వాడుక భాషకు గొడుగు


Sun,April 7, 2013 09:18 AM

Gidugu-Rammurthyఆదిమ సవరజాతి గిరిజనుల భాషకు లిపిని, నిఘంటువు ను రూపొందించి, తెలుగువాడుక భాషోద్యమానికి వెన్నుముకగా నిలిచిన గిడుగు రామమూర్తి తెలుగు జనులకు సుపరిచితులు. తెలుగుభాషలో వ్యవహారిక భాషావ్యాప్తికి కృషి చేసిన గిడుగు గ్రాంథిక భాషావాదుల పాలిట ‘పిడుగు’ అని ప్రసంశలందుకున్న ఘనాపాటి. ఆయన పూర్తిపేరు గిడుగు వెంకట రామమూర్తి పంతులు. శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో గిడుగు వీర్రాజు, వెంకటమ్మ దంపతులకు 1863 ఆగస్టు 29 న జన్మించారు. విజయనగరం మహారాజా కళాశాలలో గురజాడ అప్పారావుకు గిడుగు సహాధ్యాయి.

బాహ్యవూపపంచానికి దూరమైన సవర తెగ గిరిజనుల ఆర్థిక, జీవన స్థితిగతులను గమనించిన గిడుగు సవర భాషలోనే విద్య నేర్పించి, వారికి పాఠశాలలు నెలకొల్పారు. గిడుగు సవరల విద్యపై ఆసక్తి చూపడానికి కారణం వారికున్న చారివూతక నేపథ్యమే. సింధూ నాగరికత వెల్లివిరియడానికి ముందే సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా సవరలకు ప్రత్యేక నాగరికత, సంస్కృతి ఉంది. రామాయణం, భారతం, వైదిక సూత్రాలలోనూ- సవరల ప్రస్తావనను గమనించవచ్చు. రామాయణంలో ఎంతో ఉదాత్తతకు, సేవాభావానికి పేరుగాంచిన ‘శబరి’ సవర తెగ మహిళే కావడం విశేషం.

మన రాష్ట్రం లో శ్రీకాకుళం, విశాఖ జిల్లాలోని కొండ వూపాంతాల్లో అనేక మంది సవరలు నివసిస్తున్నారు. కానీ వీరిలో కనీస అక్షరాస్యత కొరవడి, వీరి సాంస్కృతిక జీవనం చతికిలపడి అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదు. శ్రీకాకుళం జిల్లాలో పర్లాకిమిడి పట్టణానికి పరిసర ప్రాంతాల కొండలపై నివసించే సవరలు ఆదిమ నివాసు లు. ఆదివాసీలు కనీసం వీరికి అక్షర జ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. తినడానికి తిండి, కట్టడానికి బట్టలేని పరిస్థితుల్లోనూ ప్రత్యేక జీవన సంస్కృతి కలిగిన ఆదిమ ప్రపంచం వారిది. వీరు ఆధునిక సమాజానికి కొన్నివేల సంవత్సరాలుగా వెనుకబడి ఉండటం రామమూర్తికి బాధించింది.

వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతులుగా చేయగలిగితే సవరల బతుకులు బాగుపడుతాయని భావించిన గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. సవర వాచకాలను, కథల పుస్తకాలను, పాటల పుస్తకాలను, తెలుగు- సవర, సవర-తెలుగు నిఘంటువులను తయారు చేశారు. వాటిని 1911లో మద్రాసు ప్రభుత్వం ప్రచురించింది. ఆ పుస్తకాలకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వజూపితే’ ఆ డబ్బుతో ఒక మంచి బడి పెట్టండి. నేను పెట్టిన బడులకు గ్రాంట్లు ఇవ్వండి’ అని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరిక ప్రకారమే ప్రభుత్వం ట్రైనింగ్ స్కూలును ప్రారంభించింది. సవర భాషా రచనలు సేకరించడమే గాక, రచనలో సవర భాషా వ్యాకరణం అనేది గిడుగు సాధించిన ఎనలేని కృషి. సవర జాతీయుల విద్యాభ్యాసం కోసం పాఠశాలల ఏర్పాటుకు ప్రయత్నించారు. ఆ పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేయించారు. స్వలాభపేక్షలేని నిస్వార్థపరుడు గిడుగు.

రామమూర్తి సంఘ సంస్కరణాభిలాషి. ఆయన ఇల్లే ఒక పాఠశాల. గిడుగు పెద్ద కుమారుడు సీతాపతి, తాపీ ధర్మారావులు ఆయన వద్ద చదువుకున్నవారే. భాష అనేది సాంస్కృతిక ప్రసరణల ద్వారా వ్యక్తుల అవసరాలు తీర్చగలగాలి. గతించిన తరాల విలువలను భవిష్యత్ తరాలకు అందించాలి. ఇప్పుడున్న భాష వర్తమాన, నవతరాలకు అవసరమైన సంస్కృతి, ఆచారాలు, లక్ష్యాలను తీర్చగలగాలని భావించారు గిడుగు. అందు కు అవసరమైన భాషా సంస్కరణలను ప్రారంభించి, ఉద్యమిస్తూ విజయం సాధించిన ఘనత ఒక్క గిడుగు వారికే దక్కుతుంది.

గిడుగు సవర భాషలో వ్యాకరణం, నిఘంటువు 1911-13 మధ్య ‘A manual of savara language’ అనే వర్ణణాత్మక వ్యాకరణం 1931లో రచించారు. ఇలా గిడు గు సవర లిపి నిర్మాతగా, ఆదివాసీల అక్షర పాశ్చాత్య భాషావేత్త స్టాన్లీ స్టరోస్టా తన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాన్ని గిడుగుకు అంకితం చేయడం గమనార్హం. గిడుగు పరిశోధనలకు, సవర భాషా కృషికి మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933లో హైజర్-ఇ- హింద్’ బంగారు పతకంతో బిరుదునిచ్చి సత్కరించింది. మద్రాసు గవర్నర్ చిత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బారులో రామమూర్తి స్వయంగా అందజేశారు. జార్జి చక్రవర్తి రజితోత్సవ పతకాన్ని కూడా గిడుగుకు అందిచ్చారు. ఆ తర్వాత క్రమంగా పర్లాకిమిడి రాజువారికి, గిడుగుకు వైరం పెరిగింది.

తెలుగువారు అధికంగా ఉన్న పర్లాకిమిడిని, 200 గ్రామాలను అన్యాయంగా ‘ఒడిషా’ రాష్ట్రంలో చేర్చడాన్ని నిరసించారు గిడుగు. 22 ఏళ్ళుగా జీవిస్తున్న తన ఇంటిని 1936లో విడిచిన గిడుగు, రాజమంవూడిలో ఉండి తన నాలుగవ కుమారుడు ఇంట్లో చేరిపోయారు. 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘కళావూపపూర్ణ’ బిరుదు అందుకున్న గిడుగు దాన్ని వ్యవహారిక భాషావాదులందరికీ అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. సవరలకు బీజాక్షరాలకు నేర్పించిన ‘ఆది గురువు’గా నిలిచిపోయిన గిడుగు 1940 జనవరి 22న అస్తమించారు.
-గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం
దక్షిణాది ప్రాంతీయ కేంద్రం, రాజేంద్రనగర్, హైదరాబాద్

37

GUMMADI LAXMINARAYANA

Featured Articles