బలిదానం తప్ప మరి దారే లేదా?


Thu,July 28, 2011 07:32 PM

బొంబాయిలో ఉండే సంగమేశ్వర్‌రావు గారికి తెలంగాణ అంటే పంచ ప్రాణా లు. అతను ఇంజనీర్‌గా వృత్తిరీత్యా అక్కడున్నాడు గానీ, ఆయన ప్రతిక్షణం తెలంగాణ తప్ప మరొకటి ఆలోచించడు. ఎప్పటికప్పుడు పరిణామాలు గమనిస్తూ తెలంగాణవాదులు ఏం చేయాలో ‘ఎస్‌ఎంఎస్’లు పెడుతుంటా డు. ఫోన్ చేసి అప్రమత్తం చేస్తుంటాడు. ఈమధ్య వాళ్ల తల్లి చనిపోతే ఆమెకు ‘కర్మ’ చేసే సందర్భంలో కూడా తెలంగాణ రావాలని ప్రార్థిస్తూ పిండ ప్రదా నం చేసిన పిచ్చి అభిమానం అతనిది. గత వారం ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మహత్య వార్త తెలిశాక ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనే కాదు యావత్ తెలంగాణ అదే ఉద్వేగానికి గురైంది. ‘సార్ ప్లీజ్ ఎలాగైనా సరే ఈ ఆత్మహత్యల్ని ఆపండి..’ అంటూ పదే పదే ప్రాధేయపడ్డాడు. చివరకు యాదిరెడ్డి యాదితో బొంబాయి వెళ్తున్నట్టు ఆదివారం నాడు ఎస్‌ఎంఎస్ పంపించాడు. తెలంగాణ బాధనంతా తనలో నింపుకున్న అతని బాధను మనం అర్థం చేసుకోగలం.


AADIREDDY-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema మనమే కాదు యాదిరెడ్డి ఆత్మహత్యను, ఆ తరువాతి పరిణామాలను గమనిస్తోన్న ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టి చూపిన అతని ఉత్తరం చదివిన ఎవరికైనా మనసు చలిస్తుంది. రక్తం ఉడుకుతుంది. కానీ హృదయం లేని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ చావు ఏ మార్పు తేగలిగింది? చీమూ నెత్తురు లేని రాజకీయాలను అతని మృతి ఏ మాత్రం కదలించగలిగింది? రాజీనామాలు చేయండి, ఒక సంక్షోభాన్ని సృష్టించండి, తెలంగాణను తీసుకురండి అని ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆరువందల ప్రాణాలకు ఈ రాజ్యం నిజంగానే విలువనిచ్చి ఉంటే.. స్పీకర్ వాళ్ల త్యాగాల ప్రతిఫలాలైన ఆ రాజీనామాలను అలా చెత్తబుట్టలో పడేసి ఉండేవాడా? తమ మీద ఒత్తిడి ఉంది కాబట్టి రాజీనామాలు చేశామని చెప్తున్నారు తప్ప, తామే ఒత్తిడిని పెంచే మార్గాలను మన ప్రజావూపతినిధులు ఎందుకని అన్వేషించడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవని తెలుసు. కానీ ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజల మనసులో ఉన్నా యి. అవే ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద చివరకు నాయకత్వంలో ఉన్న అందరిమీదా నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. అలాంటప్పుడు యాదిరెడ్డిలా ఆలోచిస్తోన్న వాళ్లకు ఎవరైనా ఏమని నమ్మకం కలిగించగలం. పోతున్న ప్రాణాల విలువ తెలుసు కాబట్టి ఆత్మహత్యలు వద్దంటున్నాం. కానీ ప్రాణాలకంటే ప్రజలు తమ ప్రాంతానికే ఎక్కువ విలువనిస్తున్నప్పుడు ఆ ప్రాణాలను కాపాడే శక్తి మనకున్నదా?
ఒక ప్రభుత్వానికి, ప్రభుత్వంలో భాగమైన నాయకులకు తప్ప ఆ శక్తిమనలో ఎవరికీ లేదన్నది వాస్తవం. మరి వాళ్లను ఎవరు మార్చాలి? ఇంతటి బలమైన ఉద్యమం, ఆ ఉద్యమంలో వ్యక్తమవుతోన్న ప్రజాస్వామిక ఆకాంక్షలన్నిటినీ వాళ్లు పరిహాసం చేస్తుంటే.. చావు తప్ప ఏం మిగిలి ఉంటుంది? అయినా మనమే గనుక అంతటి భరోసా ఇచ్చి ఉంటే ఇన్ని ప్రాణత్యాగాలు ఉండేవా అన్నది కూడా ఆలోచించాలి.

