుల దినపత్రికలను పెట్టుబడికీ కట్టుకథకు పుట్టిన విష పుత్రికలుగా శ్రీ శ్రీ అభివర్ణించారు. ఆంధ్రుల పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయని, కొండలు, గోల్కొండలు దాచేస్తాయని చెప్పారాయన. ఇది దాదాపు అర్ధ శతాబ్దం కిందిమాట. ఇప్పుడు గోల్కొండలు దాచే స్థాయి నుంచి దోచే స్థాయి దాకా తెలుగు పత్రికారంగం ఎదిగిపోయిందని ప్రముఖ తెలంగాణవాది సీనియర్ జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి అంటున్నారు. తెలుగు మీడియా తీరుతెన్నులను మాట్లాడిన ఒక సందర్భంలో ఇప్పటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు, వాటి యాజమాన్యాలు గోలుకొండ మొదలు, హనుమకొండ, గీసుకొండ, మణికొండలను మింగేసిన అనకొండలు అని దానికొక పేరడీ చెప్పారు. డబ్బున్న మారాజులు, రాజకీయ వ్యాపారులు తమ స్వేచ్ఛ కోసం పత్రికలను, ప్రసార మాధ్యమాలను పెట్టుకుంటున్న ఈ రోజుల్లో ‘నమస్తే తెలంగాణ’ ప్రజల స్వేచ్ఛ కోసం నిలబడింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, తెలంగాణ ఉద్యమ కరదీపికగా మొదలైన ఈ పత్రిక విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఒక పత్రిక సాధించిన విజయాన్ని చెప్పడానికి ఇప్పుడు పాతకాలపు సూక్తులు వెతుక్కోవాల్సిన పనిలేదు. ‘నమ స్తే తెలంగాణ’ను చూపిస్తే చాలు. నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకై నిలబడి, తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది నమస్తే తెలంగాణ.

ఉద్యమాలకు ఊతమిచ్చే పత్రికలు జాతీయోద్యమ కాలంలో ఉండేవని చదువుకున్నాం. ఇప్పుడు ‘నమస్తే తెలంగాణ’ను చూస్తున్నాం. ప్రభుత్వ సహకారం లేకుండా, ఉద్యమానికి ఊపిరిగా పత్రికను నిలబెట్టడం కత్తిమీద సాము! ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, నిర్వాహకులకు, సంపాదక వర్గానికి, పాఠకులకు అభినందనలు.

ఈ ఏడాది కాలం ‘ఘంటాపథం’ కూడా కొనసాగింది. ఇంతకాలం కొనసాగుతుందని నేననుకోలేదు. చదవడం, రాయడం పక్కనబెట్టి టీవీ చర్చలకు, మీటింగులలో మాట్లాడడానికే పరిమితమైపోయిన ఈ దశలో వారం వారం కాలం నిర్వహిస్తానని నేననుకోలేదు. ‘నమస్తే తెలంగాణ’ ప్రారంభానికి చాలా ముందు నుంచే పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గం నా కాలం పత్రికలో ఉండాలని అడిగారు. చాలారోజులు ఆలోచించాక సరే అన్నాను, కానీ నిరంతరాయంగా రాయగలనో లేదో అని భయపడ్డాను. కానీ మిత్రులు అల్లం నారాయణ, కట్టా శేఖర్‌డ్డి పట్టుబట్టి మరీ రాయించారు. దానికి ‘ఘంటాపథం’ అని పేరుపెట్టారు. ఈ ఏడాది కాలంలో కాలం ఎలారాసిన, ఏం రాసి నా, ఎంత రాసినా అచ్చు వేశారు. వారికి ధన్యవాదాలు. రాస్తే తెలంగాణ మీదే రాయాలనుకున్నాను.

తెలంగాణ ఉద్యమం ఆటుపోట్లలో ఉన్న ఈ ఏడాదిలో తెలంగాణ గురించే ప్రతివారం రాయడం నాకు కూడా కత్తి మీద సాము అయ్యింది. ఒకటి రెండు మినహాయించి అన్ని వ్యాసాలూ తెలంగాణ గురించో, తెలంగాణకు పనికొచ్చే విషయాల గురించో రాశాను. దానికి స్ఫూర్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తన జీవి త కాలమంతా తెలంగాణ గురించి మాట్లాడిమాట్లాడి తెలంగాణకు శాస్త్రీయ ప్రతిపత్తిని, సిద్ధాంత నిబద్ధతను కల్పించిన మేధావి ఆయన. నమస్తే తెలంగాణలో నేను రాసిన మొదటి వ్యాసం ‘మన తరం మార్గదర్శి’ అని జయశంకర్ సార్ గురించి, ఆయన మాలాంటి వారికి చూపిన మార్గం గురించి. ఆయనను జర్నలిస్టుగా అనేక సార్లు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. కరీంనగర్ జీవగడ్డ పత్రిక మొదలు, ఉదయం ఆ తరువాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఇన్‌సైడర్, టీ న్యూస్ కోసం ఇట్లా అనేక గంటలపాటు ఆయనతో ఏక బిగిన మాట్లాడాను. తెలంగాణ సాధన జయశంకర్ కల, అది నెరవేరకుండానే వెళ్ళిపోయారు. ఆ కల నెరవేర్చే కర్తవ్యాన్ని తెలంగాణవాదులకు గుర్తుచేయడం కోసం ఈవారం ‘ఘంటాపథం’లో జయశంకర్ సర్‌తో కరచాలనం...

మీ తెలంగాణ కల నెరవేరుతుందని అనుకుంటున్నారా..?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల కచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు ఆ దశలోనే ఉంది. ఇప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చింది. లోనికి ప్రవేశించాలి. లోనికి ప్రవేశించకుండా కొన్ని శక్తులు అడ్డు పడుతున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు. యాభై అయిదు సంవత్సరాల నుంచీ ఇవే శక్తులు అడ్డు పడుతూనే ఉన్నాయి. అధిగమించాం. ఇప్పుడు కూడా అధిగమిస్తాం అనే విశ్వాసం నాకుంది.

ఇంకెంత కాలం గుమ్మంలో నిలబడాలి? తలుపులు తెరుచుకోకపోతే బద్దలు కొట్టడమే మార్గమా..?
తలుపులు త్వరలోనే తెరుచుకుంటాయని నాకనిపిస్తోంది. ముమ్మాటికీ పోరాటం ద్వారానే అవి తెరుచుకుంటాయి. పోరాటం సాగుతుంది కదా. 1968 -69లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుం ది అన్న స్థితి వచ్చి వెనక్కి వెళ్ళింది. ఈ సెట్‌బాక్ ఎప్పుడు వచ్చినా ఆకాంక్ష ఆరిపోలేదు. ఉద్యమానికి విరామాలు వచ్చినాయి తప్ప విరమణ రాలేదు. ఇంకా జాప్యం జరిగినా ఉద్యమం రూపు మారుతుందేమో తప్ప విరమణ మాత్రం రాదు. పరిస్థితిని బట్టి ఉద్యమం కొత్తరూపం తీసుకుంటుంది. అదే తలుపులను బద్దలుకొట్టే సాధనం కావొచ్చు.
ఒక రాష్ట్రానికి ఇంత సుదీర్ఘ పోరాటం అవసరమా..?
రాష్ట్ర సాధనకోసం యాభై ఏళ్ళ పోరాటం సుదీర్ఘమైన పోరాటంగానే కనబడుతుంది. కానీ ఇంతకంటే ఎక్కువకాలం పోరాడిన రాష్ట్రాలు కూడా ఉన్నా యి. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి,జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడడానికి ఇంతకంటే ఎక్కువ పోరాటమే జరిగింది. మనకు రాజకీయంగా మెజారిటీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రధానమైన సమస్య ఏమిటంటే ఉమ్మడి రాష్ట్రంలో చేరిన తరువాత అసెంబ్లీలో, పార్లమెంటులో తెలంగాణ సభ్యుల సంఖ్య తగ్గింది. అవతలి వాళ్ళు మెజారిటీలో ఉన్నారు. రాజకీయం గా వాళ్ళు బలవంతులు. రాష్ట్ర స్థాపనను వ్యతిరేకించే శక్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సంఖ్యా పరంగా బలంగా ఉన్నాయి కనుకనే ఈ అవరోధాలు. తెలంగాణ ఆంధ్రవూపదేశ్‌లో భాగంగా లేకపోతే ఏమవుతుందో వాళ్లకు తెలుసు. అక్కడి వనరుల లేమి, నీటి, నిధుల కొరత, రాజధాని సమస్య ఇవన్నీ ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు కారణం. ఇప్పుడూ అవే కారణాలు అడ్డంకులకు మూలం. అందుకే సుదీర్ఘపోరాటం. రెండోది- రాష్ట్ర ఏర్పాటు బేషరతుగా జరగలేదు. ఆంధ్రవూపదేశ్ శాశ్వతం అని కూడా అనుకోలేదు. కుదరకపోతే విడిపోవచ్చని నెహ్రూ గారు ఆనాడే చెప్పారు. అనుమానాలు ఉండడం వల్లే అనేక షరతులతో కలిపారు. ఒప్పందాలు చేశారు. ఆ షరతులను, ఒప్పందాలను ఉల్లంఘించారు. కనుక ఇక కలిసి ఉండవలసిన అవసరం లేదు.