ఎవరైనా ఎందుకు చనిపోవాలనుకుంటారు? తనతో పాటు బతికి ఉన్నవాళ్లు బతకడానికి కావాల్సిన భరోసా ఇవ్వలేకపోయినప్పుడు, మొత్తంగా తన కలకూ వాస్తవానికీ మధ్య పూడ్చలేని అగాథమేదో ఉందని అర్థమైనప్పుడు ఏ మనిషి అయినా బతకడంలో ఇక అర్థం లేదనే అనుకుంటాడు. ఒక తత్వవేత్త చెప్పినట్టు ‘అల్లకల్లోమైన మనసుకు ఆత్మహత్య చేసుకోవడం ఒక గొప్ప ఓదార్పు. దాని వల్లే మనిషికి తన మానసిక సంఘర్షణ నుంచి శాశ్వత విముక్తి దొరుకుతుంది’. సరిగ్గా యాదిరెడ్డి కూడా అలాగే అనుకున్నాడు. అది తన చివరి లేఖలో చెప్పాడు. అతని నిర్ణయం ఎంత బలీయమయిందంటే అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె చేతి వంట కడుపారా కమ్మగా తిని వెళ్లాలని అనిపించినా.. ఆ అనురాగం మళ్లీ బతికిస్తుందేమోనని భయపడి, చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చి తను అమితంగా ప్రేమించిన అమ్మ నుంచి, ఆ అమ్మ కంటే ఎక్కువగా ఆరాధించిన ఈ తెలంగాణ గడ్డ మీదనించి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.

అలా వెళ్లినవాడు ఘనత వహించిన భారత ప్రజాస్వామ్యానికి ఒక సవాలు విసిరి, ఈ వ్యవస్థ వైఫల్యాలకు ఒక మౌనసాక్షిగా నిలిచిన పార్లమెంటు భవనం ముందు తన నిండైన ప్రాణాల్ని బలిదానంచేశాడు. ఒక యువకుడు తన ముప్ఫై ఏళ్ల జీవితంలో పదేళ్లుగా ఒకే కలలో జీవించాడు. అందరు తెలంగాణ యువకుల్లాగే, తన తండ్రులూ, తాతల తరంకాని విజయమేదో తనది కాబోతుందని నమ్మాడు. రెండేళ్ల పాటుగా నాలుగు కోట్ల మందిలో భాగంగా తనూ నిలబడి పోరాడినా గెలవలేకపోవడంపై దిగులు చెందాడు. నివేదనలు, నిరసనలు మొదలు వంటలూ వార్పుల దాకా అన్ని ప్రజాస్వామిక పద్ధతులను పాటించింది తెలంగాణ సమాజం. అందులో అతనూ భాగమైనాడు. అయి నా ఢిల్లీకి సెగ తగలనే లేదు. ఢిల్లీ దిగి రాలేదు. ఇక కుదరదనుకున్నాడో ఏమో.. తనే రైలెక్కిండు. రోజంతా ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకున్నాడు. తన మదిలో మెదిలిన ప్రతి ఆలోచనను తన సుదీర్ఘ లేఖలో రాసిపెట్టి పార్లమెంటు ముందే ప్రాణాలు తీసుకున్నాడు.


యాదిరెడ్డి ఢిల్లీని, పార్లమెంట్‌నే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ దేశ రాజధాని అది. తెలంగాణ విషయం తేల్చాల్సిన వాళ్లంతా అక్కడే ఉన్నారు. ప్రధాని మన్మోహన్, సోనియా, చిదంబరం, అహ్మద్ పటేల్, కొత్తగా ఆజాద్ ఇట్లా తెలంగాణపై మాట్లాడిన వాళ్లు, మాట మార్చిన వాళ్లు, ఎంతకూ మాట్లాడని వాళ్లు అంతా అక్కడే కొలువు దీరి ఉంటారు.‘ఇచ్చేవాళ్లం, తెచ్చే వాళ్లం’ అని చెప్పుకుంటూ రెండేళ్లుగా ఊరిస్తున్న వాళ్లంతా ఒక కొత్తనాటకంలో మూగ పాత్రలై ఆ ఊరిలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా తన తరఫున, తన ఊరి తరఫున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీ కొలువులో మంత్రి గా ఉండి అక్కడొక పెద్దమనిషిగా చెలామణి అవుతోన్న జైపాల్‌డ్డిగారు అక్కడే ఉన్నారు. అందుకేనేమో అక్కడే తేల్చుకోవాలని యాదిరెడ్డి అనుకున్నాడు. తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని యాదిరెడ్డికి వచ్చిన స్పృహ ఆ పెద్దమనిషికి వచ్చిఉంటే ఒక్క యాదిడ్డే కాదు ఆరువందల మంది అమాయకులు బలి అయ్యేవాళ్లు కాదు. యాదిరెడ్డి తన లేఖలో అనేక విషయాలు ప్రస్తావించిండు. ప్రజాస్వామ్యం ముసుగును లాగేసిండు. బాధ్యత మరిచిపోయిన జైపాల్‌తో సహా పాలకులందరికీ పేరుపేరునా తన ఆవేదనను తెలుపుకున్నాడు. సోనియా, మన్మోహన్‌లకు వాళ్ల బాధ్యత గుర్తుచేసిం డు. తన శవాన్ని ఒక్కసారి చూడమని ప్రధానిని ప్రాధేయపడ్డాడు.

కనీ సం అలాగైనా ప్రజాస్వామ్యం కళ్లు తెరుచుకుంటాయేమోనని ఆశించాడు. కానీ ప్రధానికి అంత తీరికెక్కడిది? అయినా మార్కెట్ భాష తప్ప మరో విషయం అర్థం కాని వాళ్లకు త్యాగాల భాష అర్థమవుతుందా? తెలంగాణలో 141 మంది ప్రజావూపతినిధులు రాజీనామా చేస్తేనే స్పందించకుండా తిరస్కరించిన ప్రభుత్వం ఒక్క ప్రాణానికి స్పందిస్తుందని ఎలా భావించాడు? తనకంటే ముందు కొన్ని వందలమంది తమ విలువైన ప్రాణాలను త్రుణవూపాయమనుకుని వదిలేసినా కనీసం చలించని వాళ్లు తన ప్రాణానికి విలువిస్తుందని ఎలా అనుకున్నాడు? విలువ ఇవ్వడం అటుంచి ఒక అనాథ శవం లా ఈ ప్రభుత్వమే స్మశానానికి తరలించాలని చూసిందంటే ఎట్లా అర్థం చేసుకుంటాం. అవును.. యాదిరెడ్డికిలాగే ఇవాళ కోట్లాది గుండెలకు ప్రాణవూపదమైన తెలంగాణను కూడా ఢిల్లీ వీధుల్లో అనాథగా వదిలేసింది ప్రభుత్వం. అయినా ప్రజలు భరిస్తూనే ఉన్నారు. అవమానాలు దిగమింగుకుంటూ నిలబడి పోరాడుతూనే ఉన్నారు. కొందరు ఇదే అదునని చర్చల్లో తమ బేరసారాలను పెంచుకునే పోటీలో కమిటీలో స్థానం కోసం కుస్తీ పడుతున్నారు.

మరికొందరు నీరే లేని రెండు కళ్లల్లోంచి అశ్రునివాళులు ప్రకటిస్తున్నారు. ఇంకొందరు నేలకొరిగిన వీరపువూతుల శవాల మీద నాలుగు చిల్లర పైసలు దొరుకుతాయేమో అని అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉన్నారు. అయినా జనం జాతరగా కదులుతున్నారు. అలా నిర్దయగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లను అమరులనీ, త్యాగధనులనీ అంటున్నారు. గొంతెత్తి కోట్లాది గానాలాపన చేస్తున్నారు.
పోరాటంలో నుంచి వైదొలిగిన వాళ్లను వీరులనే అందామా? బాధతోనో, భయంతోనో, భక్తితోనో, దిగులుతోనో, వ్యాకులతతోనో ఇవన్నీ ఇంకొన్నీ కలగలిసిన బాధ్యతా రాహిత్యంతోనో, బలవన్మరణం పొందిన అందరినీ అమరులనే అందామా? చావు అనే సాహసానికి ఒడిగట్టినందుకు వాళ్లను ఏమందాం? ‘నేను బతకకపోయినా పరవాలేదు తెలంగాణ వస్తే చాలు’ అనుకుని నిండైన ప్రాణాలను తాగ్యం చేసిన వాళ్లను ఎలా పిలుద్దాం? వాళ్లు చేసింది నిజంగానే త్యాగమే కావచ్చు, కానీ ఫలితంలేని త్యాగం వల్ల ప్రయోజనంలేని చావు వల్ల సాధించేది ఏముంటుంది? నిలబడి పోరాడిన వాడే కదా వీరుడు. నిజమైన పోరాటంలో మరణిస్తేనే కదా అమరుడు.

అన్యాయమైన విషయమేమిటంటే బతుకు కోసం మొదలైన పోరాటం ఇవాళ చావుదశకు చేరడం. చావులే పోరాట రూపాలుగా మారిపోవడం ఉద్యమ దశలో ఒక మహా విషాదం. ఇది రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ చుట్టూ అన్ని పార్టీలు ఆడుతున్న ఆటలో తెలంగాణ పిల్లలిలా బలిపశువులు కావాల్సి వస్తోంది. ఈ బలిదానాలకు మన రాజకీయ పార్టీలు, ఆ పార్టీల ఆచరణలోని లోపాలే కారణంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నవాళ్ల మరణ వాంగ్మూలాల్లో పదే పదే కనిపిస్తున్న అభ్యర్థన ‘అందరూ కలిసి పనిచేయాలని.