తెలంగాణను వ్యతిరేకిస్తున్న వాళ్ళ ఉద్దేశ్యాలు ఏమి ఉంటాయి?
ఇప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలో ఉండే సామాన్య ప్రజానీకానికి రాష్ట్ర విభజన పట్ల పెద్దగా విముఖత లేదు. ఇదంతా కొన్ని శక్తులు చేస్తున్నపని. మొదటగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ వాళ్ళు డెవలప్ చేసుకున్న ‘వెస్టెడ్ ఇంట్రెస్ట్’లు. వాళ్ళ పలుకుబడికి ఇది అవసరం. ముఖ్యంగా రాజకీయనాయకులకు ఇది బలంగా ఉంది. రెండోది పెట్టుబడి దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్థం. ఇది తాత్కాలికంగా సృష్టించిన కృత్రిమ వ్యతిరేకత. అంతే తప్ప నిజమైన వ్యతిరేకత ఉందని నేననుకోను.
వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టామంటున్నారు, ఇంతగా నగరాన్ని అభివృద్ధి చేసి వదిలేసి ఎలా వెళ్తాం అంటున్నారు.
ఇప్పటి తెలంగాణ ఉద్యమానికి ఆ స్పష్టత ఉంది. తమ వ్యాపార అభివృ ద్ధి కోసం పెట్టుబడులు పెట్టిన వాళ్ళను ఎవరు పొమ్మంటున్నారు? అలా అనడం లేదే. ఒక్క ఆంధ్రా, రాయలసీమ మాత్రమే కాదు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రా వాళ్ళకంటే ముందుగా వచ్చిన వాళ్ళలో మహారాష్ట్రులు గుజరాతీలు ఉన్నారు. తమిళులు ఉన్నారు, బెంగాలీలు ఉన్నారు. వీళ్ళెవరూ తెలంగాణ వద్దనో, హైదరాబాద్ మాదనో అనడం లేదే! ఒక్క ఆంధ్రా వాళ్ళకున్న అభ్యంతరం ఏమిటి? అలాగని హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్ళు అంతా అలా మాట్లాడడం లేదు. కొందరు అవకాశవాదులు ఆ వాదన తెస్తున్నారు. అసలు వాళ్ళు వచ్చింది వ్యాపారం చేసుకుని బాగుపడడానికా? మన మీద పెత్తనం చేయడానికా? వ్యాపారం చేసుకుని బాగుపడతామంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ఈదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఆ స్పష్టత ఉద్యమానికి ఉంది. మాపై పెత్తనం చేయడం పట్లనే మా అభ్యంతరం. హైదరాబాద్ ఒక రాష్ట్ర రాజధాని. అది ఎక్కడ, ఎవరికి ఉండాలని వాళ్ళెలా చెపుతారు. తెలంగాణవాదులు ఎవ్వరినీ పొమ్మనడం లేదు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, బతుకుదెరువు కోసం ఉంటున్నవాళ్ళు ఉండొచ్చు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం అని చెప్పడం పచ్చి అబద్ధం. విలీనం నాటికే హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉంది. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో బెంగుళూరు తరువాత ఆరో స్థానానికి పడిపోతోంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పేరుతో తెలంగాణ నాలుగైదు జిల్లాలను కలిపి నగరాన్ని పెంచిండ్రు. అది యెట్లా చేసిండ్రు. హైదరాబాద్ చుట్టూ ఒక వృత్తలేఖిని పెట్టి వృత్తం గీసినట్టు హైదరాబాద్ చిత్రపటాన్ని మార్చిండ్రు. భూమిని విజయవాడ నుంచి లేదంటే కడప నుంచి తెచ్చి ఇక్కడ పెట్టలేదు కదా!. భూమి మనది, వనరులు మనవి, మనుషులం మనమే అయినప్పుడు హైదరాబాద్ మాత్రం వాళ్ళది ఎలా అవుతుం ది. అర్థంలేని వాదనలతో హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి వేరుచేయాలని చూస్తే అది సాధ్యం కాదు. వాంఛనీయం అంతకన్నా కాదు. అలాంటి దుస్సాహసం చేస్తే ఇక్కడ అంతర్యుద్ధం రాక తప్పదు.

హైదరాబాద్ ఉమ్మడి సొత్తు అంటున్నారు..