ఐక్యంగా పోరాడి తెలంగాణ తేవాలని! తమ చావులతోనైనా తెలంగాణ శక్తులు ఏకం కావాలనీ’ వాళ్లు పదేపదే ప్రాధేయపడుతున్నారు. ఎంత దారుణం. నలుగురు స్వార్థపరులను కలపడానికి ఇన్ని నిండు ప్రాణాలు బలికావాలా? రాజీనామాలు చేయాలంటూ వందలమంది పిట్ట ల్లా రాలిపోయినా పట్టించుకోని వీళ్లు చివరికి పదవులు వదలినట్టు భ్రమపెడుతున్నది తమ భవిష్యత్తు చీకటి పాలవుతుందేమోనని బెంగతోనే తప్ప తెలంగాణ మీద భక్తితో కాదు గదా! పైగా రాజీనామాలు భావోద్వేగంతో చేసినవి కాబట్టి ఆమోదించనని స్పీక ర్ చెప్తే, మళ్లీ రాజీనామాలు చేయం అని భీష్మించుక్కూర్చుంటున్న వాళ్లు ఈ చావులకు ఏమని జవాబు చెపుతారు. చర్చలని పిలవగానే చెవులూపుకుంటూ వెళ్లిన ఈ గంగిద్దులు అధిష్ఠానాల వద్ద వాళ్ల పరపతి పెంచుకుంటున్నారేమో గానీ తెలంగాణ పరువు తీస్తున్న సంగ తి గుర్తించాలి.

అయినా రాజకీయాల ఆటలో చంపుడు పందెం పెట్టుకుని ఒకరి వెంట ఒకరు పరుగెడుతోన్న వీళ్లు కలిసి పనిచేయాలని కోరుకోవడం, దాని కోసం ప్రాణాలు వదులుకోవడం అమాయకత్వం. ఈ అమాయకత్వం ఇప్పటికి వందలాది మందిని బలిగొన్నది. తెలంగాణ ప్రజలు ఒక్క తాటిమీద ఉన్నారన్న సంగతి ఇప్పటికే పదేపదే రుజువయ్యింది. ముఖ్యంగా ప్రజలు, జేఏసీ ఒక్కటిగా ఉన్నంత కాలం రాజకీయ పార్టీలు ఎక్కడున్నా ఎలా ఉన్నా పెద్దగా పోయేదేమీ లేదు. జేఏసీకి తన బలమేమిటో అర్థమయినట్టు లేదు. జేఏసీ ఆత్మవిశ్వాసంతో ఉంటే, ప్రజలను నిరంతరం కదిలించే రీతిలో కార్యాచరణ ఉండి ఉంటే ప్రజలకొక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అవసరం. ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఉద్యమ పంథా మార్చాల్సి ఉంటుందేమో ఆలోచించాలి. చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్టు తమ మనసులోని భావాలకు, ఆలోచనలకు, ఆశలకు అనుగుణంగా సమాజం నడవనప్పుడు మాత్రమే వ్యక్తుల్లో నిరాశ నిస్పృహ మొదలవుతాయి.

ఆ నిస్పృహే మనిషిని తనని తాను చంపేసుకునే నిస్సహాయుణ్ణి చేస్తుంది.
యాదిరెడ్డి చావు ఈ ప్రభుత్వపు మొండితనానికి, రాజకీయ వ్యవస్థ చేతగాని తనానికి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న జులాయి తనానికి ఒక మానవీయ నిరసనగానే భావించాల్సి ఉంటుంది. నిన్నటి దాకా మనలో ఒకరిగా బతికిన వాళ్లు, మనతో పాటు నడిచిన వాళ్లు, తమతో కొందరినైనా నడిపించుకు కదలినివాళ్లు, తమలాంటి మనందరికీ ఒక కొత్త జీవితం కావాలని తపించిన వాళ్లు.. ఇలా ఒక్కొక్కరుగా రాలిపోతుంటే ఇక చివరిదాకా ఎవరు మిగులుతారు? అలాంటి తెలంగాణ ఈ రాజకీయ నాయకులకు తప్ప ఎవరికి ఉపయోగపడుతుందో ఆలోచించాలి. అయినా చావుల వల్ల తెలంగాణ రాదు. ఒకవేళ వస్తుందని ఎవరైనా అనుకుంటే అది కచ్చితంగా సామాన్యుల చావులతో మాత్రం కాదన్న సత్యం గుర్తించాలి. అయినా ఇంత జరుగుతున్నా ఇంకా దాపరికాలతో పనిలేదు. ఏదో ఒకటి చెప్పేయండి. ప్రజలు కూడా తమకు తోచిన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు.

పొ. ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులు

40

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

country oven

Featured Articles