నిజమే. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలని, కేంద్ర పాలిత ప్రాంతం గా ప్రకటించాలని, స్వతంత్ర ప్రతిపత్తి అని కొందరు చాలా చాలా మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఎందుకు? ప్రజల కోసమా? పెట్టుబడుల కోసమా? ఒకవేళ ఉమ్మడి రాజధాని అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు రాజధానికి రావాలంటే వేరే రాష్ట్రం (తెలంగాణ)లో కనీసం 250 కిలో మీటర్లు ప్రయాణం చేసి రావాలి. కామన్ మ్యాన్‌కు ఈ అవస్థ ఎందుకు? ఇటువంటి వాదనే బొంబాయి విషయంలో మహారాష్ట్ర, గుజరాత్‌ల మధ్య వచ్చింది. గుజరాత్ వాళ్ళు ఇదే వాదన తెచ్చారు. బొంబాయిని మేం అభివృద్ధి చేశాం కాబట్టి మాకు వాటా కావాలని పట్టుబట్టారు. దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని, ఉమ్మడి రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. దానికి అంబేద్కర్ ఇలా స్పందించాడు. ‘ఒక దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని దానిని రెండు గదులు ఎక్కువచేసి విస్తరించి హంగులు, రంగులు వేసి అక్కడే వ్యాపారం చేసుకుంటే అంత మాత్రాన ఓనర్లు అయిపోతారా! కాదు వాళ్ళు కిరాయిదార్లే!’ రెండవ మాట ఏమన్నాడంటే ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే నగరానికి నీళ్లు ఎక్కడి నుంచి రావాలి? కరెంటు ఎక్కడి నుంచి ఇస్తారు? ఉమ్మడి రాజధానికి మహారాష్ట్ర జల, విద్యుత్ వనరులు యెట్లా వాడుతారు? ఇవి నా మాటలు కాదు అంబేద్కర్ అన్నవి. అదే విధంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమో, ఉమ్మడి రాజధానో అయితే నీళ్ళు కృష్ణా నది నుంచి రావాలి. కృష్ణ నీళ్ళు రావాలంటే నల్లగొండ, మహబూబ్‌నగర్ దాటి రావాలి. గోదావరి అయితే తెలంగాణ అంతా దాటి రావాలి. హైదరాబాద్ తెలంగాణది కానప్పుడు నీళ్లెందుకివ్వాలి? ఒకవేళ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తే ముందుగా ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, బొంబాయిలను చేసి మనదగ్గరికి రమ్మని అడగాలి. అవన్నీ ఉమ్మడి సొత్తుతో అభివృద్ధి చెందినవే. అయినా ఏ ప్రాతిపదికన హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు? రాజధాని పెట్టుబడిదార్ల కొరకా, ప్రజల కొరకా..! హైదరాబాద్ ఎప్పుడైనా ఎప్పటికైనా తెలంగాణదే!
రాయలసీమ నేతలు తమకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు
ఇవన్నీ అర్థంలేని వాదనలు. రాయలసీమ నేతలు తాము కోస్తా వారితో వేగలేం, కాబట్టి అందరం కలిసి ఉండాలంటున్నారు. ఇందులో ఏమైనా అర్థం ఉందా. మొదటినుంచీ ఒక్కటిగా ఉన్న మీరే వేగలేకపోతే మేమెందుకు వేగాలి. ఆ భయంతోనే వాళ్ళు కొందరు గ్రేటర్ రాయల సీమ అంటున్నారు. దానితో మనకు సంబంధం లేదు. ప్రత్యేక రాయలసీమ కావాలనుకుంటే అది అక్కడి ప్రజల ఇష్టం. దానికి తెలంగాణకు ఎటువంటి పొత్తు లేదు. మనం అడుగుతున్నదేంటి ?1956 నవంబర్‌కు ముందున్న పరిస్థితిని పునరుద్ధరించమని. అప్పటికే వాళ్లకు ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికొక రాజధాని ఉంది. మనకొక రాజధాని, రాష్ట్రం ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలను పునరుద్ధరించడం తక్షణ కర్తవ్యం. తరువాత ఏమిటన్నది వాళ్ళలో వాళ్ళు తేల్చుకోవాలి. రాయలసీమ వాళ్ళు తెస్తున్న మరో సమస్య నీళ్ళు. రాష్ట్రం విడిపోతే నీళ్ళ పంపిణీకి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అవి రాష్ట్రాల మధ్య జలవనరుల పంపిణీ చేస్తాయి. పంజాబ్, హర్యానాల మధ్య అనేక నదులున్నాయి. వాటిని పరిష్కరించినట్టే ఇక్కడ కూడా పంపిణీ చేస్తారు. దాన్ని తెలంగాణ గౌరవిస్తుంది.
మీరు సోనియాగాంధీతో మాట్లాడి ఉంటారు. కాంగ్రెస్ మైండ్‌లో ఏముంది?
వారి మైండ్‌లో ఏముందో చెప్పలేను, కానీ వారు ఏవిధంగా స్పందించారో చెప్పగలను. దాన్ని బట్టి చాలా విషయాలు అర్థమౌతాయి. నేను సోనియాగాంధీతో చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. నా అంచనాలో ఆమె చాలా పాజిటివ్. కాబట్టే మేం చాలాసార్లు కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపాం. డిస్క స్ చేశాం. కొంత నమ్మకం కూడా కలిగింది. మరి సోనియా గాంధీ సుముఖం గా ఉంటే ఎందుకు రాష్ట్ర ఏర్పాటు జరగలేదు? అంటే ప్రపంచానికి తెలుసు. కేవలం రాజశేఖర్‌డ్డి వల్లే మొదట అది ఆగిపోయింది. మొదటి అయిదేళ్ళు రాజశేఖర్‌డ్డి అడ్డుపడకపోతే రాష్ట్రం యూపీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి ఐదేళ్ళలోనే వచ్చేది. తెలంగాణకు అడ్డుపడిన ఏకైక వ్యక్తి రాజశేఖర్‌రెడ్డి అని స్వయంగా ప్రధాని ఆయన సీనియర్ సహచరులతో చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి ఒక్కడే బతికి ఉన్నప్పుడు అడ్డుపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు వందల మంది తయారయ్యారు కదా?
రాజశేఖర్‌డ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనదంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నాడు. ఈ వర్గంలో రకరకాల వ్యక్తులున్నారు. ప్రధానంగా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ శక్తులు, పారిక్షిశామికవేత్తలు, మీడి యా. ఇట్లా ప్రతిరంగంలో రాజశేఖర్‌రెడ్డి మనుషులు ఎదిగారు. వాళ్ళంతా ఆయనతో లాభపడ్డ వాళ్ళే. రాజశేఖర్‌డ్డి దయాదాక్షిణ్యాల వల్ల చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. కొందరు మంత్రి పదవులు పొందారు. కాబ ఆయన పోయిన తరువాత ఆయన కొడుకు పాలిట విధేయత చూపిస్తున్నారు. దానికి కారణం రాజకీయ విలువలు కాదు. దాని వెనుక ఉన్న పెట్టుబడి. రాజశేఖర్‌డ్డి లేకపోయినా ఆయన వర్గం ఇప్పుడు జగన్ కోసం తెలంగాణను అడ్డుకుంటున్నది.
జగన్ ఒక మామూలు పార్లమెంటు సభ్యుడు, ఆయన, ఆయన వర్గం తెలంగాణను అడ్డుకోగలుగుతుందా?(అప్పటికి జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు)
నిస్సందేహంగా! జగన్ ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు. ఆర్థికంగా ఒక ప్రబలమైన శక్తిగా ఒక వర్గాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తున్నవాళ్ళు జగన్ విధేయులు. జగన్ ప్రమేయం లేకుండా వీళ్ళు మాట్లాడుతారా? వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే జగన్ మౌనంగా ఉంటున్నాడు. మౌనం ఏమిటి? అర్ధాంగీకారం. జగన్ తెలంగాణ వ్యతిరేకి అనడంలో నాకెలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ మాట వింటుందని నేననుకోను. రాజశేఖర్‌డ్డి ఒత్తిళ్లకు తలొగ్గింది. జగన్ ఒత్తిళ్లకు లొంగితే ఈ పాటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాడు. ఢిల్లీలో తెలంగాణ ఎంపీల సమావేశంలో ఆయన పాల్గొనడం దానికి సూచనే. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రాంతపు ఎంపీలతో చర్చలు జరుపుతుంటే అక్కడ జగన్‌కు ఏం పని? అక్కడ ఆయన ఏదో స్థాయిలో చక్రం తిప్పాలని అనుకుంటున్నాడు. అయినా తెలంగాణ ప్రాంతపు ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్‌తో చర్చించడం ఏమిటి? వీరంతా సీనియర్స్. ఆయన కొత్తవాడు. ఇదంతా జగన్ ప్రభావమా? లేక ఆయన దగ్గరున్న డబ్బు ప్రభావమా తెలియదు, కానీ ప్రభావం మాత్రం ఉంది. రాజశేఖర్ రెడ్డి పోయిన తరువాత కొడుకు ప్రభావం నడుస్తోంది. అందులో నుంచి వీళ్ళు పూర్తిగా బయటకు రాలేకపోయారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు.

తెలంగాణ ఏర్పడాలంటే సీమాంధ్ర ప్రజల అభివూపాయం తీసుకోవాలి అంటున్నారు..
ప్రజల అభివూపాయం అంటే ఒక్కొక్కరిదా..? పార్టీలదా? డిసెంబర్ 9 ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశం లో అన్నిపార్టీలు తెలంగాణకు ఎస్ అన్నాయి కదా! ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో వివిధ ప్రాంతాల ప్రజల అభివూపాయం అంటే ఆ ప్రజలకు ప్రాతిని ధ్యం వహించే రాజకీయ పార్టీల అభివూపాయమే కదా! అఖిల పక్షంలో ఏ పార్టీలు తెలంగాణ వద్దన్నవి? అన్ని పార్టీలు అంగీకరించాయి. ఒక్క ఎంఐఎం మాత్ర మే తటస్థంగా కనిపించింది. అంతకంటే వేరే ప్రజాస్వామిక ప్రక్రియ ఏముంటుంది? ఆ మరునాడే పార్టీలు మాట తప్పితే ఈ రాజకీయ ప్రక్రియ కు, ప్రజాస్వామ్య వ్యవస్థకు విలువేముంటది?
రాజకీయపార్టీలు వ్యతిరేకంగా ఉంటే ఏకాభిప్రాయ సాధన ఎలా సాధ్యం?
రాజకీయ పార్టీలు అవసరం రీత్యా మాటలు మారుస్తున్నాయి. వాటికి పెత్తందారీ మనస్తత్వం ఉంటుంది. పెద్ద రాష్ట్రం మీద పెత్తనం చేయాలనే ధోర ణి ఇది. అయినప్పటికీ తెలుగుదేశం, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు ఒప్పుకున్నాయి. పొత్తులు పెట్టుకున్నాయి. తరువాత మాటలు మారుస్తున్నాయి. చంద్రబాబు అయినా, రాజశేఖర్‌డ్డి అయినా చేసింది అదే. వాళ్ళ పెత్తనం సాగాలి. ఆయా పార్టీల్లో తెలంగాణ నాయకులను ఎదగనివ్వరు. తెలంగాణ నాయకులు గట్టివాళ్లయితే ఎవరూ ఇట్లా మాటమార్చే సాహసం చెయ్యరు. రాజశేఖర్‌డ్డినే తీసుకోండి. తెలంగాణ విషయంలో జరిగిన ఒప్పందానికి ఆయన అంగీకరించాడు. అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయాడు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఏకాభివూపాయానికి వచ్చే చంద్రబాబు పొత్తుకోసం వచ్చాడు. కలిసి పోటీ చేశాడు. తీరా తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చాక మాట మార్చుకున్నాడు. ఆంధ్రప్రాంత నాయకత్వ ఆధీనంలోఉండే ఏ పార్టీ అయినా అంతే! సమస్య కోస్తావాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, రాయలసీమ వాళ్ళు వద్దంటున్నారా కాదు. రాజకీయ ఏకాభివూపాయం అంటే ఈ పార్టీలు ఒప్పుకోవాల ని కాదు. తెలంగాణ విషయంలో జాతీయస్థాయిలో నిర్ణయం జరగాలి.

జాతీయస్థాయిలో ఏకాభివూపాయం ఉందని అనుకుంటున్నారా..!
కచ్చితంగా ఉంది. ఇప్పటికే జాతీయస్థాయిలో అపారమైన ‘విస్తృత అంగీకారం’ ఏర్పడ్డది. కాబట్టే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. లెఫ్ట్ నుంచి రైట్ వరకు అందరూ రాతపూర్వక అంగీకారం తెలిపారు. దానికి నేనే సాక్షిని. లేఖలు ఇచ్చిన వాళ్ళు మాటకు నిలబడితే లోక్ భలోని 545 మంది సభ్యుల్లో 500 మంది తెలంగాణకు అనుకూలమే. కనుక పార్లమెంటు నిర్ణయించాలి. ఇక్కడేదో ఆంధ్ర ప్రాంతపు నాయకుల అసమ్మతితో, ఆంధ్రవూపదేశ్ శాసనసభ సమ్మతితో సంబంధం లేదు. అది జరిగే పని కూడా కాదు. ఇప్పుడు కేంద్రం చేయాల్సిందల్లా పార్లమెంటులో బిల్లు పెట్టడం. దానికి రాష్ట్ర శాసన సభ సమ్మ తి అక్కరలేదు. అభివూపాయం మాత్రమే కావాలి. ఆ అభివూపాయం అనుకూలం గా ఉన్న ప్రతికూలంగా ఉన్నా అది పార్లమెంటుకు బైండింగ్ కాదు. గతంలో గుజరాత్, మహారాష్ట్ర ఏర్పడినప్పుడు ఇటువంటి పరిస్థితే ఏర్పడితే కేంద్రం ఓవర్ రూల్ చేసింది. సుప్రీంకోర్టు దానిని సమర్థించింది. కనుక అల్టిమేట్‌గా పార్లమెంటు నిర్ణయించాలి.

ఒత్తిడులకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే?
పబ్లిక్‌గా చేసిన ప్రకటన మీద నిలబడకుండా ఒత్తిడులకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలా కేంద్ర ప్రభుత్వం చేసి న వాగ్దానం నుంచి తప్పుకుంటే తెలంగాణలో అంతకంటే భీకరమైన పరిస్థితి తలెత్తుతుంది. అలా జరిగిన రోజు చాలా అనర్థాలు జరుగుతాయి. జాతీయస్థాయిలో అన్నిపార్టీలు అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం అవసరం, వాంఛనీ యం, అనివార్యం అని నిర్ద్వందంగా చెప్పిన తరువాత అడ్డంకి లేదు. అలాగని మాట తప్పితే కలిసి ఉన్నన్ని రోజులు ఘర్షణలు ఇంకా పెరుగుతాయి.

తక్షణ కర్తవ్యం ఏమిటి..
తెలంగాణ ఉద్యమానికి మూడు దశలున్నాయి మొదటిది భావ వ్యాప్తి. అది జరిగిపోయింది. రెండోది ఆందోళనా కార్యక్షికమం. అది కొనసాగుతోంది. ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ. అది జరగాల్సి ఉంది. దానిని పూర్తిచేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తి చేస్తుందని నేను నమ్ముతున్నాను.
రాజకీయ నాయకత్వం అంటే టీఆర్‌ఎస్ ఒక్కటేనా..
తెలంగాణలో రాజకీయ నాయకత్వానికి కొదువలేదు. టీఆర్‌ఎస్ ఒక్కటే అని నేను అనలేదు. కానీ కచ్చితంగా టీఆర్‌ఎస్ కూడా..
మీరు టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరలేదు.. కేసీఆర్‌తో సన్నిహితంగా ఉన్నారు.
ఒక్క టీఆర్‌ఎస్ అని కాదు. నేను ఏ పార్టీలో సభ్యుణ్ణి కాదు. కానీ అన్ని పార్టీలతో పనిచేశా. నా స్వప్నం తెలంగాణ! 1952లో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ అన్న ప్రతిఒక్కరితో కలిసి పనిచేశాం. చెన్నాడ్డి రంగవూపవేశం చేయక ముందు మదన్‌మోహన్, మల్లికార్జున్. ఆ తరువాత తెలంగాణ ప్రజాసమితి సారథ్య బాధ్యతలు స్వీకరించిన చెన్నాడి.్డ 1980 తరువాత మళ్ళీ చెన్నాడ్డి, ఇంద్రాడ్డి, జానాడ్డి, చిన్నాడ్డి ఇట్లా అందరికీ నివేదికలివ్వడం, ఉపాన్యాసాలు రాసివ్వడం, ఉపాన్యాసాలివ్వడం ఇదే నా పని. కానీ నేను ఏ పార్టీలో చేరలేదు. చెన్నాడ్డి నన్ను హనుమకొండ నుంచి, ఆనందరావు తోటను భువనగిరి నుంచి పోటీచేయవలసిందిగా కోరాడు. మేం ఒప్పుకోలేదు. భావజాల వ్యాప్తి ముఖ్యమని అందులో నిమగ్నం అయ్యాము. ప్రాక్టికల్ పాలిటిక్స్‌ని తట్టుకోలేం. అంతే కాదు నా స్వేచ్ఛను నిలుపుకోవాలనే ఏ పార్టీలో చేరలేదు. చంద్రశేఖర్‌రావుతో సన్నిహితంగా మెలగడానికి కారణం ఏమంటే ఆయన పార్టీ పెట్టడానికి ముందు ఆయనతో కలిసి ఆరేడు మాసాలు సుదీర్ఘంగా చర్చలు జరిపాం. తెలంగాణ సమస్య పుట్టుపూర్వోత్తరాలు, ఉద్యమంలో ఉండే సమస్యలు ఇట్లా అనేక విషయాలు ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడని నాకు అర్థమయ్యింది. ఒక విద్యార్థి మాదిరిగా గంటల తరబడి ఆయన తెలుసుకునే పద్ధతి నాకు నచ్చింది. ఆయన ప్రతిదాన్నీ అట్లా ఎందుకు, ఇట్లా ఎందుకు కాకూడదు అని క్రిటికల్‌గా ఆలోచించేవాడు. ఆయనకు పరిజ్ఞానం ఉందని నాకనిపించింది. సుదీర్ఘంగా లోతుగా అధ్యయనం చేయాలనే కోరిక ఉందనిపించింది. తెలంగాణ సమస్య మీద కేసీఆర్‌కు ఉన్నంత పట్టు చాలా తక్కువ మందికి ఉంటుంది. కేవలం అవగాహనే కాదు. ప్రజల, భాష నుడికారం తెలిసిన వ్యక్తి ఆయన. ఒకటి తెలంగాణను అర్థం చేసుకోవడం అయితే, రెండోది -రాజకీయ నాయకుడిగా సమకాలీన రాజకీయ నాయకులు యెట్లా ఉంటారో అట్లాగే ఉన్నాడాయన. అందుకు భిన్నంగా ఉంటే రాజకీయ నాయకుడు నిలబడ లేడు.

కేసీఆర్ నిలబడతాడా?
అనే అనుకుంటున్నాను. రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి కేసీఆర్ లాంటి వ్యక్తే కావాలి. మనకు కావాల్సిన ఈ తరం నాయకులు ఆకాశంలోంచి రారు. ఉన్నవాళ్ళలో ఎవరో ఒకరిని నమ్మాలి. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఒకరైన చంద్రశేఖర్‌రావులో ఆ లక్షణాలున్నాయి. ఆయన ఉద్యమాన్ని ఇంతకాలం నడిపించాడంటే ఆయన విశిష్టత. ఇవి రెండు భిన్న మైన పార్శ్వాలుగా నేను గుర్తించాను. కేసీఆర్‌లో తెలివితేటలు, వాదనా పటి మ, సమకాలీన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలున్న వ్యక్తిగా నాకు నచ్చాడు. అప్పుడప్పుడు మన అంచనాలు తప్పవచ్చు. ఒడుదొడుకులు ఎదురు కావొ చ్చు. ఆయన వ్యవహారశైలి చాలామందికి నచ్చకపోవచ్చు. కొందరు విభేదించవచ్చు. కొన్నిసార్లు నాతో విభేదించినా చాలాసార్లు నా మాట విన్నాడు. నా దృష్టిలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టువిడవకుండా పదేళ్లనుంచి ఉద్యమాన్ని కాపాడుతున్నాడు. అది చూసే నిలబడతాడని అనుకుంటున్నాను. మీడియా మా మీద అనేక అసత్య ప్రచారాలు చేసింది. ఆయన గౌరవించడని, అమర్యాదగా ప్రవర్తించాడనీ రాసింది. అందులో అణువంత కూడా నిజం లేదు. నిజానికి ఆయన నా పట్ల అమర్యాదగా ఉన్న సందర్భం ఒక్కటి కూడా లేదు.
మీరు చంద్రగుప్తున్ని మలచిన చాణక్యుడులా మాట్లాడుతున్నారు.
అంత పెద్ద పోలిక కూడా అవసరం లేదు. అలా నేననుకోను. కేసీఆర్ చంద్రగుప్తుడే కావచ్చు నేను మాత్రం చాణక్యున్ని కాదు.
మీరు తెలంగాణ సిద్ధాంతకర్త అని మీడియా అంటోంది.
నేనట్లా అనుకోవడం లేదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఒక కార్యకర్తను. ఒక సామాన్యమైన కార్యకర్తను. తెలంగాణ ఒక్కటే నాకల. నేను జీవితంలో కన్న ఒకే ఒక్క కల అది. అది నెరవేరాలి.
ఎప్పుడు నెరవేరుతుంది.?
2012. అవును. రెండువేల పన్నెండులో మనం స్వరాష్ట్రంలో ఉంటామన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ నమ్మకం కేవలం రాజకీయ ప్రక్రియ మీద కాదు. ఆ రాజకీయాలను శాసించే తెలంగాణ యువతరం, విద్యావంతుల మీద. ఆ విశ్వాసంతోనే నేను ఈ నమ్మకాన్ని స్థిరపరచుకున్నాను. ఇప్పుడు మా తరం ముగిసింది. కొత్త తరం వచ్చింది. వాళ్ళమీద నాకు నమ్మకం ఉంది. ఒకప్పుడు మేం ఒంటరివాళ్ళం. తెలంగాణ ఒంటరివాదం. కానీ ఇప్పుడు వేలాదిమంది తెలంగాణ గురించి మాట్లాడడానికి ఉన్నారు. లక్షలాదిమంది తెలంగాణవాదాన్ని అనుసరిస్తున్నారు. అంతిమంగా విజయం సాధిస్తారు. అంతదాకా విశ్రమించరు. !!

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్:[email protected]

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